‘స్వేచ్ఛనిచ్చాం.. నిర్ణయాలు తీసుకోండి’

12 Jul, 2020 17:20 IST|Sakshi

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ వేగవంతం చేయాలన్నారు. ‘‘కరోనా కట్టడికి కేంద్రం రూ.215 కోట్లు విడుదల చేసింది. కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాటు, లాక్‌డౌన్ విషయంలో రాష్ట్రాలకే స్వేచ్ఛనిచ్చాం. రాష్ట్రాలు పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చని’’ ఆయన తెలిపారు.

ప్రభుత్వాస్పత్రులకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారని,  ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే రూ.లక్షలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడం వల్లే ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా బాధితుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నాయని విమర్శించారు. 200లకు పైగా వెంటిలేటర్లు గాంధీ ఆస్పత్రిలో ఉన్నా ప్రజలెందుకు భయపడుతున్నారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందన్నారు. కరోనా చికిత్సలో ప్రజలకు పూర్తి విశ్వాసం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. గాంధీ ఆసుపత్రిలో పారిశుధ్యం పెంచాలని ఆదేశాలిచ్చానని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు