మామా అల్లుళ్లు దొంగతనాల్లో సిద్ధహస్తులు

16 Mar, 2020 13:05 IST|Sakshi
నిందితుల వివరాలను వెల్లడిస్తున్న రూరల్‌ డీఎస్పీ హరనాథ్‌రెడ్డి

పగటి పూటే చోరీలు

రూ.10 లక్షల సొత్తు స్వాధీనం

అరెస్ట్‌ చేసిన పోలీసులు

నెల్లూరు(క్రైమ్‌): మేనల్లుడు అల్లుడు చెడుదారిలో వెళుతుంటే మందలించి మంచి మార్గంలో నడిపింల్సిన మామ అందుకు భిన్నంగా వ్యవహరించాడు. అల్లుడితో కలసి దొంగతనాల్లో భాగస్తుడైయ్యాడు. ఇద్దరూ తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరగసాగారు. వీరి కదలికలపై నిఘా ఉంచిన సీసీఎస్, ముత్తుకూరు పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. నగరంలోని సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నెల్లూరు రూరల్‌ డీఎస్పీ వై.హరనాథ్‌రెడ్డి నిందితుల వివరాలను వెల్లడించారు.

ఇనుప సామాన్లు కొంటామని..
నెల్లూరు శివాజీనగర్‌కు చెందిన పి.ఆనంద్‌ అలియాస్‌ కత్తుల ఆనంద్, హౌసింగ్‌బోర్డు కాలనీ మల్లయ్యగుంటకు చెందిన పి.శ్రీనులు వరసకు మామాఅల్లుళ్లు. చెడువ్యసనాలకు బానిసైన ఆనంద్‌ దొంగగా మారాడు. అతడిని సన్మార్గంలో నడిపించాల్సిన మామ శ్రీను అందుకు భిన్నంగా అల్లుడితో జతకట్టాడు. ఇద్దరూ కలసి పగలంతా ఇనుప సామాన్లు కొంటామని అరుస్తూ వీధుల్లో తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని జిల్లాలో దొంగతనాలకు పాల్పడసాగారు. దొంగలించిన సొత్తును అమ్మి సొమ్ము చేసుకుని జల్సాగా జీవించసాగారు. ఈక్రమంలోనే ముత్తుకూరులో ఒకటి, కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒకటి,  వేదాయపాళెం స్టేషన్‌ పరిధిలో రెండు, వెంకటాచలసత్రం స్టేషన్‌ పరిధిలో నాలుగు, వాకాడులో ఒకటి, నెల్లూరు రూరల్‌ స్టేషన్‌ పరిధిలో రెండు పగటి దొంగతనాలు జరిగాయి.

ప్రత్యేక బృందంగా ఏర్పడి..
క్రైమ్‌ ఏఎస్పీ పి.మనోహర్‌రావు ఆధ్వర్యంలో నెల్లూరు నగర, రూరల్‌ డీఎస్పీలు జె.శ్రీనివాసులురెడ్డి, వై.హరనాథ్‌రెడ్డి, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లు షేక్‌ బాజీజాన్‌సైదా, జి.రామారావు, ముత్తుకూరు సీఐ షేక్‌ ఖాజావలీ, ఎస్సై అంజిరెడ్డిలు తమ  సిబ్బందితో ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం నిందితులు నగరంలోని సుందరయ్యకాలనీ జంక్షన్‌ వద్ద ఉన్నారనే పక్కా సమాచారం అందుకున్న ప్రత్యేక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్‌కు తరలించి విచారించారు. దొంగతనాలు చేసింది తామేనని వారిద్దరూ వెల్లడించడంతో అరెస్ట్‌ చేసి రూ.10 లక్షల విలువచేసే 40 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన సీసీఎస్‌ ఏఎస్సై కె.గిరిధర్‌రావు, హెడ్‌ కానిస్టేబుల్స్‌ జేవీ రమేష్, సురేష్‌బాబు, సీహెచ్‌ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్స్‌ హరీష్‌రెడ్డి, పి.సతీష్, పీవీ సాయి, ఆనంద్‌ తదితరులను డీఎస్పీ అభినందించి ఎస్పీ చేతుల మీదుగా రివార్డులు అందించనున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు