‘అభివృద్ధి’కి కలిసికట్టుగా పనిచేద్దాం

25 Feb, 2020 14:48 IST|Sakshi

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి

సాక్షి, రంగారెడ్డి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా గుమ్మడవెల్లి గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఎంపీ ఒక గ్రామాన్ని ఎంచుకుని అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ సూచించారని తెలిపారు.తాను గెలిచిన ప్రాంతంలో గ్రామాలు లేనందున దగ్గరలోనే ఏదో ఒక గ్రామం తీసుకోవాలని అనుకున్నానని తెలిపారు. ‘గుమ్మడవెల్లి గ్రామానికి కనెక్టివిటీ ఉన్నా జరగాల్సిన అభివృద్ధి జరగలేదు. గ్రామ అభివృద్ధి కోసం మీతో కలిసి పని చేస్తా.. కుల,మతాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలి’ అని కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

తనపై వస్తున్న విమర్శలపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ..  అత్యవసర పరిస్థితులు వచ్చిప్పుడు ఢిల్లీ వెళ్తున్నానని తెలిపారు. ఢిల్లీలో లొల్లి జరుగుతుంటే తాను ఊర్లలో తిరుగుతున్నానని సోషల్‌ మీడియాలో చేస్తోన్న దుష్ప్రచారాన్నిఆయన తప్పుబట్టారు. గ్రామాభివృద్ధిలో లక్ష్యంగానే తాను ఈ సభలో పాల్గొనేందుకు వచ్చానని ఆయన తెలిపారు. ఎన్‌ఐఆర్‌డీ నేరుగా ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సూచించారు. స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌ను కూడా గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. అపోలో,కేర్‌,నిమ్స్‌, సరోజినీదేవి ఆసుపత్రుల నుంచి వైద్యులను రప్పించి వైద్యసేవలు అందేలా చూస్తామని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు