అడుగంటిన ఆశలు

3 Mar, 2018 02:46 IST|Sakshi
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల గుంజపడుగులో అద్దె వాహనంలో నీరు తెచ్చుకుంటున్న మహిళలు, జనగామ జిల్లా వడ్లకొండలోని వ్యవసాయ బోరు వద్ద నీళ్లు పట్టుకుంటున్న గ్రామస్తులు

వేసవి ఆరంభంలోనే రాష్ట్రవ్యాప్తంగా నీటి ఎద్దడి 

పాతాళానికి భూగర్భ జలాలు

పనిచేయని మంచినీటి పథకాలు

  చాలా చోట్ల వ్యవసాయ బావులు, బోర్లే దిక్కు

కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటున్న జనం 

ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టని సర్కారు 

‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి  

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో వేసవికి ముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. మార్చి తొలివారంలోనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి.. బోర్లు, బావులు ఎండిపోయాయి. నీటి కష్టాలపై ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ ఆందోళనకర పరిస్థితులు వెల్లడయ్యాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీం, ఖమ్మం జిల్లాల్లోని గిరిజన తండాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. జనం కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బావుల నుంచి, వాగులు, ఒర్రెల్లో చెలిమెలు తవ్వి నీళ్లు తెచ్చుకుంటున్నారు. వేసవి మొదలవుతున్నా ప్రభుత్వం ‘వాటర్‌ యాక్షన్‌ ప్లాన్‌’ను సిద్ధం చేయకపోవడం, ఆర్‌డబ్ల్యూఎస్‌ పథకాలు మరమ్మతులతో మూలన పడడంతో మిగతా జిల్లాల్లోనూ తాగునీటి కటకట మొదలైంది. తాగునీటి కోసం çపలు గ్రామా ల్లో ప్రజలు ఆందోళనలకు కూడా దిగుతున్నారు. 

కొనుక్కుంటేనే నీళ్లు 
రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల నీటి కష్టాలు మొదలయ్యాయి. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. జనం తాగడానికే కాదు, ఇతర అవసరాలకూ నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నిర్మల్‌ జిల్లాలో గత మేలో 11.25 మీటర్ల లోతులో భూగర్భ జలాలుండగా.. ఈసారి ఫిబ్రవరిలోనే 11.85 మీటర్ల లోతుకు పడిపోయాయి. కుమురం భీం జిల్లాలో డిసెంబర్‌లో సగటున 7.95 మీటర్ల లోతున ఉన్న నీటిమట్టాలు.. జనవరిలోనే 8.35 మీటర్లకు తగ్గిపోయాయి. మంచిర్యాల జిల్లాలో 6,234 బోర్లు ఉండగా.. అందులో ఇప్పటికే 713 పనిచేయడం లేదు. వేమనపల్లి, నెన్నెల, కోటపల్లి, కన్నెపల్లి మండలాల్లో నీటి సమస్య ఏర్పడింది. 

పాతాళానికి నీటి మట్టాలు 
కామారెడ్డి జిల్లాలో జనవరిలో 12.14 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలాలు ఫిబ్రవరి నాటికి 13.89 మీటర్ల లోతుకు.. అంటే ఒక్క నెలలోనే 1.75 మీటర్ల లోతుకు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో 38.21 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం గిరిజన తండాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోనూ భూగర్భజలాలు భారీగా తగ్గిపోయాయి. జిల్లాలో ఏడు పథకాల మరమ్మతులకు ఈ ఏడాది రూ.1.72 కోట్లు కేటాయించినా పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేకపోయారు. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండల పరిధిలోని తండాల్లో జనం నీటి కోసం అవస్థలు పడుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని రాజాపూర్, కురుమూర్తి, జడ్చర్లలలో భూగర్భజలాలు ప్రమాదకర స్థాయిలో 31.80 మీటర్లకు పడిపోయాయి. గతేడాది నీటి ఎద్దడి నెలకొనగా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారు. కానీ చాలామంది ట్యాంకర్ల యజమానులకు ఇంకా బిల్లులు చెల్లించకపోవడంతో.. ఈసారి వారు ముందుకొచ్చే పరిస్థితి లేదు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో 35.73 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. 80 శాతం బోర్లు వట్టిపోవడంతో కేఎల్‌ఐ కాల్వ సమీపంలోని ప్రైవేటు బోర్ల నుంచి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ఆత్మకూరు(ఎస్‌), తిప్పర్తి, మోటకొండూరు, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో నీటి సమస్య తలెత్తింది.

అడుగంటిన బోర్లు.. 
జనగామ జిల్లా వడ్లకొండలో ఆరు వేల జనాభాకు 24 బోర్లు ఉన్నాయి. అందులో ఆరు బోర్ల నుంచి నేరుగా, మరో 4 బోర్ల నుంచి ఓవర్‌ హెడ్‌ ట్యాంకుకు, మిగతా 14 సింగిల్‌ ఫేస్‌ బోర్ల ద్వారా అధికారులు నీటి సరఫరా చేస్తున్నారు. కానీ భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లలో నీళ్లు తగ్గిపోయాయి. దీంతో గ్రామస్తులు వ్యవసాయ బోర్లు, బావుల వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.

రోజు సంపాదన రూ.150.. నీళ్ల ఖర్చు రూ.40
ఈమె పేరు మధునమ్మ. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఎన్టీఆర్‌ కాలనీ. నలుగురున్న కుటుంబాన్ని పోషించుకోవాల్సిన బాధ్యత ఆమెదే. రోజు కూలీకి వెళితే రూ.150 వస్తాయి. కానీ అందులో రోజుకు రూ.40 కేవలం నీటి కోసమే ఖర్చవుతున్నాయి. కాలనీలోని బోరు ఎండిపోవడంతో ప్రైవేట్‌ ట్యాంకర్ల వద్ద నీళ్లు కొనుక్కోక తప్పడం లేదు. ఇంట్లో డ్రమ్ము నీళ్లు సరిపోవని, మరో డ్రమ్ము నీళ్లు కొందామంటే తిండికి తిప్పలవుతుందని ఆమె వాపోయింది. 

చందాలతో బావి తవ్వుకున్నారు 
కుమురం భీం జిల్లా జైనూర్‌ మండలం శివనూర్‌లో ఏటా వేసవి ప్రారంభంలోనే నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతోంది. అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేదు. దాంతో ఇటీవల గ్రామస్తులంతా కలసి చందాలు వేసుకుని బావిని తవ్వించుకున్నారు. ఇంతా చేసీ ఆ బావిలో నీళ్లు పడలేదు. సమీపంలోని వాగుల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. 

మూడు నెలల కిందే వట్టిపోయిన బోర్లు 
ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలం భూతాయి(కే) గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజాయిలో 102 కుటుంబాలకు చెందిన 800 మంది జనాభా ఉన్నారు. కానీ ఉన్నది రెండు చేతి పంపులు మాత్రమే. భూగర్భ జలాలు అడుగంటడంతో మూడు నెలల నుంచి చేతి పంపుల్లో నీరు రావడం లేదు. ఈ గ్రామంలో ప్రతి ఇంటి ముందు ఎడ్లబండి, దానిపై నీళ్ల డ్రమ్ము కనిపిస్తాయి. రెండు కిలోమీటర్ల దూరంలోని ఓ వ్యవసాయ బావి నుంచి ఎడ్ల బండ్లపై నీళ్లు తెచ్చుకుంటున్నారు.

ఒర్రె నీరే దిక్కు
కుమురం భీం జిల్లా వాంకిడి మండలం సాలేగూడలో 25 కుటుంబాలకు ఒకే చేతిపంపు ఉంది. అదీ మరమ్మతులతో మూలనపడింది. గ్రామస్తులు చేసేదేమీ లేక సమీపంలోని ఒర్రె నీరు తెచ్చుకుంటున్నారు. ఎండలు ముదిరితే ఆ నీరూ దొరకదని.. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. 

నీటి కోసం తండా తండ్లాట 
మెదక్‌ జిల్లా చిల్పచెడ్‌ మండలం పానాది తండాలో వేసవికి ముందే నీటి ఇక్కట్లు మొదలయ్యాయి. నీటి కోసం కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సి వస్తోంది. 300 మంది వరకు జనాభా ఉన్నా ఎలాంటి నీటి పథకాలు లేవు. అధికారులు తమ కష్టాలను పట్టించుకోవడం లేదని తండాకు చెందిన నిర్మల వాపోయారు. ఏటా వ్యవసాయ బావుల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నామని తెలిపారు.  

మరిన్ని వార్తలు