రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు

14 Jul, 2020 03:14 IST|Sakshi
అమ్మవారు ఆవహించడంతో భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత

రంగంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత

రాంగోపాల్‌పేట్‌ (హైదరాబాద్‌): ‘‘నాకు జరుగుతున్న పూజలతో నేను సం తోషంగా లేను...ఎవరు చేసుకున్న దాన్ని వారు అనుభవిస్తున్నారు...కాపాడేదాన్ని నేనే అయినా అంతకు ఎక్కువగా చేసుకుంటున్నారు...భక్తి భావంతో కాకుండా విపరీతమైన కోరికలు, కోపతాపాలతో నన్ను కొలుస్తున్నారు. భక్తి భావంతో కొలిస్తే కాపాడేదాన్ని నేనే...నా బిడ్డలను నేను కాపాడుకుంటాను...రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు వస్తాయి...ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని ముందుగా హెచ్చరిస్తున్నా...నా భక్తులు లేకుండా జరిగిన బోనాలతో నేను సంతోషంగా లేను...యజ్ఞ, హోమాలు చేసి ఐదు వారాల పాటు నాకు సాక పెట్టి , నా వారం రోజు పప్పు బెల్లంతో ఫలహారం గడపగడప నుంచి రావాలి’’అంటూ రంగంలో అమ్మవారు సోమవారం భవిష్య వాణి వినిపించారు.

తంబూర చేతపట్టుకుని మాతంగేశ్వరి అమ్మవారి ఎదురుగా పచ్చికుండపై నిలబడిన స్వర్ణలత అమ్మవారిని ఆవహించగా భవిష్యవాణిని వినిపించారు. కరోనాతో దేశ ప్రజలందరూ పడుతున్న ఇబ్బందుల గురించి ఆమె చెబుతూ రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని తన ప్రజలను కాపాడుకుంటానని చెప్పారు. ప్రజలు చేసుకున్న దాంతో వారు అనుభవిస్తున్నారని అందుకే ఈ పరిస్థితి వచ్చిందని హెచ్చరించారు. ఎవరికి వారు తమ సొంత కోరికలు కోరుకుంటూ ఎలాంటి భక్తి భావం లేకుండా కోపతాపాలతో తనకు పూజలు చేస్తున్నారని మండిపడ్డారు. భక్తిశ్రద్ధలతో కొలిస్తే తన బిడ్డలను తాను కాపాడతానని కొండంత ధైర్యాన్ని అందించారు. ఇటీవల పూర్తయిన కాళేశ్వరం గురించి వేదపండితుడు వేణుమాధవశర్మ అమ్మవారిని అడుగగా గంగమ్మకు యజ్ఞయాగాలు, హోమాలు చేస్తే ఆమె సంతోషించి అందరు కోరుకున్నట్లు జరుగుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు