ధర్మం చెయ్యొద్దు బాబూ!

18 Sep, 2014 00:37 IST|Sakshi
ధర్మం చెయ్యొద్దు బాబూ!
 • త్వరలో ‘యాచకులు లేని నగరం’
 • అమలుకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ
 • ప్రజల్లో అవగాహనకు ముమ్మర ప్రచారం
 • ‘గౌరవ సదన్’ల ఏర్పాటుకు సన్నాహాలు
 • సాక్షి, సిటీబ్యూరో: ‘యాచకులకు మీరు ధర్మం చేయవద్దు. వారు ఆ వృత్తిని వదిలి... సాధారణ ప్రజల్లాగా జీవించాలంటే ఇంతకంటే మరో మార్గం లేద’టూ జీహెచ్‌ఎంసీ ప్రచారం చేయనుంది. గ్రేటర్ నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్లు.. రహదారుల పొడవునా వీరి వల్ల ప్రజలకు తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదాలూ జరుగుతున్నాయి. ఈ సమస్య పరిష్కారంతో పాటు నగరంలో యాచ క వృత్తిని నిరోధించేందుకు జీహెచ్‌ఎం సీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

  ఇందులో భాగంగా ‘బెగ్గర్ ఫ్రీ సిటీ’ కోసం సన్నాహాలు ప్రారంభిం చింది. యా చకులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి సదుపాయాలు సమకూర్చడం.. పని చేయగలిగిన వారికి అవకాశాలు కల్పించడం... వ్యాధి పీడితులుంటే చికిత్స చేయించడం వంటి కార్యక్రమాలతో ఆ వృత్తి నుంచి విముక్తి కల్పించాలని భావిస్తోంది. ఇన్ని చేసినా ఆ అలవాటు మానలేని వారిని ఆ ‘దారి’ నుంచి తప్పించేందుకు ఎవరూ వారికి ధర్మం చేయకుండా ప్రజల్లోనూ అవగాహన కల్పించాలని భావిస్తోంది.

  ఇందులో భాగంగా విస్తృత ప్రచారం చేపట్టనుంది. బ్యానర్లు.. హోర్డింగ్‌ల ద్వారా ‘భిక్షాటనను ప్రోత్సహించవద్దు’ అంటూ ప్రచారం చేయనుంది. ఇప్పటికే ఇలాంటి స్లోగన్లు, డిజైన్లు తయారు చేశారు. త్వరలోనే వీటితో ప్రచారం చేయనున్నారు. ఈ అంశం మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఏదైనా రంగంలో ప్రసిద్ధి చెందిన వారిని (లెజెండ్‌ను) ఈ కార్యక్రమానికి అంబాసిడర్(ప్రచారకర్త)గా నియమించాలని భావిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు.

  ప్రభుత్వంతో చర్చించి అంబాసిడర్‌ను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఎక్కడైనా బలవంతంగా యాచన చేయిస్తున్నట్లు ప్రజల దృష్టికి వస్తే జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్ (నెంబరు 040- 21 11 11 11)కు ఫిర్యాదు చేయాల్సిందిగా ప్రచారం చేయనున్నారు.
   
  స్థితిగతులపై సర్వే


  నగరంలో దాదాపు 20 వేల మంది యాచకులు ఉన్నట్టు జీహెచ్‌ఎంసీ సర్వేలో తేలింది. వీరిలో రాత్రి బస చేసేందుకు కనీసం నీడ కరువైన వారు దాదాపు వెయ్యి మంది ఉన్నారు. భిక్షాటన ద్వారా వారికి రోజుకు లభిస్తున్న సగటు ఆదాయం ఎంత? అందులో ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎక్కడ, ఎలాంటి  ఆశ్రయం పొందుతున్నారు..? వచ్చిన డబ్బును ఏం చేస్తున్నారు.. తదితర అంశాలను సేకరించారు. ఏయే ట్రాఫిక్ జంక్షన్ల వద్ద యాచకులు అధిక సంఖ్యలో ఉన్నారు? వీరి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్న వంద జంక్షన్ల వివరాలు సేకరించారు.

  యాచకులను ఏ విధంగానూ ప్రోత్సహించరాదని, పునరావాసం ద్వారా సమాజంలో వారికి గౌరవం కల్పించాల్సిందిగా ప్రజలకు సూచిస్తూ వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు. వీరికి ఆశ్రయం కల్పించేందుకుస్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోనున్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ద్వారా యాచకుల్లోని వృద్ధులు, వికలాంగులకు ఆసరా కల్పించాలని భావిస్తున్నారు.

  జీహెచ్‌ఎంసీ తరఫున తొలిదశలో జోన్‌కు ఒకకేంద్రం చొప్పున ఏర్పాటు చేసి వారికి ఆశ్రయం కల్పించనున్నారు. వాటికి ‘గౌరవసదన్’లుగా నామకరణం చేయనున్నారు. వాటిలో ఉండే వారికి ఆహారం, దుస్తులు, సబ్బులు, తలనూనెల వంటి వాటికి కొంత నగదు ఇస్తారు. పని చేయగలిగిన శక్తి ఉన్న వారికి పనులు చూపిస్తారు.
   

మరిన్ని వార్తలు