‘ఫిట్‌ ఇండియా.. ఫిట్‌ స్కూల్‌’

7 Jan, 2020 02:40 IST|Sakshi

పాఠశాలల్లో అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు  

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాలల్లో వ్యాయామ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర యువజన సర్వీసుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఫిట్‌ ఇండియా ఫిట్‌ స్కూల్‌ విధానం అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రతి పాఠశాలలో కచ్చితంగా నిత్యం వ్యాయామం చేయాలని, ఇందుకోసం అనుసరించాల్సిన విధివిధానాలను విడుదల చేసింది.  

స్కూళ్లలో అమలు చేయాల్సిన కార్యక్రమాలు.. 
సోమవారం: యోగా, వ్యాయామం చేయడంతో పాటు శారీరక దృఢత్వం కోసం అనుసరించాల్సిన విధానాలు, శరీరం సౌష్టవంగా ఉంటేనే మనసు పూర్తి స్థాయిలో పని చేస్తుందనే విషయాలను నిపుణులతో చెప్పించాలి. మంచి పోషకాహారాన్ని నిత్యం తీసుకోవాలని పోషకాహార నిపుణుల సలహాలు ఇప్పించాలి. 
మంగళవారం: ప్రార్థన సమయంలో కొంతసేపు కచ్చితంగా కాళ్లు, చేతులు ఆడిస్తూ వ్యాయామం చేయాలి. పాఠశాలల పని వేళల్లో సమయం ఏర్పాటు చేసుకొని శరీరానికి శ్రమ కల్గించే ఆటలు ఆడడం, క్రీడలతో మానసిక ఆరోగ్యం ఎలా సాధ్యమవుతుందో వివరించే ప్రసంగాలు ఇప్పించాలి. ఇందుకోసం అందుబాటులో ఉన్న పేరు పొందిన క్రీడాకారులను పాఠశాలలకు ఆహ్వానించి వారితో తమ ఆరోగ్య రహస్యం వివరించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. 
బుధవారం: వ్యాయామ ఉపాధ్యాయులు ‘ఖేలో ఇండియా యాప్‌’ను అనుసరిస్తూ.. అందులో పేర్కొన్న శారీరక దారుఢ్యం పెంపొందించుకునే చిట్కాలను వివరించాలి. వయసుకు తగిన శరీరాకృతితో మంచి ఆరోగ్య సౌభాగ్యం పొందే అంశాలపై వాల్‌ పోస్టర్ల ద్వారా విద్యార్థులకు వివరించాలి. 
గురువారం: శరీరంలోని అన్ని అవయవాల్లో చురుకుదనం పెంచేందుకు నృత్యం, ఏరోబిక్స్, ఆత్మరక్షణ విద్యలు, యోగాసనాలు, తాడుతో ఎగురుడు ఆటలు, స్కిప్పింగ్, తోట పని నేర్పించాలి. విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించాలి. వక్తృత్వం, వ్యాసరచన, గేయాల రచన, పాటలు పాడటం లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. 
శుక్రవారం: సాధారణ శరీరాకృతికి సంబంధించిన ఆటలు, వ్యాయమం పట్ల విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించాలి. వివిధ పాఠశాలలు అనుసరిస్తున్న కొత్త రకం వ్యాయామ కార్యక్రమాలపై సమాచారం సేకరించి తమ పాఠశాలల్లో అమలు చేయాలి. 
శనివారం: నిపుణులు సూచించిన వ్యాయామాలు, ఆటలతోపాటు స్థానికంగా బహుళ ప్రచారం పొందిన ఆటలు ఆడించాలి. కబడ్డీ, బొంగరాలు తిప్పడం, దొంగ పోలీస్‌ ఆట, కుప్పిగంతులాట, వేగంగా నడవడం, పరుగెత్తడం, పుస్తకాలలోని పాఠ్యాంశాలను మనో పఠనంతో వేగంగా చదవడం కంటికి వ్యాయామం కలిగించినట్లవుతుందని, నిపుణులు భావించి వీటిని ఆటవిడుపుగా నిర్వహించాలని పేర్కొంది.

మరిన్ని వార్తలు