వామ్మో.. జూన్!

29 May, 2014 02:46 IST|Sakshi
వామ్మో.. జూన్!

 - స్కూల్ ఫీజులు భారం
 - పెరిగిన పుస్తకాల ధరలు
 - బెంబేలెత్తిపోతున్న  విద్యార్థుల తల్లిదండ్రులు

కామారెడ్డి, న్యూస్‌లైన్, మరో పక్షం రోజుల్లో బడులు తెరుచుకోనున్నాయి. దీంతో తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలైంది. జూన్ పేరు వింటేనే హడలిపోయేవారున్నారు. ముఖ్యంగా మధ్య తరగతి వారు పిల్లల ఫీజులు, పుస్తకాలు, డ్రెస్సులు..ఇతర సామాగ్రి కొనుగోలు వంటి విషయాల్లో ఆందోళనతో ఉన్నారు. ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అప్పుడే  చదువుల ఖర్చుల గురించి లెక్కలేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో అడ్డూ అదుపు లేకుండా పెరిగిన ఫీజులను చూసి జడుసుకుంటున్నారు.
 
 జిల్లాలో ఏడాదికేడాది ప్రైవేటు పాఠశాలల్లో ఏదో కొత్తదనమంటూ ఫీజులను పెంచేస్తున్నారు. పాఠశాలల మధ్య ఎంత పోటీ ఏర్పడుతున్నా ఫీజుల విషయంలో మాత్రం అందరూ కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించకపోవడం, ఉపాధ్యాయుల కొరతను తీర్చకపోవడం వంటి కారణాలతో పాటు కొందరు ఉపాధ్యాయులు మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలంటే విద్యార్థుల తల్లిదండ్రుల్లో దురభిప్రాయం ఏర్పడింది.

 పేదవారైన సరే తమ పిల్లలకు మంచి చదువు అందించాలనే ఉద్దేశంతో ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులను అడ్డగోలుగా పెంచుతూ విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర భారం మోపుతున్నాయి. వారి జేబులను ఖాళీ చేస్తున్నాయి. పాఠశాలలు తెరవడానికి మరో పక్షం రోజుల సమయం ఉన్నప్పటికీ యాజమాన్యాలు అప్పుడే ప్రచార పర్వం మొదలుపెట్టాయి. టెక్నో, గ్రామర్, మోడల్, కాన్సెప్ట్ వంటి తోక పేర్లు తగిలించుకుని ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

పుస్తకాల ధరలు ఆకాశంలో..
ప్రైవేటు పాఠశాలల్లో ఉపయోగిస్తున్న పుస్తకాలకు సంబంధించి ధరలు చూస్తే విస్తుపోవాల్సిందే. గతేడాది నర్సరీ, యూకేజీ, ఎల్‌కేజీ చదివే పిల్లలకు వెయ్యికి తగ్గకుండా పుస్తకాలు, నోటు పుస్తకాలు తీసుకున్నారు. ఈ సారి అవి మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే పేపర్ ధర పెరగడంతో పుస్తకాలు, నోట్‌పుస్తకాల ధరలు మరింత పెరగవచ్చంటున్నారు. అయితే ఆయా పాఠశాలల యాజమాన్యాలు పుస్తకాలు, నోట్ పుస్తకాలతో  పాటు బ్యాగులను కూడా తమ వద్దనే కొనాలనే నిబంధనలు విధిస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే కొనాల్సి వస్తోంది.

బ్యాగులు, షూస్, అన్నీ భారమే...
మార్కెట్‌లో పిల్లలకు సంబంధించిన పుస్తకాల బ్యాగులు, వాటర్‌బాటిళ్లు, షూస్.. ఇలా అన్నిరకాల వస్తువుల ధరలు పెరగడం పేరెంట్స్‌కు భారంగా మారింది. తోటి పిల్లలు రకరకాల వస్తువులు తెచ్చుకుంటుంటే తమ పిల్లలకు ఏదీ తక్కువ కాకూడదన్న భావనతో ఉన్న తల్లిదండ్రులు పిల్లలకు కావలసిన అన్ని వస్తువులు ఖరీదెంత అయినా సరే కొనుగోలు చేసి ఇస్తున్నారు. మార్కెట్‌లో అన్ని వస్తువుల ధరలు పెరగడంతో తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. జూన్ అంటేనే భయపడుతున్నారు.

మరిన్ని వార్తలు