అడుగంటుతున్న భూగర్భ జలాలు

3 May, 2019 12:30 IST|Sakshi

జిల్లాల్లో భూగర్భ జల మట్టంవేగంగా పడిపోతోంది. బోరుబావులు బోరుమంటున్నాయి. తాగునీటి వనరులు అడుగంటిపోతున్నాయి.  పల్లెల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే 4.22 మీటర్ల లోతులోకి పడిపోగా, గతనెలతో పోల్చితే 1.17 మీటర్ల లోతులోకి వెళ్లింది. కొల్చారం మండల పరిధిలోని రంగంపేట గ్రామంలో ఏకంగా 40.05 మీటర్ల లోతులోకి జలమట్టం పడిపోయింది. వ్యవసాయ బోరు బావులు వట్టిపోతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాలుస్తోంది. ఇప్పటికే చాలాచోట్ల రైతులు పంటపొలాలను పశువుల మేతకు వదిలేశారు.  –మెదక్‌జోన్‌

వరుస కరువుకాటకాలతో నీటివనరులు అడుగంటాయి. సాగునీరుకాదు కదా తాగునీరు సైతం దొరకని పరిస్థితి నెలకొంది. ఎన్నడూ లేనివిధంగా జిల్లాపై నిప్పుల వాన కురుస్తోంది. ఏకంగా 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. భూగర్భజలాలు అందనంత లోతుకి పడిపోయాయి. అత్యధికంగా కొల్చారం మండలంలో ఏకంగా 40.01 మీటర్ల లోతులోకి  నీటిమట్టం పడిపోయంది. గతేడాది ఏప్రిల్‌తో పోల్చితే 4.22 మీటర్ల లోతులోకి పడిపోగా గతనెలతో పోల్చితే 1.17 మీటర్ల లోతులోకి పడిపోయింది. జిల్లావ్యాప్తంగా 95 వేల బోరుబావులు ఉండగా ఇప్పటికే 80 శాతం బోర్లు మూలన పడ్డాయి.

తాగునీటికి సైతం కష్టమొచ్చింది. పశుపక్షాదులకు సైతం నీరు దొరక్క అడవి జంతువులు రోడ్లపైకి వస్తూ ప్రమాదాలకు గురవుతూ మృత్యువాత పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 2,660 చెరువులు, కుంటలు ఉండగా ఒకటి రెండింటిలో కొద్దిపాటి నీరు తప్ప ఎందులోనూ చెప్పుకోదగ్గ నీరులేదు. ఈ యేడు రబీసీజన్‌లో కొన్ని మండలాల్లో బోర్ల నుంచి కొద్దిపాటి నీరురావడంతో వాటి ఆధారంగా 15,338 హెక్టార్లలో పంటలను సాగుచేశారు. పంటలు చేతికందే సమయంలో బోర్లలో పూర్తిగా నీరు ఇంకిపోవడంతో సాగుచేసిన పంటల్లో సగానికిపైగా ఎండిపోయాయి. ఫలితంగా రైతులకు పెట్టుబడిసైతం చేతికందని పరిస్థితి నెలకొంది.

గత సంవత్సరంకన్నా 4.47 మీటర్ల లోతులో..
గత సంవత్సరం మార్చి–ఏప్రిల్‌తో పోల్చుకుంటే 4.22 మీటర్ల లోతులోకి నీటి మట్టాలు పడిపోయాయి. గత ఏడాది కొల్చారం మండలం రంగంపేటలో 35.58 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా ఈఏడాది 40.05 మీటర్ల లోతులోకి పడిపోయాయి. మొత్తంగా జిల్లాలో మార్చి నెలలో 21.85 మీటర్ల లోతులో నీటిమట్టం ఉండగా ఏప్రిల్‌లో ఏకంగా 23.02 మీటర్లకు పడిపోయింది. ఈ లెక్కన 1.17 మీటర్ల లోతులోకి పడిపోయింది.
 
ప్రమాదకరస్థాయిలో కొల్చారం మండలం
భూగర్భజలాలు అత్యధికంగా పడిపోయిన వాటి లో అట్టడుగు స్థానంలో కొల్చారం మండలం ఉంది. ఈ మండల పరిధిలోని  రంగంపేట గ్రామంలో ఏకంగా 40.05 మీటర్ల లోతులోకి నీరు పడిపోయింది. ఫలితంగా ఈ గ్రామంలో ఎక్కడ చూసినా తాగునీటి ఎద్దడి కనిపిస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో నీటిఊటలు అడుగంటి పోవడంతో వ్యవసాయం పూర్తిగా మానేయాల్సిన పరిస్థితి నెలకొంది. రెండో స్థానంలో టేక్మాల్, తూప్రాన్‌ మండలాలు ఉన్నాయి. టేక్మాల్‌ మండలంలో 38.19 మీటర్ల లోతులోకి నీటి ఊటలు పడిపోగా తూప్రాన్‌ మండలంలో 37.60 మీటర్ల లోతులోకి భూగర్భజలాలు పడిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.

మరిన్ని వార్తలు