ఆ రైతుల పుట్టినతేదీ.. జూలై ఒకటి

30 May, 2018 02:46 IST|Sakshi

రైతు బీమాపై రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయాలు

పథకానికి ‘రైతు బంధు గ్రూప్‌ బీమా’గా నామకరణం

ఆధార్‌ తప్పనిసరి.. అందులో పుట్టినతేదీ లేకుంటే.. జూలై 1గా పరిగణన

ప్రతి నెలా నూతన పాస్‌ పుస్తకాలు పొందే రైతులతో జాబితా

సాక్షి, హైదరాబాద్‌: రైతు బీమాకు సంబంధించి పుట్టినతేదీని పేర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో.. ఆధార్‌కార్డులో పుట్టినతేదీ లేని రైతులందరికీ ప్రభుత్వమే ఒక తేదీని నిర్ధారించింది. ఆధార్‌కార్డులో పుట్టిన సంవత్సరం తప్ప తేదీ నమోదు కాకుంటే.. ఆ రైతులందరికీ ‘జూలై 1వ తేదీ’ని పుట్టినతేదీగా పరిగణించేలా నిర్ణయం తీసుకున్నట్టు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. చదువుకోకపోవడం, పలు ఇతర కారణాలతో పెద్ద సంఖ్యలో రైతుల ఆధార్‌ కార్డుల్లో పుట్టినతేదీ నమోదు కాలేదు. కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే నమోదైంది. అయితే పుట్టినతేదీ నమోదుకాని రైతులు ఎంతమంది ఉంటారన్న దానిపై స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు. ఇక రైతు బీమా కోసం ఆధార్‌ నంబర్‌ నమోదును తప్పనిసరి చేశారు. దీనివల్ల ఒకటికి మించి పట్టాదారు పాస్‌ పుస్తకాలున్న రైతుల విషయంలో క్రమబద్ధీకరణ చేయడానికి వీలవుతుందని చెబుతున్నారు.

‘రైతు బంధు గ్రూప్‌ బీమా’ పథకం
రైతు బీమాకు ‘తెలంగాణ రాష్ట్ర గ్రూప్‌ రైతుబంధు బీమా పథకం’గా నామకరణం చేశారు. రైతులకు పెట్టుబడి సొమ్ము ఇచ్చే పథకానికి ‘రైతుబంధు’గా పేరు పెట్టిన విషయం తెలిసిందే. అదే పేరును బీమా పథకానికి కూడా పెట్టడం గమనార్హం. ఈ పథకాన్ని కేవలం పట్టాదారు పాస్‌ పుస్తకాలున్న రైతులకే వర్తింపజేస్తారు. పథకానికి నోడల్‌ ఏజెన్సీగా వ్యవసాయశాఖ వ్యవహరిస్తుంది. వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల నుంచి నామినీ నమోదు పత్రాలను సేకరిస్తారు. బీమా ధ్రువపత్రాలను ఆగస్టు 15 నుంచి రైతులకు అందజేయనున్నారు.

ఆగస్టు 15 నుంచి బీమా..
ఏటా ఆగస్టు 15 నుంచి తదుపరి ఏడాది ఆగస్టు 14వ తేదీ వరకు బీమా కాలంగా పరిగణిస్తారు. బీమా ప్రీమియాన్ని ఏటా సవరిస్తారు. ఎవరైనా రైతు చనిపోతే.. పది రోజుల్లోగా వారి నామినీలకు ఆన్‌లైన్‌ పద్ధతిన సొమ్ము అందుతుంది. ఇక ఇప్పటివరకు భూములు లేకుండా.. కొత్తగా భూములు కొనుగోలు చేసి, పాస్‌ పుస్తకం పొందిన రైతుల పేర్లతో ప్రతీ నెల జాబితా తయారుచేస్తారు. పథకానికి నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న వ్యవసాయ శాఖ ఆ జాబితాలను ఎల్‌ఐసీకి అందజేస్తుంది. ప్రభుత్వం ఇలా అదనంగా చేరే రైతులకు సంబంధించి బీమా ప్రీమియాన్ని ప్రతి మూడు నెలలకోసారి ఎల్‌ఐసీకి చెల్లిస్తుంది. ప్రీమియం సొమ్మును వ్యవసాయశాఖ కమిషనర్‌ ద్వారా ఏటా ఆగస్టు ఒకటో తేదీలోపు ఎల్‌ఐసీకి చెల్లించాల్సి ఉంటుంది. తొలి ఏడాదికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రూ.500 కోట్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై వ్యవసాయ శాఖ అధికారులకు అవసరమైన సమాచారాన్ని, శిక్షణను ఎల్‌ఐసీ ఇస్తుంది. ఇక బీమా నమూనా ధ్రువీకరణ పత్రాలను ఎల్‌ఐసీ వర్గాలు వ్యవసాయశాఖకు అందజేశాయి.

ఆత్మహత్య చేసుకున్న రైతులకూ ఇదేనా?
రైతులు ఏ కారణంతో చనిపోయినా.. వారి కుటుంబాలకు బీమా పరిహారం అందుతుందని ప్రభుత్వం చెబుతోంది. అంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటే కూడా వర్తిస్తుందన్న అర్థం వస్తుందని అధికారవర్గాలు అంటున్నాయి. కానీ బీమా నిబంధనల ప్రకారం ఆత్మహత్యకు పాల్పడితే.. బీమా పరిహారం ఇవ్వరు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకునే రైతులకు సంబంధించి ఎలా పరిహారం చెల్లిస్తారనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతా లేదు. ఒకవేళ రైతులెవరైనా ఆత్మహత్య చేసుకుంటే... కొత్త రైతు బీమా పథకం కింద పరిహారం ఇస్తారా, లేక పాత విధానంలా ప్రభుత్వమే పరిహారం ఇస్తుందా? అన్నది తేలలేదు. ఒకసారి ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించాక.. రైతు ఎలా చనిపోయాడో నిర్ధారణ చేయాల్సిన బాధ్యత సర్కారుకు ఉండదు. అది ఎల్‌ఐసీకి, రైతు కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అవుతుంది. అయితే ఒకవేళ ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకున్నా.. సాధారణ మరణంగానే ధ్రువీకరణ ఇచ్చి బీమా పరిహారం చెల్లించే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ ఇది అత్యంత సున్నితమైన అంశం కావడంతో అధికారులెవరూ బహిరంగంగా వ్యాఖ్యానించడానికి సిద్ధంగా లేరు. 

రైతు బీమా కింద అందజేసే ధ్రువపత్రం నమూనా   

మరిన్ని వార్తలు