‘బోరు’మంటున్న రైతన్న.. 

17 Apr, 2019 11:19 IST|Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: రబీ పంటలు ఎండిపోతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు.. రోజురోజు కు పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి.. తద్వారా బోర్లన్నీ వట్టిపోతున్నాయి.. దీంతో రబీ పంటలు చేతికందడం ప్రశ్నార్థకంగా తయారైంది. ముఖ్యంగా బోర్లపై ఆశ లు పెట్టుకుని వరి సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఒక్కో ఎకరంపై రూ.వేల ల్లో పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట కళ్ల ముందే ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వరి గింజ పాలు పట్టే దశకు చేరుకుంది. ఈ కీలక తరుణంలో నీళ్లు అందకపోవడంతో వరి దిగుబడే ప్రశ్నార్థకంగా మారింది. సుమారు సగానికి తగ్గే పరిస్థితుల నెలకొన్నాయి. బోర్లలో నీరు సరిగ్గా అందకపోవడంతో మూడు, నాలుగు ఎకరాలు వరి వేసుకున్న రైతులు బోరు నీటిని రెండు, మూడు ఎకరాలకు సరిపెట్టుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మిగితా పొలాన్ని కాపాడుకోలేకపోతున్నారు.

ఇప్పటికే శనగ, ఉల్లి, ఎర్రజొన్న, తదితర పంటలు ఇప్పటికే దాదాపుగా కోతలు పూర్తయ్యాయి. వరి పంట కోత దశలో ఉంది. కూర ‘గాయాలు’ కూరగాయ పంటలు సాగు చేసిన రైతులు సైతం నష్టాలను మూటగట్టుకుంటున్నారు. మార్కెట్‌లో అధిక ధర దక్కుతుందని ఆశతో కూరగాయలు వేసుకున్న రైతులు పెట్టుబడులకే నష్టపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా బీర, టమాట వంటి పంటలు ఎండల తీవ్రతకు ఎండిపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
 
సుమారు 1.63 లక్షల బోర్లు.. 
విద్యుత్‌ శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో సుమారు 1.63 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 90 శాతం బోరు బావుల కనెక్షన్లే. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. నీటి వాడకం అధికమవడం కూడా బోర్లు ఎండిపోవడానికి ఓ కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు.. 
జిల్లాలో భూగర్భ జల మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా భీంగల్, సిరికొండ, ధర్పల్లి, బోధన్, కోటగిరి, మోర్తాడ్‌ తదితర మండలాల్లో రోజురోజుకు అడుగంటి పోతున్నాయి.  ఈ మండలాల్లో 20 మీటర్లకుపైనే లోతుకు నీటి మట్టాలు పడిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. అత్యధికంగా భీంగల్‌ మండలం గోన్‌గొప్పులలో 40.10 మీటర్లు, సిరికొండలో 34.55 మీటర్ల లోతులో ఉన్నాయి.

జిల్లాలో సగటు నీటిమట్టం 15.69 మీటర్లు ఉండగా, గతేడాది మార్చి నాటికి 14.06 మీటర్లకు తగ్గి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. గత మూడునెలల్లో భూగర్భ జలమట్టాలు దారుణంగా పడిపోతున్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. డిసెంబర్‌లో 12.08 మీటర్లు, జనవరిలో 13.25, ఫిబ్రవరిలో 14.97 మీటర్ల లోతుకు పడిపోయాయి. కాగా ఎడపల్లి, నందిపేట్, ముప్కాల్, వేల్పూర్, మాక్లూర్, తదితర మండలాల్లోనూ ప్రమాదపుటంచునకు చేరుతున్నాయి. జిల్లాలో మరికొన్ని మండలాల్లోనూ భూగర్భ జలమట్టాలు తగ్గుముఖం పడుతున్నాయి.
 
వర్షాభావ పరిస్థితులే కారణం.. 
భూగర్భజలమట్టాలు వేగంగా పడిపోవడానికి ప్రధానంగా వర్షాభావ పరిస్థితులే కారణం. జిల్లాలో ఈయేడాది సగటు వర్షపాతం 1,009 మిల్లీమీటర్లకుగాను కేవలం 849 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇలా లోటు వర్షపాతం నమోదు కావడంతో పాటు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దీనికితోడు నీటి వినియోగం పెరగడం వల్ల నీటిమట్టాలు వేగంగా పడిపోతున్నాయి.

వివరాలు సేకరిస్తున్నాము... 
పంటలు ఎండిపోతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఎండిపోయిన పంటల వివరాలు సేకరిస్తున్నాము. రబీలో ఆరుతడి పంటలు వేసుకోవాలని ముందే రైతులకు సూచించాము. కానీ చాలా చోట్ల రైతులు వరినే సాగు చేశారు. భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లలో నీరు తగ్గిపోతోంది. దీంతో అక్కడక్కడ పంటలు ఎండు ముఖం పడుతున్నాయి. గోవింద్, జిల్లా వ్యవసాయశాఖాధికారి

మరిన్ని వార్తలు