ఫైనల్‌ సెమిస్టర్‌ వారికి ఇక పరీక్షలే..

8 Jul, 2020 04:03 IST|Sakshi

డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు యూజీసీ ఆదేశాలు

సాంకేతిక విద్యాసంస్థల్లోనూ అమలుకు ఏఐసీటీఈ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. ఉన్నత విద్యాశాఖ ఆలోచనకు భిన్నంగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) స్పందిం చింది. డిగ్రీ, పీజీ, ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థులకు సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. మరోవైపు వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల్లోనూ యూజీసీ ఉత్తర్వులను అమలు చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) మంగళవారం నిర్ణయించింది. పరీక్షలు లేకుండా వారిని ప్రమోట్‌ చేయడం సరికాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తోంది. దీనిపై ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి అధికారులు మంగళవారం విద్యాశాఖ మంత్రి
సబితాఇంద్రారెడ్డితో సమావేశమై చర్చించారు. 

రాష్ట్రంలో విధానపరమైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని, ఇప్పుడు కేంద్రం ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహించాల్సి వస్తుందని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అన్నారు. అయితే ఇదివరకే సంప్రదాయ డిగ్రీల్లో ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు సెమిస్టర్ల పరీక్షలను వాయిదా వేసి విద్యార్థులను పై సెమిస్టర్లకు ప్రమోట్‌ చేస్తూ యూనివర్సిటీలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఇంజనీరింగ్‌లోనూ ఒకటి నుంచి ఏడో సెమిస్టర్‌ వరకు విద్యార్థులను పైసెమిస్టర్లకు ప్రమోట్‌ చేసేలా చర్యలు చేపట్టింది. పీజీలోనూ అంతే. ఇలా దాదాపు 6 లక్షల మంది విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై సెమిస్టర్లకు ప్రమోట్‌ చేసింది. 

సెప్టెంబరులో 3.7 లక్షలమంది విద్యార్థులకు పరీక్షలు
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఇంజనీరింగ్, సంప్రదాయ డిగ్రీలు, పీజీ కోర్సుల్లో ఫైనల్‌ సెమిస్టర్‌ చదివే విద్యార్థులకు కూడా పరీక్షలను రద్దు చేసి, ఇంటర్నల్‌ మార్కులు, కిందటి సెమిస్టర్లలో వచ్చిన మార్కులు వేసి ప్రమోట్‌ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఆ ఫైలును సీఎం కేసీఆర్‌ ఆమోదానికి పంపింది. అయితే, తాజాగా యూజీసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థులు దాదాపు 3.7 లక్షలమందికి పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది.

కేంద్రమే ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినందున పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడతామని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. సీఎంకు ఫైలు వెళ్లినా, కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. మరోవైపు వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల్లోనూ యూజీసీ జారీ చేసిన తాజా ఉత్తర్వులను అమలు చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) మంగళవారం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా