కేంద్ర బడ్జెట్‌పై కేసీఆర్‌ మౌనమెందుకు?: గూడూరు

5 Feb, 2019 02:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ఉన్నా దానిపై స్పందించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. కేవలం టీఆర్‌ఎస్‌ నేతలు స్పందించి సాదాసీదా ప్రకటనలు చేశారని, ముఖ్యమంత్రిగా కేంద్ర బడ్జెట్‌పై స్పందించాల్సి ఉన్నా ఎందుకు మాట్లాడటం లేదని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ప్రశ్నించారు. కేంద్రం చేసిన అన్యాయాన్ని ప్రశ్నించకపోగా ప్రజల దృష్టిని ఇతర అంశాల వైపు మళ్లించేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి తగిన న్యాయం జరగలేదు.

పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చలేదు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీతో పాటు చాలా కేంద్ర ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులకు నిధులిచ్చేందుకు నీతి ఆయోగ్‌ తిరస్కరించింది’అని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ మౌనమే ఆయన బీజేపీ, మోదీ మద్దతుదారుడని తెలిసిపోయిందని, కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో సంవత్సరాల వారీగా బయటపెట్టాలని నారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు.   

మరిన్ని వార్తలు