రాజధానిలో యూఏఈ దౌత్య కార్యాలయం!

29 Jun, 2018 02:24 IST|Sakshi

కేసీఆర్‌తో యూఏఈ విదేశాంగ మంత్రి భేటీ

దౌత్య కార్యాలయం ఏర్పాటుకు సానుకూలత

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) రాయబార కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన స్థలం, మౌలిక సదుపాయాలను తక్షణం సమకూర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. యూఏఈ విదేశాంగ మంత్రి షేక్‌ అబ్దుల్లా బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ గురువారం ప్రగతి భవన్‌లో సీఎంతో సమావేశమయ్యారు. నగరంలో తమ దౌత్య కార్యాలయం ఏర్పాటుకు సానుకూలత తెలిపారు.

ఆయన చూపిన చొరవ పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ–యూఏఈ నడుమ బంధాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని ఇరువురూ విశ్వాసం వెలిబుచ్చారు. యూఏఈ, తెలంగాణ మధ్య ఉన్న సాంస్కృతిక అనుబంధాన్ని ముఖ్య మంత్రి ఈ సందర్భంగా వివరించారు. మధ్య ఆసియాకు, హైదరాబాద్‌కు మధ్య కొనసాగుతున్న చారిత్రక, వ్యాపార, సాంస్కృతిక సంబంధాలు, అనుబంధాల గురించి షేక్‌ అబ్దుల్లా బృందానికి సోదాహరణంగా వివరించారు.

తెలంగాణ ప్రగతి ఆదర్శం!
సామాజిక, ఆర్థిక రంగాల్లో తెలంగాణ సాధి స్తున్న ప్రగతి అద్భుతమని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శవంతంగా ఉన్నాయని షేక్‌ అబ్దుల్లా ప్రశంసించారు. గంటపాటు జరిగిన సమావేశంలో కొత్త రాష్ట్రంలో పాలన, జరుగుతున్న అభివృద్ధి గురించి యూఏఈ మంత్రి కేసీఆర్‌ను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

మళ్లీ వస్తా.. కాళేశ్వరం సందర్శిస్తా
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరు ను చూడాల్సిందిగా యూఏఈ మంత్రిని సీఎం ఆహ్వానించారు. తాను త్వరలో మళ్లీ వస్తానని, అప్పుడు మూడు నాలుగు రోజులు ఉండైనా తెలంగా ణలో జరుగుతున్న అభివృద్ధితో పాటు కాళేశ్వరాన్ని సందర్శిస్తానని మంత్రి చెప్పారు. ప్రపంచ ఆదరణ పొందుతున్న తెలంగాణ మెడికల్‌ టూరిజం పట్ల ఆయన ఆసక్తి కనబరిచారు. అందుకు అనువైన వాతావరణం హైదరాబాద్‌లో ఉండటం వైద్యరంగ అభివృ ద్ధికి దోహదపడుతుందన్న సీఎం మాటలతో ఏకీభవించారు.

పలు వివరాలు అడిగి తెలుసు కున్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలం గాణ ముందంజలో ఉందంటూ మంత్రి కేటీఆర్‌ వివరించడంతో అబ్బురపడ్డారు. విభజన అనం తరం నాలుగేళ్ల తక్కువ సమయంలోనే అభివృద్ధి గణనీయంగా పెరగడం తెలుసుకొని అభినందించా రు. తెలంగాణ తలసరి ఆదా యం జాతీయ తలసరి ఆదాయం కన్నా ఎక్కువ ఉండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర పాలనా నైపుణ్యానికి నిదర్శనమని కొనియాడారు. రాష్ట్రంలో పలు రంగా ల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచారు.

మరిన్ని వార్తలు