ఉండరాక..నీడలేక..! 

5 Dec, 2019 08:50 IST|Sakshi
పూరిగుడిసె వద్ద సాయంకోసం దీనంగా వేడుకుంటున్న అక్కా, చెల్లె

సాక్షి, జగిత్యాల: అమ్మానాన్న కానరాని లోకాలకు వెళ్లిపోయారు. అల్లారుముద్దుగా పెరగాల్సిన పిల్లలు అనాథలుగా మిగిలారు. ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల కోరిక తీర్చాలనుకున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లకు తండ్రి లక్ష్మణ్, తల్లి బాలవ్వ అనారోగ్యంతో మృతిచెందడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పూరిగుడిసెపై ప్లాస్టిక్‌ కవరు కప్పుకొని బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. ఇప్పుడు ఆ గుడిసె కూడా శిథిలావస్థకు చేరి ఎప్పుడేం ఏం జరుగుతుందోనని భయం భయంగా బతుకు వెల్లదీస్తున్నారు. జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన బిరుదుల లక్ష్మణ్, బాలవ్వకు ఇద్దరు కుమార్తెలు రజిత, జ్యోతి. వీరు చదువుకుంటున్న సమయంలోనే తండ్రి లక్ష్మణ్‌ 2009లో అనారోగ్యంతో మృతిచెందాడు. తల్లి బాలవ్వ పంచాయతీలో పారిశుధ్య కార్మికురాలుగా పని చేస్తూ ఇద్దరు కూతుర్లను చదివించింది. మూడేళ్ల కిందట తల్లిని క్యాన్సర్‌ మహమ్మారి కబలించింది.

దీంతో ఇద్దరు యువతులు అనాథలుగా మిగిలారు. తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన పూరి గుడిసెలోనే ఉంటూ రజిత ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేసుకుంటూ చెల్లెలు జ్యోతిని డిగ్రీ చదివిస్తోంది. వీరికి నాఅనే వారు లేకపోవడంతో ఇదే గుడిసెలో జీవనం సాగిస్తున్నారు. నిత్యం పని చేస్తే తప్పా పూట గడవడం కష్టతరంగా మారింది. దీంతోపాటు ప్రస్తుతం నివాసం ఉంటున్న గుడిసె కూడా శిథిలావస్థకు చేరడంతో నిత్యం బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. వర్షం పడితే గుడిసెలో ఉండడం ఇబ్బందికరంగా ఉండడంతో గుడిసెపై పాలిథిన్‌ కవరు కప్పుకుని జీవనం సాగిస్తున్నారు. అనాథ యువతులకు ఇంటి నిర్మాణ వ్యయం కోసం దాతలు ఆపన్నహస్తం అందిస్తారని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వమైనా స్పందించి తమకు గూడు, స్వయం ఉపాధి కోసం దారి చూపాలని వేడుకుంటున్నారు. బాధితులకు ఆర్థికసాయం చేసేవారు బిరుదుల రజిత అకౌంట్‌నం. 62483346935, ఎస్‌బీఐ, జగిత్యాల. ఐఎఫ్‌ఎస్‌సీ నం. SBIN0021978

మరిన్ని వార్తలు