చెరువే.. చేవ!

28 Jan, 2017 01:14 IST|Sakshi
చెరువే.. చేవ!

రాష్ట్రంలో చెరువుల కింద భారీగా పెరిగిన సాగు
ఈ రబీలో ఏకంగా 7.5 లక్షల ఎకరాల్లో పంటలు
పదేళ్లలో ఎన్నడూ 2.5 లక్షల ఎకరాలకు దాటని వైనం
‘మిషన్‌ కాకతీయ’తో నీటి లభ్యత పెరగడం వల్లే భారీ సాగు
 ప్రభుత్వానికి అధికారుల నివేదిక  


 హైదరాబాద్‌: రాష్ట్రంలో చిన్న నీటి వనరులుగా ఉన్న చెరువుల కింద పంటల సాగు భారీగా పెరిగింది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ రబీలో రికార్డు స్థాయిలో పంటలు వేశారు. నీటి పారుదల శాఖ గణాంకాల ప్రకారమే చెరువుల కింద సాగు 7.5 లక్షల ఎకరాలు దాటింది. ‘మిషన్‌ కాకతీయ’పథకం కింద చేపట్టిన పునరుద్ధరణ పనులతో చెరువుల్లో నీటి లభ్యత పెరగడం, భారీ ప్రాజెక్టుల నీటితో చెరువులను నింపడమే సాగు పెరిగేందుకు దోహద పడింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో చెరువుల పునరుద్ధరణ జరిగితే రాష్ట్రంలోని మొత్తం చెరువుల కింద ఉన్న 24 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం పెద్ద కష్టమేమీ కాదని చిన్న నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి నివేదించింది.

పదేళ్లలో అత్యధికం 2.4 లక్షల ఎకరాలే
రాష్ట్రంలో మొత్తంగా 46,531 చెరువులు ఉండగా.. వాటి కింద 24,39,515 ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా, గోదావరి నదుల్లో కలిపి 255 టీఎంసీల మేర కేటాయింపులు న్నాయి. అయినా పూర్తి స్థాయిలో నీటి వినియోగం జరగకపోవడంతో గరిష్టంగా 10 లక్షల ఎకరాలకు మించి నీరందించిన సందర్భాలు లేవు. 2008–09 నుంచి ఇప్పటి వరకు ఖరీఫ్, రబీ సీజన్ల వారీగా చూస్తే... గరిష్టంగా 2013–14 ఖరీఫ్‌లో 9,04,752 ఎకరాల్లో సాగు జరిగింది. అంతకుముందు 2012–13 ఖరీఫ్‌లో 6.43 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. 2008 నుంచి రబీ సాగును పరిశీలిస్తే... ఎప్పుడూ 2.4 లక్షల ఎకరాలు దాటలేదు. 2008–09లో గరిష్టంగా 2.38 లక్షల ఎకరాల్లో సాగు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. అత్యంత కనిష్టంగా గతేడాది (2015–16లో) కేవలం 55 వేల ఎకరాలకే సాగు పరిమితమైంది.

పునరుద్ధరణతో..
ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడం, ఆ సమయానికే పెద్ద సంఖ్యలో చెరువుల పునరుద్ధరణ జరగడం ఈసారి రబీ సాగుకు ఊపిరి పోసింది. తొలి విడతలో 8,059 చెరువుల పునరుద్ధరణ పూర్తి చేయడం.. రెండో విడతలో 8,806 చెరువుల పనులు చేపట్టి, 1,536 చెరువులను పూర్తిగా, మిగతా వాటిని 50శాతానికిపైగా పూర్తి చేయడంతో అవన్నీ జలకళను సంతరించుకున్నాయి. మొత్తంగా 46 వేల చెరువులకుగాను 30 వేల వరకు చెరువులు నిండటం, మరో 10 వేల చెరువుల్లోనూ 75 శాతందాకా నీరు చేరడంతో పంటల సాగు పెరిగింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాల్లో దాదాపు పూర్తి స్థాయి లక్ష్యాలకు దగ్గరగా సాగు నమోదు కావడం గమనార్హం.

ప్రాజెక్టుల నీటితోనూ..
గత సెప్టెంబర్‌లో కురిసిన కుండపోత వర్షాలకు భారీ ప్రాజెక్టులన్నీ నిండ టంతో.. ప్రభుత్వం చెరువులను నింపేందుకు ప్రత్యేక కార్యాచరణ రూ పొందించింది. ఎస్సారెస్పీ కాకతీయ కాల్వ, వరద కాల్వ, దేవాదుల పంపింగ్‌ ద్వారా గోదావరి వరద నీటిని తరలించి కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో 800 చెరువులను నింపారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ల ద్వారా మరో 250 చెరువు లను నింపారు. పదేళ్ల తర్వాత ఎస్సారెస్పీ రెండో దశ ద్వారా చెరువులను నింపి సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు నీరందించారు. ఇలా చెరువులను నింపడం రబీలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగేందుకు దోహదపడింది. ఇక గతంలో సాగైన భూమి విషయంలో వ్యవసాయ, రెవెన్యూ, సాగునీటి శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో కచ్చిత మైన లెక్కలు వచ్చేవి కావని, ఈ ఏడాది మూడు శాఖల సమన్వయంతో చెరువుల కింద సాగు లెక్కలు తేల్చారని చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు