బీజేపీకి అనుకూల పరిస్థితులున్నాయి

30 Mar, 2017 02:01 IST|Sakshi
బీజేపీకి అనుకూల పరిస్థితులున్నాయి

ఉగాది పంచాంగ శ్రవణంలో శశిభూషణ శర్మ
సాక్షి, హైదరాబాద్‌: జాతీయస్థాయిలో గత మూడేళ్లుగా బీజేపీకి శనిబలం బాగా ఉందని, అందుకే విజయాలు ప్రాప్తించాయని శశిభూషణ శర్మ తన పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. బీజేపీది ధనస్సు రాశి అని దాని ప్రకారం రాష్ట్ర బీజేపీకి కూడా అనుకూల పరిస్థితులున్నాయని, వచ్చే మూడేళ్ల పాటు ఇవి కొనసాగుతాయని, విజయాలు సిద్ధిస్తాయని చెప్పారు. అయితే అందుకు కలిసొచ్చే అవకాశాలను ఉపయోగించుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు.

బుధవారం బీజేపీ కార్యాలయంలో ఉగాది పండుగ సందర్భంగా శర్మ పంచాంగ పఠనం చేశారు. బీజేపీ ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు ఈ ఏడాది బాగుందన్నారు. పార్టీ అనేక విజయాలు సాధిస్తూ తెలుగు కొత్త సంవత్సరంలోకి అడుగిడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ అన్నారు. వచ్చే ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, పార్టీ కార్యక్రమాలకు సమయమిచ్చి పనిచేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చేలా కృషి చేయాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు.

 మోదీ నాయకత్వాన్ని బలపరిచేలా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే బీజేపీకి విజయాలు సిద్ధిస్తాయన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీకి మంచిరోజులు రాబోతున్నాయని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం దేశం వైఫు, ప్రధాని మోదీ వైపు చూస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌ రావు, డా.జి. మనోహర్‌రెడ్డి, టి.ఆచారి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డా.ఎస్‌.మల్లారెడ్డి, ఆకుల విజయ, సుధాకర శర్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు