చిన్ని గుండెకు ఆరోగ్యశ్రీ అండ

18 Mar, 2014 03:03 IST|Sakshi

 పథకం కింద శస్త్రచికిత్సకు అవకాశం
 హామీ ఇచ్చిన అధికారులు

  సత్తన్‌పల్లి(ఖానాపూర్), న్యూస్‌లైన్ : చిన్నారి రిషితకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా శస్త్రచికిత్స చేయిస్తామని వైద్యాధికారులు పేర్కొన్నారు. మండలంలోని సత్తన్‌పల్లికి చెందిన జక్కుల రజిత, శ్రీనివాస్ దంపతుల కుమార్తె 18 నెలల రిషిత గుండెకు రంధ్రం పడి అనారోగ్యంతో బాధపడుతోంది.
 
  పేద కుటుంబం కావడంతో శస్త్రచికిత్స చేయించే ఆర్థిక స్థోమతలేక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఈ విషయమై ‘చిన్ని గుండెను ఆదుకోరూ’ శీర్షికన ఆదివారం సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. స్పందించిన ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త విజయ్‌కుమార్ ఆదేశాల మేరకు  డివిజన్ టీం లీడర్ సల్ల భూమారెడ్డి, సిబ్బంది బాధిత కుటుంబాన్ని కలిశారు. వివరాలు సేకరించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా శస్త్రచికిత్స చేయిస్తామని ఆయన చెప్పారు.
 
  ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు లేకపోయినా ప్రత్యేక కేసుగా పరిగణించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, పాప బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా ఆపరేషన్ చేయించే వీలుందని పేర్కొన్నారు.
 
 ఆపరేషన్‌కు అవసరమైన రక్తం కోసం ఏర్పాట్లు చేసుకోవాలని రిషిత తల్లిదండ్రులకు సూచించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తమ బిడ్డ గుండె ఆపరేషన్‌కు మార్గం చూపిన ‘సాక్షి’కి రజిత, శ్రీనివాస్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.
 

మరిన్ని వార్తలు