తిరిగొచ్చిన చెల్లెండ్లు

29 Sep, 2019 07:13 IST|Sakshi
ఈక్వేటారి అవార్డుతో మొగులమ్మ, అనసూయమ్మ

అంతర్జాతీయ వేదికపై మొగులమ్మ, అనసూయమ్మల ప్రసంగం   

అవార్డుతో స్వస్థలాలకు తిరిగి వచ్చిన డీడీఎస్‌ మహిళా సంఘం సభ్యులు 

సాక్షి, జహీరాబాద్‌: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పెట్టుకుని ముందుకు సాగుతున్న డీడీఎస్‌(డెక్కన్‌  డెవలప్‌మెంట్‌ సొసైటీ)  మహిళా సంఘం సభ్యులు మొగులమ్మ, అనసూయమ్మలు ఐక్యరాజ్య సమితి అవార్డును అందుకుని స్వస్థలాలకు తిరిగి వచ్చారు. శనివారం వారు జహీరాబాద్‌ చేరుకున్నారు. మూడు దశాబ్దాల కాలంగా డీడీఎస్‌ మహిళా సంఘం సభ్యులు చేస్తున్న పర్యావరణ హిత కార్యక్రమాలను గుర్తించిన ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థయిన యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం(యూఎన్‌ డీపీ)‘ఈక్వేటారి’ అవార్డుకు ఎంపిక చేసింది. డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ మహిళా సంఘం(చిరు ధాన్యాల చెల్లెండ్ల సమాఖ్య) సభ్యులు ఈ అవార్డును అందుకున్నారు. ఈనెల 19 నుంచి 26వ తేదీ వరకు అమెరికాలోని న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అవార్డుల ప్రదానం కార్యక్రమం నిర్వహించింది. 25న అవార్డు ఈ వేదికపై నుంచి డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ(డీడీఎస్‌) మహిళా సంఘం సభ్యులు అనసూయమ్మ, మొగులమ్మలు అవార్డు అందుకున్నారు. 2019 సంవత్సరానికి గాను జహీరాబాద్‌ మండలంలోని పస్తాపూర్‌లో ఉన్న డీడీఎస్‌ మహిళా సంఘానికి ఈక్వెటారి అవార్డు దక్కింది. డీడీఎస్‌ మహిళా సంఘానికి వచ్చిన అవార్డును అందుకునేందుకు పస్తాపూర్‌ గ్రామానికి చెందిన అనుసూయమ్మ, పొట్‌పల్లి గ్రామానికి చెందిన మొగులమ్మలను సంస్థ ఎంపిక చేసింది. గత 17 సంవత్సరాల కాలంగా యూఎన్‌డీపీ ప్రతి సంవత్సరం ప్రపంచ స్థాయిలో అందజేస్తున్న అవార్డులు ఇప్పటి వరకు మన దేశంలో 9 సంస్థలకు మాత్రమే దక్కాయి. ఈ సారి డీడీఎస్‌ మహిళా సంఘం 10వ అవార్డుకు ఎంపికైంది.

సేంద్రియ వ్యవసాయంపై మొగులమ్మ ప్రసంగం
డీడీఎస్‌ మహిళా సంఘం అధ్యక్షురాలు పొట్‌పల్లి మొగులమ్మ సేంద్రియ వ్యవసాయం, భూసారాన్ని పెంచడం, చిరు ధాన్యాల సాగు, కలిపి పంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలను న్యూయార్క్‌లో జరిగిన వేదికపై ప్రస్తావించింది. ప్రస్తుతం రసాయన ఎరువుల వాడకం వల్ల ఎదురవుతున్న అనర్థాలు, మానవ మనుగడకు ముంచుకు వస్తున్న ముప్పును వివరించింది. సేంద్రియ వ్యవసాయం, చిరుధాన్యాల ఆహారంతోనే భవిష్యత్తు ఉందని, దీన్ని అన్ని దేశాల ప్రజాప్రతినిధులు, అధికారులు గుర్తించాలని చెప్పుకొచ్చారు. పర్యావరణ వ్యవసాయంతో ఎంతో ముందడుగు సాధించామని, ఇది తమకు అవార్డును తెచ్చిపెట్టిందన్నారు. ఇన్నేళ్లకైనా తమ సంస్థకు ఈక్వేటారి అవార్డు రాడంతో జీవితంలో గుర్తిండిపోతుందని వేదికపై సంతోషం వ్యక్తం చేశారు.  

అడవులు పెంచడంపై అనసూయమ్మ ప్రసంగం
మొక్కలు నాటడం, అడవుల పెంపకం ప్రాధాన్యతపై డీడీఎస్‌ మహిళా సంఘం ప్రతినిధి అనసూయమ్మ తన అభిప్రాయాన్ని అంతర్జాతీయ వేదికపై వినిపించింది. అడవులను పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వాళ్లమవుతామని, అంతే కాకుండా పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడం చెట్ల పెంపకం ద్వారానే సాధ్యమని చెప్పారు. తాను తోటి మహిళలతో కలిసి అడవిని పెంచానని, ఇప్పుడు ఇది ఎంతో ఫలితాలను ఇస్తోందన్నారు. ప్రతి దేశం కూడా అడవులను పెంచాల్సిన ఆవశ్యకతపై ప్రస్తావించి అందరి నుంచి అభినందనలు అందుకున్నారు. తాము చేసిన పనులకు గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని, డీడీఎస్‌ మహిళా సంఘానికి వచ్చిన ఈక్వేటారి అవార్డు అందుకోవడం కూడా జీవితంలో మర్చిపోలేని అనుభూతినిచ్చిందని వేదికపై పేర్కొంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా