ఉద్యోగులకు ఊరట

2 Feb, 2019 10:14 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌ చిన్న, సన్నకారు రైతులు, ఉద్యోగులు, అంగన్‌వాడీలు, అసంఘటిత రంగ కార్మికులకు మేలు కల్పించింది. ఐదెకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ. 6 వేలు అందించనున్నట్లు ప్రకటించింది. అక్రమాలకు తావు లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే పెట్టుబడి సాయం జమకానుంది. ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంచడంతో ఉద్యోగులు, వేతనాలు పెంచడంతో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 60 ఏళ్లు నిండిన అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్‌ కింద రూ. 3 వేలు అందించనున్నారు. కార్మికులు పెన్షన్‌ కోసం ప్రతి నెల రూ. 100 చొప్పున జమ చేయాల్సి ఉంటుంది. 

నిజామాబాద్‌నాగారం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఉద్యోగులకు ఊరట లభించింది. ఎప్పటి నుంచో ఉద్యోగులు ఆదాయ పరిమితి పెంపు, గ్రాడ్యూటీ, ఒకే పెన్షన్‌ విధానం తదితర వాటిపై ఎదురుచూస్తున్నారు. ఈ బడ్జెట్‌లో ప్రభు త్వం ఆదాయ పరిమితిని పెంచడంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. నిజామాబాద్‌ ఉమ్మడి(కామారెడ్డి–నిజామాబాద్‌)ల్లో సుమారు 42 వేల మంది ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు.

ఉద్యోగులకు లబ్ధి ఇలా.. 
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు 42 వేల మంది ఉన్నారు. ఇందులో నిజామాబాద్‌ జిల్లాలో 24 వేల మంది ఉద్యోగులు, కామారెడ్డి జిల్లాలో 18 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో సీపీఎస్‌ విధానంలో ఉన్న ఉద్యోగులు సుమారుగా రెండు జిల్లాలో కలిపి 9 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో 5342 మంది, కామారెడ్డి జిల్లాలో 3,560 మంది ఉన్నారు. అయితే ఉద్యోగుల ఆదాయ పరిమితి పెంపు 2.50 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచారు. గ్రాట్యూటీ పరిధి రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు పెంచారు. ప్రావిడెంట్‌ ఫండ్‌లో పెట్టుబడి పెడితే ఉద్యోగులకు రూ. 6.5 లక్షలలోపు ఆదాయపన్ను మినహాయింపు, స్టాండెడ్‌ డిడెక్షన్‌ ఇప్పటి వరకు రూ. లక్షా 50 వేల వరకు ఉండేది. మరో రూ. 50 వేలు పెంచడం జరిగింది. ఆదాయ పరిమితి పెంపు విషయంలో ఈబీసీ కులాల వారికి మాత్రం రూ. 8 లక్షలలోపు ఆదాయ పరిమితి ఉన్న వారిని పేదలుగా గుర్తించారు. అలాగే ఉద్యోగులకు కూడా రూ. 5 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు చేసి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
సీపీఎస్‌ ఉద్యోగులకు అన్యాయం
దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని ప్రవేశపెడుతున్న ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో అన్యాయం చేసింది. ప్రజాప్రతినిధులకు మాత్రం ఐదేళ్లు పరిపాలిస్తే జీవితాంతం పెన్షన్‌ సౌకర్యం ఉంది. అదే ఏళ్ల తరబడి ఉద్యోగులు నిర్వహిస్తున్న వారికి మాత్రం పెన్షన్‌ సౌకర్యం లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 9 వేల మందికిపైగా సీపీఎస్‌ ఉద్యోగులు ఉన్నారు. 2004 సంవత్సరం తరువాత ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికి సీపీఎస్‌ విధానం అమలవుతోంది.

దీంతో ప్రభుత్వం నుంచి పెన్షన్‌ లేకుండా పోయింది. ఒకే దేశం ఒకే పెన్షన్‌ విధానాన్ని ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తే బాగుండేదని కోరుతున్నారు. ఏళ్ల తరబడిగా పోరాటాలు చేస్తున్న సీపీఎస్‌ ఉద్యోగులకు మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారినా సీపీఎస్‌ ఉద్యోగులకు మాత్రం పాతపెన్షన్‌ విధానాన్ని అమలు చేయడం లేదు. దీంతో పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయులు సీపీఎస్‌ విధానం కొనసాగింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు