తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు అన్యాయం 

24 Mar, 2019 03:31 IST|Sakshi

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య  

తెలంగాణ, ఏపీలో జరిగే ఎన్నికల వ్యూహంపై బీసీ సంఘాల చర్చలు 

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు రాజకీయ పక్షాలు అన్యాయం చేస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆవేదన వ్యక్తపరిచారు. తెలంగాణ పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలలో బీసీ సంఘాలు అనుసరించాల్సిన వ్యూహంపై జాతీయ బీసీ సంఘం కోర్‌ కమిటీ సమావేశం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో శనివారం ఆర్‌.కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది.  ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు టికెట్లు కేటాయించకుండా అన్యాయం చేశా యని విమర్శించారు. వాస్తవానికి జనాభా ప్రకారం బీసీలకు 9 సీట్లు కేటాయించాలని, కానీ ఆ పార్టీలు వారిని ఓటు బ్యాంక్‌గానే చూస్తున్నాయని అన్నారు.

టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు కేవలం 4 ïసీట్ల చొప్పున కేటాయించి అన్యాయం చేశాయని విమర్శించారు. గ్రామాలలో బీసీ కులాల్లో విపరీతమైన రాజకీయ చైతన్యం వచ్చిందని, ఇష్టమొచ్చినట్లు టికెట్లు ఇస్తే గుడ్డిగా ఓట్లు వేయరని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెడితేనే రాజకీయంగా న్యాయం జరుగుతుందన్నారు. అందుకే ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ రిజర్వేషన్లు పెడతామని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేకంగా బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించే పార్టీలకే బీసీలు అనుకూల నిర్ణయాలు తీసుకుంటారన్నారు.

తటస్థంగా ఉంటే బీసీలకు ఇంకా 50 ఏళ్ల వరకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వరన్నారు. త్వరలో మరోసారి సమావేశమై విధాన ప్రకటన చేయాలని నిర్ణయించారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల కల్పనకు ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నేతలు నీల వెంకటేష్, ఉపేందర్‌గౌడ్, శ్రీనివాస్, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు