గుర్తింపు లేని కాలేజీలు.. 1,338

25 Jul, 2019 02:44 IST|Sakshi

361 ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకే అనుబంధ గుర్తింపు

గుర్తింపుకోసం దరఖాస్తు చేసుకోని కాలేజీలు

ఆయా కాలేజీలకు ఇచ్చిన గడువు మరో వారం రోజులు

ఆ తర్వాత అఫిలియేషన్లు ఇవ్వబోమంటున్న ఇంటర్‌ బోర్డు

అఫిలియేషన్‌ లభించని వాటిలో 25 శ్రీచైతన్య, 26 నారాయణ కాలేజీలు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ కాలేజీల అనుబంధ గుర్తింపులో ఏటా తంటాలు తప్పడం లేదు. అనుబంధ గుర్తింపు కోసం ఏయే సర్టిఫికెట్లు అందజేయాలన్న విషయం కాలేజీ యాజమాన్యాలకు తెలిసినా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో నిబంధనల ప్రకారం అత్యధిక ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు వ్యవహరించడం లేదు. బోర్డు ఆదేశాలను పట్టించుకోవడం లేదు. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టే కాలేజీల అనుబంధ గుర్తింపు కోసం గతేడాది డిసెంబర్‌లోనే నోటిఫికేషన్‌ జారీ చేసి, దరఖాస్తులను స్వీకరించినా కాలేజీలన్నీ నిర్దేశిత సర్టిఫికెట్లను అందజేయలేదు. దీంతో రాష్ట్రంలో అనుబంధ గుర్తింపు వ్యవహారం గందరగోళంగా మారింది. ఇప్పటివరకు కూడా వాటిని ఇవ్వకపోవడంతో 1,338 కాలేజీలకు అనుబంధ గుర్తింపు లేకుండా పోయింది. అయితే ఆయా కాలేజీల్లో ఇప్పటికే ప్రవేశాలు పూర్తయ్యాయి. చివరకు విద్యార్థులు భవిష్యత్‌ పేరుతో అనుబంధ గుర్తింపు పొందేందుకు ఆయా యాజమాన్యాలు చర్యలు వేగవంతం చేశాయి. అందులో 75 కార్పొరేట్‌ కాలేజీలు ఉండగా, అత్యధికంగా నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యాలకు చెందినవే కావటం గమనార్హం. కాగా, రాష్ట్రంలో ఇంటర్‌ బోర్డు పరిధిలోని 405 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు కాకుండా పాఠశాల విద్యా శాఖ, సంక్షేమ శాఖల పరిధిలో మరో 558 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. అందులో 492 కాలేజీలకు ఇంటర్‌ బోర్డు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. మరో 66 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఇతర విద్యా సంస్థల గుర్తింపు ప్రాసెస్‌ కొనసాగుతోంది. ప్రైవేటు కాలేజీలు 2,155 ఉండగా, వాటిల్లో 1,699 కాలేజీలే అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వాటిల్లో 361 కాలేజీలకు షరతులతో కూడిన అనుబంధ గుర్తింపును బోర్డు జారీ చేసింది. వాటిలోనూ ఫిజికల్‌ డైరెక్టర్, లైబ్రేరియన్లు లేరు. 3 నెలల్లో నియమించుకుంటామన్న షరతుతో వాటికి అనుబంధ గుర్తింపును జారీ చేసింది. మిగతా 1,338 కాలేజీలకు ఇంకా అనుబంధ గుర్తింపును ఇవ్వలేదు. 

చివరకు శానిటేషన్‌ సర్టిఫికెట్లూ లేవు.. 
రాష్ట్రంలోని ఎక్కువ శాతం ప్రైవేటు కాలేజీలకు రిజిస్టర్‌ లీజ్‌ డీడ్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రెన్యువల్, స్ట్రక్చరల్‌ సౌండ్‌ నె‹స్, ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్లు, ఆట స్థలాలు లేవు. సరిగ్గా ఫ్యాకల్టీ లేరు. గతేడాది అంతకుముందు ఇచ్చి న అనుబంధ గుర్తింపు ఫీజులను చెల్లించలేదు. శానిటరీ, హైజీన్‌ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఈ కారణాలతో 1,338 కాలేజీలకు ఇంటర్‌ బోర్డు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. ఇందులో ఐదారు ఫ్లోర్లు కలిగిన భవనాల్లో నడుపుతున్న 75 కార్పొరేట్‌ కాలేజీలున్నా యి. వాటికి ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్లు లేవు. అందులో శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందినవి 25, నారాయణ విద్యా సంస్థలకు చెందినవి 26, శ్రీగాయత్రి విద్యా సంస్థలకు చెందినవి 8, ఎన్‌ఆర్‌ఐ విద్యా సంస్థలకు చెందినవి 4, ఇతర విద్యా సంస్థలకు చెందినవి 12 ఉన్నాయి. అవన్నీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్‌ జిల్లాల పరిధిలోనే ఉన్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ కాలేజీలు అన్నింటికి అనుబంధ గుర్తింపు లేకపోవడం, విద్యార్థులను చేర్చుకున్న నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్‌ పేరుతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యాయి. 

మరో వారం సమయం ఇస్తాం: అశోక్‌ 
అనుబంధ గుర్తింపు తీసుకోని విద్యా సంస్థలకు మరో వారం గడువు ఇస్తామని ఇంటర్‌ బోర్డు కార్యద ర్శి అశోక్‌ పేర్కొన్నారు. ఆ తర్వాత అనుబంధ గుర్తిం పు ప్రక్రియను నిలిపివేస్తామని చెప్పారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని తెలిపారు. ఆయా విద్యా సంస్థలన్నీ తమకు కాలేజీలకు సంబంధించిన నిర్ధేశి త సర్టిఫికెట్లను అందజేసి అనుబంధ గుర్తింపు పొం దాలన్నారు. అలా గుర్తింపు పొందని విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వంతో చర్చించి తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. అందులో 194 కాలేజీలకు అనుబందంగా హాస్టళ్లు ఉన్నాయని వివరించారు. హాస్టళ్ల గుర్తింపు విషయంలో కేసు కోర్టులో ఉన్నందు న ఆ విషయం జోలికి వెళ్లడం లేదన్నారు.

మరిన్ని వార్తలు