పాతాళంలోకి గంగమ్మ

15 Jun, 2019 08:07 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఆకాశ గంగమ్మ భువికి దిగి రానంటోంది. పాతాళ గంగమ్మ పైకి రానంటోంది. మరోవైపు మితిమీరిన ఎండలతో జనం గొంతెండిపోతోంది. గుక్కెడు నీటికోసం దిక్కులు చూడాల్సి వస్తోంది. రోజురోజుకూ అడుగంటుతున్న భూగర్భజలాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనా భారీ వర్షాలు లేకపోవడంతో వాతావరణం వేడెక్కుతోంది. దీంతో ఉమ్మడి జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా పడిపోతున్నాయి. బజార్‌హత్నూర్‌లో 36.23 మీటర్లు, నేరడిగొండలో 48 మీటర్ల లోతుకు జలం వెళ్లిదంటే పరిస్థితి ఎంత జఠిలంగా ఉందో అర్థమవుతోంది. ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండగా.. కుమురంభీం, మంచిర్యాల జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బోసిపోతున్న జలాశయాలు 
జలాశయాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. ఉమ్మడి జిల్లాలో సాత్నాల,  మత్తడివాగు, కడెం, స్వర్ణ ప్రాజెక్టు, గడ్డెన్నవాగు, కుమురంభీం, పీపీరావు ప్రాజెక్టు, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు డెడ్‌ స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. చెరువులు ఎండిపోయి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. బావులు, చేతిపంపుల్లో నీళ్లు రావడం లేదు. జూన్‌ 1 నుంచి వర్షాలు కురవాల్సి ఉన్నా ఈసారి నైరుతి రుతుపవనాలు కనికరించకపోవడంతో ఇంకా వర్షాల జాడలేకపోయింది. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉంటే వైపరీత్యాలను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది.

జిల్లాల వారీగా ఇదీ పరిస్థితి ఆదిలాబాద్‌ జిల్లా..
ఆదిలాబాద్‌ జిల్లాలో గతేడాది పరిస్థితులే ఈసారి కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. జిల్లాలో కనిష్టంగా 5.52 మీటర్లలో, గరిష్టంగా 48 మీటర్లలో భూగర్భ జలాలు పడిపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బజార్‌హత్నూర్, నేరడిగొండలో పరిస్థితి దారుణంగా ఉంది. బజార్‌హత్నూర్‌లో 36.23 మీటర్లు, నేరడిగొండలో 48.00 మీటర్ల లోతుకు భూగర్భజలాలు అడుగంటాయి. ఏటా ఈ రెండు మండలాల్లోనే పరిస్థితి తీవ్ర రూపం దాల్చుతుంది.

నిర్మల్‌ జిల్లా..
నిర్మల్‌ జిల్లాలోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది. జిల్లాలో సగటున కనిష్టంగా 4.23 మీటర్లు, గరిష్టంగా 24.98 మీటర్ల లోతులో నీళ్లు పడిపోయాయి. తానూర్‌ మండలం బోసిలో 24.98 మీటర్లు, సారంగాపూర్‌ మండలం బీరవెల్లిలో 19.20 మీటర్లు, నర్సాపూర్‌లో 18.60 మీటర్లు, లోకేశ్వరం మండలం మన్మడ్‌లో 24.50 మీటర్లు, కుంటాలలో 17.70 మీటర్లలో జలాలు పడిపోయాయి.

కుమురంభీం జిల్లా..
కుమురంభీం జిల్లాలోనూ భూగర్భజలాలు పడిపోతున్నాయి. ఆసిఫాబాద్‌లో 21.85 మీటర్లు, కాగజ్‌నగర్‌ శివారు జంబుగాంలో 15.50 మీటర్లు, దహెగాంలో 15.75 మీటర్లు, పెంచికల్‌పేట్‌ సమీపంలోని ఎల్కపల్లిలో 15.50 మీటర్ల లోతులో జలాలు పడిపోయాయి. ఇతర మండలాల్లోనూ భూగర్భ జలాలది ఇదే పరిస్థితి నెలకొంది.
 
మంచిర్యాల జిల్లా..
మంచిర్యాల జిల్లాలోనూ భూగర్భజలాల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. సగటున జిల్లాలో 7.98 మీటర్లకు జలాలు పడిపోయాయి. జైపూర్‌ మండలం కుందారంలో 19.54 మీటర్లకు, మందమర్రి సమీపంలోని పొన్నారంలో 16.35 మీటర్లు, తాండూర్‌లో 15.48 మీటర్లకు పడిపోయాయి. 

వర్షాలు పడితేనే రీచార్జ్‌
సమయానికి వర్షాలు కురువని పక్షంలో భూగర్భజలాలు ప్రమాదకర స్థాయికి వెళ్లిపోయే పరిస్థితి ఉంది. బోర్లు ఎండిపోతున్నాయి. మళ్లీ మంచి వర్షాలు పడినప్పుడే రీచార్జ్‌ అవుతాయి. ప్రజలు నీళ్లను పొదుపుగా వాడాలి. 
           – టి.హన్స్‌రాజ్, అసిస్టెంట్‌ డైరెక్టర్,     భూగర్భజల శాఖ, ఆదిలాబాద్‌  

మరిన్ని వార్తలు