గుడికి తీసుకెళ్లి గుండు కొట్టించారు

11 Dec, 2014 03:50 IST|Sakshi
గుడికి తీసుకెళ్లి గుండు కొట్టించారు

నిజామాబాద్ క్రైం: తమకు దొరికిన బంగారాన్ని అతి తక్కువ ధరకే ఇస్తామని ఓ బాధితుడిని ఇద్దరు మహిళలు గుడికి తీసుకువెళ్లి మోసం చేసిన వైనం ఇది. అత్యాశకు పోయిన బాధితుడు విషయం తెలుసుకుని ల బోదిబోమంటున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి బుధవారం రెండో టౌన్ రెండవ ఎస్సై నాగారాజు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని రెండవ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి కసాబ్‌గల్లీకి చెందిన కొతిమిర్‌కర్ నరేష్ మాంసం వ్యాపారం చేస్తుంటాడు.  ఇతని ఇంట్లో ఉతకాల్సిన బట్టలు చాలా ఉండడంతో కూలీ కోసం మంగళవారం నెహ్రూ పార్కుకు వెళ్లాడు. అక్కడ ఇద్దరు మహిళలకు చేయాల్సిన పనిచెప్పడంతో వారు నరేష్ ఇంటికి వచ్చారు.

వారు బట్టలు ఉతుకుతూ నరేష్‌ను బోల్తా కొట్టించడానికి మాటా మాట కలిపారు. తమకు గుప్తా నిధి దొరికిందని, అందులో బంగారం బిళ్లలు ఉన్నాయని,  వాటిని అమ్ముతామని చెప్పారు. తమ వద్ద ఉన్న అసలు బంగారం ముక్కను నరేష్‌కు ఇచ్చి దీనిని బంగారం దుకాణంలో చూపించుకోవాలంటూ సూచించారు. దీంతో నరేష్ బంగారాన్ని దుకాణంలో చూపించగా, యజమాని ఇది అసలైన బంగారమే అంటూ చెప్పడంతో ఉప్పొంగిపోయాడు.  తనకు అరకిలో బంగారం కావాలని, దీనికిగాను రూ. లక్షా 50 వేలు నగదు ఇస్తానని చెప్పడంతో  వారి మధ్య ఒప్పందం కుదిరింది.

బట్టలన్ని ఉతకడం పూర్తయ్యాక తాము బంగారం తీసుకువస్తామని, నాందేవ్‌వాడలో గల మందిరం రావాలని, అక్కడ దైవ సన్నిధిలో బంగారం ఇస్తామని  మహిళలు చెప్పారు. దీంతో వారి మాటలు నమ్మిన నరేష్ డబ్బులు తీసుకుని గుడికి వెళ్లాడు. అక్కడ  నరేష్‌కు మహిళలు బొట్టుపెట్టి రూ. లక్షా 50 వేలు నగదు తీసుకుని, ఇత్తడి బిళ్లలపై బంగారం పూత పూసిన మూడు బిళ్లలను ఇచ్చారు. నరేష్ వాటిని తీసుకుని మరోసారి దుకాణానికి తీసుకువెళ్లి చూపించగా,  అవి నకిలీ బంగారం బిళ్లలని తేలడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. తెలిసిన వారికి జరిగిన మోసం గురించి చెప్పటంతో వారి సలహాల మేరకు బుధవారం ఉదయం బాధితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వార్తలు