పౌరసత్వాన్ని నిరూపించుకోండంటూ 127 మందికి నోటీసులు

19 Feb, 2020 09:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు అట్టుడుకుతున్న వేళ.. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్‌) హైదరాబాదీలకు షాక్‌నిచ్చింది. మీ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ హైదరాబాద్‌లో నివసిస్తున్న 127 మందికి నోటీసులు జారీ చేసింది. అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఫిబ్రవరి 20లోగా విచారణకు రావాలని ఆదేశించింది. సరైన పత్రాలు సమర్పించకపోయినా, భారత పౌరులమని నిరూపించుకోకపోయినా వారి ఆధార్‌ కార్డులను రద్దు చేస్తామని హెచ్చరించింది. వివరాలు.. సత్తర్‌ ఖాన్‌ అనే ఆటో రిక్షా ​డ్రైవర్‌ హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. నకిలీ ధృవపత్రాలతో ఆధార్‌ కార్డు అందుకున్నావన్న ఫిర్యాదు మేరకు ఉడాయ్‌ (యూఐడీఏఐ) ఫిబ్రవరి 3న అతనికి నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం కలిగివుంటే తగిన పత్రాలను చూపించాలని నోటీసులో పేర్కొంది. సరైన పత్రాలు చూపకపోయినా, గురువారంలోగా విచారణ అధికారి ముందు హాజరు కాకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించింది. (125 కోట్ల మందికి ఆధార్‌)

ఒకవేళ భారతీయులు కాకపోతే, దేశంలోకి చట్టబద్ధంగానే ప్రవేశించామని నిరూపించుకోవాలని తెలిపింది. లేని పక్షంలో దీన్ని సుమోటోగా తీసుకుని ఆధార్‌ను రద్దు చేస్తామని వెల్లడించింది. ఈ నోటీసులను సదరు వ్యక్తి మంగళవారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూఐడీఏఐకు పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదంటూ విమర్శలు వెల్లువెత్తడంతో సదరు అధికారులు స్పందించారు. కొంతమంది అక్రమ వలసదారులు తప్పుడు పత్రాలతో ఆధార్‌ కార్డులు పొందారంటూ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే 127 మంది హైదరాబాదీలకు నోటీసులు పంపించామని వివరణ ఇచ్చారు. అక్రమ వలసదారులకు ఆధార్‌ మంజూరు చేయరాదని సుప్రీంకోర్టు చెబుతోందన్నారు. ఇక ఆధార్‌ చట్టం ప్రకారం ఆధార్‌ కార్డుకు దరఖాస్తు చేయడానికి ముందు భారత్‌లో 182 రోజులపాటు నివసించాలన్న నిబంధన ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒరిజినల్‌ ధృవపత్రాలు సమకూర్చుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో విచారణను మే నెలకు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.(ఆవుదూడను చంపావ్‌.. ప్రాయశ్చిత్తంగా కూతుర్ని..!)

మరిన్ని వార్తలు