సంతోష్‌బాబు కుటుంబానికి కిషన్‌రెడ్డి పరామర్శ

21 Jun, 2020 18:51 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట: దేశ రక్షణలో వీర మరణం పొందిన అమర జవాన్‌ కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సంతోష్‌బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం తెలంగాణ బిడ్డ కల్నల్‌ సంతోష్‌బాబు త్యాగం వెలకట్టలేనిదన్నారు. సంతోష్ కుటుంబానికి భారత సైన్యం, ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందన్నారు. చిన్న వయసులో మంచి భవిష్యత్తు ఉన్న అధికారిని కోల్పోవడం కుటుంబానికే కాకుండా దేశానికి, సైన్యానికి తీరని నష్టం అని పేర్కొన్నారు.కష్టకాలంలో ప్రతి ఒక్కరు సంతోష్ కుటుంబానికి అండగా నిలిచి మనోధైర్యం కల్పించాలని కోరారు. (రేపు సూర్యాపేటకు సీఎం కేసీఆర్)‌

చైనా దొంగ దెబ్బ తీసింది..
‘‘భారత భూ భాగాన్ని, సైనికుల ప్రాణాలను రక్షించడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. పరిణామాలను ఎదుర్కోవడానికి షరతులు లేకుండా వ్యవహరించాలని సైన్యానికి ఆదేశాలిచ్చాం. సంప్రదింపులు జరుపుతూనే చైనా దొంగ దెబ్బ తీసిందని’’ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం ఎలా వ్యవహరించాలని అఖిలపక్షం సమావేశం నిర్వహించామని, ఇతర దేశాధినేతలతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. జవాన్ల త్యాగాలు వృధాపోవని, ఏ లక్ష్యం కోసం ప్రాణ త్యాగం చేశారో ఆ లక్ష్య సాధన కోసం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ కల్పించామని తెలిపారు. ప్రతీకార జ్వాలతో ఉన్న ప్రజల్లో చైనా వ్యతిరేక భావజాలం పెరుగుతుందన్నారు. చైనా వస్తువులను వాడకుండా ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. (ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం)

కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ రాంచదర్‌రావు,బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్‌రావు తదితరులు ఉన్నారు. అంతకు ముందు రోడ్లు,భవనాల శాఖ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న కేంద్రమంత్రికి బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

మరిన్ని వార్తలు