సాక పెట్టి సాగంగ... మొక్కులు తీరంగ 

22 Jul, 2019 01:52 IST|Sakshi
1008 బోనాలతో సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి చెంతకు వెళ్తున్న మాజీ ఎంపీ కవిత, పలువురు భక్తులు

ఉజ్జయినీ మహంకాళిని దర్శించుకున్న నగరం

పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్‌

బంగారు బోనంసహా 1008 బోనాలు సమర్పించిన కవిత 

భారీగా పాల్గొన్న భక్తులు..రోజంతా వేడుకలు..  

హైదరాబాద్‌: తెలతెలవారంగా... జనమంతా తరలంగా... సాక పెట్టి సాగంగా... మొక్కులు తీరంగా... డప్పుల దరువేయంగా... బొట్టుపెట్టి బోనమెత్తగా.. భక్తజనం హోరెత్తగా... లష్కర్‌ పోటెత్తగా... అమ్మా.. బైలెల్లినాదో..! మహంకాళి తల్లి బైలెల్లినాదో..! సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం వైభవంగా సాగింది. లక్షలాదిమంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక సమర్పించి సల్లంగ చూడాలని మొక్కుకున్నారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులు అమ్మావారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. సాధారణ భక్తుల నుంచి ప్రముఖుల వరకు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

రాష్ట్రాన్ని సల్లంగా చూడాలని మొక్కుకున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌ గౌడ్, మల్లారెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి అమర్‌నాథ్‌ గౌడ్, ఎంపీలు రేవంత్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు, మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రాంచందర్‌రావు, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి తదితరులు హాజరై అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు.
అమ్మవారి వద్ద హారతి తీసుకుంటున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రులు ఇంద్రకరణ్, తలసాని 

ఓల్డ్‌దాస్‌ మండి నుంచి ఒక వాహనంలో బంగారు బోనంసహా 1008 బోనాలను మాజీ ఎంపీ కవిత, పలువురు భక్తులు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. భక్తుల బోనాలు.. పోతురాజుల విన్యాసాలు... సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాలన్నీ పండుగ వాతావరణం నెలకొంది. భక్తుల రద్దీకి తోడు వీఐపీల తాకిడి పెరగడంతో సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ రద్దీని నియంత్రిస్తూ రాకపోకలపై భక్తులకు మార్గనిర్దేశం చేయాల్సిన పోలీసులు, ఇతర విభాగాల అధికారులు వీఐపీల సేవలో తరించిపోయారు. భక్తులు గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడాల్సి రావడం, మంచినీరు, మూత్రశాలలు లేకపోవడంతో మహిళలు, చిన్నపిల్లలు ఇబ్బంది పడాల్సి వచ్చింది.
 
తొలిపూజ చేసిన మంత్రి తలసాని 
అమ్మవారి బోనాల జాతరలో భాగంగా ఆదివారం ఉదయం 4 గంటలకు మంత్రి తలసాని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయన సతీమణి అమ్మవారికి బోనం సమర్పించారు. అటు తర్వాత మంత్రి తొలిపూజ చేశారు. అనంతరం సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనానికి అవకాశం కల్పించారు. మంత్రితోపాటు కార్పొరేటర్‌ అత్తెల్లి అరుణగౌడ్, ఫౌండర్‌ ఫ్యామిలీ మెంబర్‌ సురిటి కృష్ణ కుటుంబసభ్యులు ఉన్నారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.   

మరిన్ని వార్తలు