భూగర్భ శోకం 

26 Feb, 2019 13:03 IST|Sakshi

బతుకుదెరువుకు సాగు లేదు.. బతుకుదామంటే తాగునీరు లేదు. జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. ఏ మండలంలో చూసినా కనుచూపుమేరలో నీటి ఛాయలు కనిపించడం లేదు. రెండేళ్లుగా  చినుకు రాలకపోవడంతో భూగర్భజలాలు అందనంత లోతులోకి వెళ్లిపోయాయి.  అత్యధికంగా కొల్చారం మండలంలో 40.10 మీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.  భూగర్భ జలాలు లేక గతేడాది నుంచి జిల్లాలో సాగు కనిపించడం లేదు. ఎలా బతకాలో తెలియక ఇప్పటికే పలువురు రైతులు వలసబాట పట్టారు. ఇదిలా ఉంటే  పల్లెల్లో తాగునీరందించే మోటార్లకు సైతం నీరందక ఎండిపోతున్నాయి.  వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

మెదక్‌జోన్‌: జిల్లాను కరువు వీడటం లేదు. ఇప్పటికే వర్షాలు కురువక చెరువులు, కుంటలు ఇతర వనరులు నోళ్లు తెరిచి నీటికోసం ఎదురు చూస్తున్నాయి. దీనికితోడు భూగర్భ జలాలు ఊహించనంత దూరంలోకి వెళ్లడంతో మనుషుల మనుగడకే ప్రమాదం వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోను అత్యధికంగా కొల్చారం మండలంలో 40.10 మీటర్ల లోతులో పాతళగంగ ఉన్నట్లు గుర్తించారు. గతేడాదితో పోల్చితే 10 మీటర్లు లోతులోకి వెళ్లిపోయాయి.  ఫలితంగా జిల్లాకు తాగు, సాగునీటి కష్టమొచ్చింది.

జనవరి నెలలో చందాయిపేటలో  20.20 మీటర్ల దూరంలో ఉండగా ఫిబ్రవరిలో 23.40 మీటర్ల లోతులోకి పడిపోయాయి. నెలవ్యవధిలోనే ఏకంగా 3.20 మీటర్ల లోతులోకి నీటి మట్టాలు పడిపోయాయి. కొల్చారం మండలంలో 40.10 మీటర్లలోతులోకి నీటిమట్టాలు పడిపోవటంవటంతో ఆ మండలంలో ఇప్పటికే  70శాతం బోర్లు మూలనపడ్డాయి.  ఈ యేడు ఖరీఫ్‌ సీజన్‌లో సాధారణ వర్షపాతం 739.4 సెంటీమీటర్లు నమోదు కావల్సి ఉండగా కేవలం 491.4 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది.

సాధారణం కన్నా 40 శాతం తక్కువగా వర్షం కురిసింది.  ఫలితంగా జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. దీంతో చెరువులు, కుంటలు వట్టిపోయాయి.  అలాగే 89వేల బోరుబావులు రాత్రిపగలు తేడాలేకుండా నడిపించటంతో సగానికిపైగా బోర్లు ఇప్పటికే మూలనపడ్డాయి. దీంతో సాగుచేసిన పంటలు ఎండిపోవటంతో వాటిని దక్కించుకునే ప్రయత్నంలో అన్నదాతలు లెక్కకుమించి  బోర్లు వేస్తూనే ఉన్నారు. దీంతో వందబోర్లు తవ్వితే 10 బోర్లలో కూడా కొద్దిపాటిగా నీరువచ్చే పరిస్థితి లేకుండాపోయింది.

తాగు నీటికి రోడ్డెక్కే పరిస్థితి..
ఈ ఏడాది రబీసీజన్‌లో  సాధారణ సాగు 38 వేల హెక్టార్లు కాగా కేవలం 15 వేల హెక్టార్లు మాత్రమే సాగు చేశారు.  23 వేల హెక్టార్లు తక్కువ సాగు నమోదైంది. ఈ  పంటలు కూడా చేతికందే పరిస్థితి కనిపించడం లేదు.  సరైన వర్షాలులేక జలాశయాల్లో నీటి జాడలేక పోవడంతో రైతులు విచ్చలవిడిగా బోర్లు తవ్వి భూమిలోపల నుంచి నీటిని నిరంతరంగా బోర్ల ద్వారా  తోడేయడంతో  భూగర్భ జలాలు అందనంతలోతులోకి వెళ్లిపోయాయి. కొల్చారం మండలంలో 40.10, అల్లాదుర్గంలో 39.90, పాపన్నపేట 27.68,  నార్సింగ్‌ మండలంలో 28.30,  రామాయంపేట మండలంలో  25.70 టేక్మాల్‌ మండలంలో 34.79 తూప్రాన్‌ 38.65 నీటిమట్టాలు నమోదయ్యాయి. సింగూర్‌లోనూ తగ్గడంతో తాగునీటికి కష్టమొచ్చింది.  ముఖ్యంగా అనేక గిరిజన తండాల్లో ఇప్పటికే నీటికోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు