ఉద్యోగాలు పోతున్నాయ్‌!

27 Apr, 2020 04:41 IST|Sakshi

కరోనా ప్రభావంతో దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం

ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన 7.91 శాతం..

అదే ఈ నెల 1వ తేదీ నాటికి 9 శాతానికి పెరుగుదల

ఈ 25 రోజుల్లోనే 14 శాతం పెరుగుదలతో 23.56 శాతానికి చేరిక

గ్రామీణ ప్రాంతాల్లో 22.71 శాతం.. పట్టణ ప్రాంతాల్లో 25.46 శాతం

ఈ నెలాఖరుకు 26 శాతానికిపైగా చేరుకోనున్న నిరుద్యోగం

సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ అంచనా

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతోంది. కరోనా కారణంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో కూలీలు ఉపాధికి దూరమయ్యారు. వివిధ రంగాల్లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. లాక్‌డౌన్‌ ప్రభావం అసంఘటిత రంగంపై తీవ్రంగా పడింది. మార్చి ఒకటో తేదీ నాటికి దేశంలో నిరుద్యోగం 7.91 శాతమే ఉండగా అనేక రంగాల్లో ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి శనివారం నాటికి అది 23.56 శాతానికి చేరుకుంది. ఏప్రిల్‌ ఒకటో తేదీ నాటికి 9 శాతం ఉన్న నిరుద్యోగం.. మార్కెట్‌ పరిస్థితులు దిగజారిపోవడంతో 25 రోజుల్లోనే 14 శాతం నిరుద్యోగం పెరిగింది. ప్రసుత్తం 23.56 శాతం ఉన్న నిరుద్యోగం ఈ నెలాఖరుకు 26 శాతానికి చేరుకుంటుందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ అంచనా వేసింది. మార్చి ఒకటో తేదీన పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 8.63 శాతం ఉంటే ఈనెల 25వ తేదీ నాటికి 25.46 శాతానికి చేరుకుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 7.58 శాతం నుంచి 22.71 శాతానికి పెరిగింది.

లాక్‌డౌన్‌ నుంచి మొదలుకొని..
మార్చి 22న ప్రకటించిన లాక్‌డౌన్‌ ప్రభావం ఆ నెలలో కనిపించకపోయినా వారం రోజుల తర్వాత ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి తన ప్రభావాన్ని భారీగా చూపింది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోవడంతో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడంతో నిరుద్యోగం పెరుగుతూ వచ్చింది. ఏప్రిల్‌ రెండో వారం నుంచి దీని ప్రభావం తీవ్రంగా పడింది. ఏప్రిల్‌ మొదటి వారంలో పెరుగుదల సాధారణంగా ఉన్నా.. రెండో వారంలో పెరుగుదల ఎక్కువవుతూ వచ్చింది. మూడో వారం గడిచేసరికి 23.56 శాతానికి చేరింది.

పునరుద్ధరణ ప్రభుత్వాలకు సవాలే: ప్రొఫెసర్‌ కోదండరామ్‌
సర్వీసు సెక్టార్‌ నిలిచిపోయింది. ఐటీ రంగం, రియల్‌ ఎస్టేట్‌ ఆగిపోయింది. హౌస్‌హోల్డ్‌ సేవలు నిలిచిపోయాయి. భవన నిర్మాణ కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. అగ్రికల్చర్‌ కొంత కొనసాగుతున్నా లాక్‌డౌన్‌ ప్రభావం తీవ్రంగానే పడింది. రాష్ట్రంలో 50 శాతం కార్మికులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నవారున్నారు. అసంఘటిత రంగంలో దినసరి వేతన కూలీలు, ప్లంబర్స్, వెల్డర్స్, ఎలక్ట్రీషియన్‌ రంగాల్లోని వారికి పనే లేదు. వాటన్నింటిని ఎలా పునరుద్ధరిస్తారనేదే ఇప్పుడు ప్రభుత్వాలకు పెద్ద సవాలే. అన్నింటి కంటే మెజారిటీ కార్మికులు, ఉద్యోగులున్న అసంఘటిత రంగాన్ని ముందుగా రివైవ్‌ చేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో అందుకు ఉపాధి హామీ లాంటి కార్యక్రమం చేపట్టాలి. ధాన్యం నిల్వలు అధికంగా ఉన్నందునా పని చేసిన వారికి వాటిని పంపిణీ చేయడం తిండి లేక ఇబ్బంది పడే పరిస్థితి పోతుంది.

ఇదీ రాష్ట్ర పరిస్థితి..
ఇక తెలంగాణలో లేబర్‌ పార్టిసిపేషన్‌ రేట్‌ (ఎల్‌పీఆర్‌) గతేడాది డిసెంబర్‌ మధ్యలో 53.44 ఉండగా, నిరుద్యోగం రేట్‌ 2.30 శాతంగా ఉంది. అది మార్చి చివరి నాటికి 5.8 శాతానికి పెరిగింది. ఈ నెలాఖరుకు నెలవారీ లెక్కలు రానున్నాయి. అయితే దేశంలో నిరుద్యోగం రేటు (అన్‌ ఎంపాయ్‌మెంట్‌ రేట్‌–యూఈఆర్‌) ఏప్రిల్‌ 1 నుంచి 25 రోజుల్లోనే అంతకుముందు ఉన్నదానిపై 14 శాతం పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగం రేట్‌ యావరేజ్‌గా 15 శాతం వరకు వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో గత డిసెంబర్‌లో ఎల్‌పీఆర్‌ 43.13 శాతం ఉండగా, యూఈఆర్‌ 4.22 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌పీఆర్‌ 60.61 శాతం ఉండగా యూఈఆర్‌ 1.35 శాతంగా ఉంది.

తగ్గిపోయిన కార్మిక భాగస్వామ్యం 
సుదీర్ఘ లాక్‌డౌన్‌తో దేశంలో కార్మిక భాగస్వామ్యం తగ్గిపోయింది. దినసరి వేతన కూలీలు, భవన నిర్మాణ కార్మికుల ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సేవా రంగంలోనూ పనులు లేకుండా పోయాయి. దీంతో కార్మిక భాగస్వామ్యం రేటు 41.96 శాతం నుంచి 35.01 శాతానికి పడిపోయింది. ఉద్యోగ, ఉపాధి రేటు కూడా భారీగా పడిపోయింది. మార్చి ఒకటో తేదీ నాటికి ఉపాధి 39.84 కోట్ల మందికి ఉంటే ఏప్రిల్‌ 19 నాటికి 27.07 కోట్ల మందికే ఉపాధి ఉన్నట్లుగా తేల్చింది. అంటే దేశంలో కార్మికులు, చిన్న ఉద్యోగులు 12.77 శాతం మంది ఉద్యోగ, ఉపాధిని కోల్పోయారు.

మరిన్ని వార్తలు