అసామాన్యుడు

3 Sep, 2014 03:23 IST|Sakshi

హుస్నాబాద్ : హుస్నాబాద్‌కు మంజూరైన రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని మంత్రి ఈటెల రాజేందర్ హుజూరాబాద్‌కు తరలించుకుపోవడాన్ని నిరసిస్తూ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. అఖిలపక్షం ఆధ్వర్యంలో అందరూ ఆందోళనబాట పడితే.. మండలంలోని నందారం గ్రామపంచాయితీకి చెందిన అజ్మీర హరియా నాయక్ మాత్రం ఈ అన్యాయాన్ని న్యాయస్థానంలోనే తేల్చుకోవాలని న్యాయపోరాటానికి దిగాడు.

ఆగస్టు 27న హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని మదన్‌మోహన్ అనే న్యాయవాది ద్వారా దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో మంగళవారం హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ జీవో 18ని రద్దు చేస్తూ.. హుస్నాబాద్ పేరిట జారీ అయిన 235ను కొనసాగించాలని హైకోర్టు న్యాయమూర్తి విలాస్ అఫ్జల్ పుర్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అజ్మీరా హరియా నాయక్ పేరు హుస్నాబాద్, హుజారాబాద్ నియోజకవర్గాలతో పాటు జిల్లాలో మారుమోగుతోంది. వివిధ పార్టీల నాయకులు, ప్రజల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
 

మరిన్ని వార్తలు