ఆరోగ్యశ్రీ సీఈవో పోస్టుపై అనిశ్చితి

7 Mar, 2019 03:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఈవో) పోస్టు భర్తీపై అనిశ్చితి నెలకొంది. గత నెలాఖరు వరకు అదనపు బాధ్యతల్లో సీఈవోగా కొనసాగిన మాణిక్‌రాజ్‌ హైదరాబాద్‌ కలెక్టర్‌గా బదిలీపై వెళ్లిపోయారు. ఆయన స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇప్పటికీ జరగకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ కింద రూ.2 లక్షల వరకు  వైద్యం చేయించుకునే వెసులుబాటుంది. అయితే లక్షన్నర రూపాయలకు మించి బిల్లు అయితే సీఈవో అనుమతి తప్పనిసరి. ప్రధానంగా కేన్సర్, గుండె తదితర ప్రాణాంతక వ్యాధులకు మాత్రం ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో అటువంటి రోగులు సీఈవోకు విన్నవించుకొని ప్రత్యేక అనుమతి తీసుకుంటారు. అయితే ప్రస్తుతం సీఈవో లేకపోవడంతో వారం రోజులుగా రోగులకు అటువంటి అనుమతులివ్వడం సాంకేతికంగా ఇబ్బంది అవుతుందని ఆరోగ్యశ్రీ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల ప్రాణాంతక వ్యాధులతో బాధపడే  రోగులు అల్లాడుతున్నారని వారు అంటున్నారు.  

ఆరోగ్యశ్రీ కార్డులున్న వారు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఎక్కడైనా ఈ ఉచిత వైద్య సేవలు పొందొచ్చు. ఇలాంటి కీలకమైన ఆరోగ్యశ్రీ సీఈవో పోస్టుకు మొదటి నుంచీ ముఖ్యమైన అధికారులే ఉన్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రారంభించినప్పుడు ఓ ఐఏఎస్‌ను సీఈవోగా నియమించారు. తెలంగాణ వచ్చాక నాన్‌ ఐఏఎస్‌ను నియమించారు. తర్వాత నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కొన్ని కారణాలతో ఆయన్ను తొలగించి ఐఏఎస్‌ అధికారి మాణిక్‌రాజ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. వీరిద్దరూ అదనపు బాధ్యతగానే ఆరోగ్యశ్రీ సీఈవోగా పనిచేశారు. దీంతో ఆరోగ్యశ్రీపై పూర్తిస్థాయిలో కేంద్రీకరించే అధికారి లేరన్న భావన నెలకొంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న కొందరు కిందిస్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

తమకు నచ్చిన ఆస్పత్రులు తప్పులు చేసినా చూసీ చూడనట్లు వ్యవహరించడం, నచ్చని ఆస్పత్రులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం వంటివి అనేక అక్రమాలు జరుగుతున్నాయన్న వాదనలున్నాయి. దీనిపై కొన్ని ఆస్పత్రులు ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిసింది.  ఈ నేపథ్యంలోనే ఆరోగ్యశ్రీలో పనిచేసే ఓ అధికారికి వైద్య ఆరోగ్యశాఖలోనూ కీలక బాధ్యతలు ఇవ్వడం విమర్శలకు తావిచ్చింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ సీఈవో పోస్టు కోసం కొందరు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు