‘ఆధార్‌’o ఇవ్వలేం..!

15 Aug, 2018 02:14 IST|Sakshi

దర్యాప్తు సంస్థలకు మా డేటా లింకేజీ చేయలేం 

కేంద్ర హోంశాఖకు స్పష్టం చేసిన యూఐడీఏఐ 

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల నగర పోలీసులు పెద్ద మనిషి ముసుగు వేసుకున్న ఓ ఘరానా మోసగాడిని అరెస్టు చేశారు. అతని వద్ద కొన్ని అనుమానాస్పద ఆధార్‌ కార్డులు లభించాయి. రాజేంద్రనగర్‌ చిరునామాతో కర్ణాటక నుంచి ఇవి జారీ అయ్యాయి. ఇదెలా సాధ్యం? ఈ కార్డులు అసలువా, నకిలీవా? తేల్చాలని కోరుతూ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు (యూఐడీఏఐ) లేఖ రాశారు. దీనికి స్పందించిన ఆ విభాగం ఇదే కాదు... ఏ వివరాలూ దర్యాప్తు సంస్థలకు ఇవ్వలేమంటూ చెప్పింది. ఈ అంశాన్నే యూఐడీఏఐ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకూ (ఎంహెచ్‌ఏ) స్పష్టం చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఎంహెచ్‌ఏ... క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌ను (సీసీటీఎన్‌ఎస్‌) పరిపుష్టం చేయడం ద్వారా ఆధార్‌ వివరాలతో అవసరం లేకుండానే ముందుకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  
వేలిముద్రలే అత్యంత కీలకం... 
పాత నేరగాళ్ల వివరాలు పోలీసు రికార్డుల్లో ఉండటంతో పాటు వారి వేలిముద్రలూ డేటాబేస్‌లో నిక్షిప్తమై ఉంటాయి. కొత్తగా నేరానికి పాల్పడే వారి వివరాలు లేకపోవడటంతో ఆ కేసులు త్వరగా పరిష్కారం కావట్లేదు. ఈ కేసులు కొలిక్కి చేరడంలో నేరగాళ్ల వివరాలు, వేలిముద్రలదే కీలకపాత్ర. ఈ పరిస్థితుల్ని బేరీజు వేసిన నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇటీవల యూఐడీఏఐకు కీలక ప్రతిపాదనలు చేసింది. ఆధార్‌ డేటాబేస్‌లో పోలీసు విభాగానికి లింకేజ్‌ ఇస్తే సొత్తు సంబంధిత నేరాలే కాకుండా ఇతర కేసుల్ని కొలిక్కి తీసుకురావడం తేలిక అవుతుందని అభిప్రాయపడింది.  

ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్న ఎంహెచ్‌ఏ 
అయితే లింకేజ్‌ ఇవ్వడం సాధ్యంకాదని యూఐడీఏఐ పేర్కొంది. ఆధార్‌ చట్టం ప్రకారం ఏ తరహా వివరాలనూ పోలీసు సహా దర్యాప్తు సంస్థలకు ఇవ్వడం సాధ్యం కాదని ఎంహెచ్‌ఏకు లేఖ రాసింది. ఇప్పటికే కొన్ని టెలికం సంస్థలకు ఆధార్‌తో లింకేజీ లభించింది. ఆయా సంస్థలకే లింకేజ్‌ ఇస్తున్నప్పుడు పోలీసు విభాగానికి ఇవ్వడంలో అభ్యంతరం ఏమిటన్నది అధికారుల ప్రశ్న. అయితే యూఐడీఏఐ ససేమిరా అనడంతో ఎంహెచ్‌ఏ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. సీసీటీఎన్‌ఎస్‌ను పరిపుష్టం చేస్తూ దీన్ని సెంట్రల్‌ ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో (సీఎఫ్‌పీబీ)తో అనుసంధానించాలని నిర్ణయించింది. సీఎఫ్‌పీబీ ఇటీవలే ఆటోమేటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టంతో పాటు నిస్ట్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఇమేజింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తోంది. దేశంలో మొత్తం 15,500 ఠాణాలకు గాను 14,500 ఠాణాలను సీసీటీఎన్‌ఎస్‌తో అనుసంధానించారు. మిగిలిన ఠాణాలనూ లింకేజీ చేస్తూ ఈ ప్రాజెక్టును పరిపుష్టం చేయడానికి ఎంహెచ్‌ఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా