ఐరాస సింపోజియంలో ‘రైతుబంధు’కు ప్రశంసల జల్లు 

22 Nov, 2018 02:29 IST|Sakshi
రోమ్‌లో ఏర్పాటైన అంతర్జాతీయ వినూత్న ఆవిష్కరణ ప్రదర్శనలో తెలంగాణ రైతుబంధు పథకం పోస్టర్‌

అభినందించిన ఐరాస ఎఫ్‌ఏవో డైరెక్టర్‌ జనరల్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఐక్యరాజ్యసమితి (ఐరాస) సమావేశంలో అంతర్జాతీయ ప్రముఖులు రైతుబంధు, రైతుబీమాలకు ప్రశంసల జల్లు కురిపించారు. రోమ్‌లోని ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) ప్రధాన కార్యాలయంలో బుధవారం ‘రైతు కుటుంబాల కోసం వ్యవసాయంలో వినూత్న ఆవిష్కరణలు’అనే అంశంపై అంతర్జాతీయ సింపోజియం ప్రారంభమైంది. ఈ సింపోజియానికి ప్రపంచవ్యాప్తంగా 650 మంది ప్రముఖులు, ఆయా దేశాల ప్రభుత్వాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ప్రత్యేకంగా వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ కేశవులు హాజరయ్యారు. ఈ సింపోజియాన్ని ఐరాస ఎఫ్‌ఏవో డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జోస్‌ గ్రాజినో డసిల్వా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమాలను ఎంతో వినూత్నంగా చేపట్టి రైతులను ఆదుకుంటున్నందుకు నేను చాలా ముగ్ధుడిని అయ్యాన’నని పేర్కొన్నారు. అదే సింపోజియంలో పాల్గొన్న ఐరాస ఆర్థిక, సామాజిక మండలి అధ్యక్షుడు ఇంగ రోండా, ఐరాసకు చెందిన వ్యవసాయాభివృద్ధి కోసం అంతర్జాతీయ నిధి ఉపాధ్యక్షుడు పాల్‌ వింటర్స్‌ సహా హాజరైన ప్రతినిధులు ఈ పథకాలపై హర్షాతిరేకం వ్యక్తంచేశారు. ‘వ్యవసాయంలో వినూత్న ఆవిష్కరణల’పై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించిన ఐరాస ఎఫ్‌ఏవో డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మారియా హెలినా సామిడో మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమాలను ప్రశంసించారు. ప్రపంచ వ్యాప్తంగా 700 వినూత్న పథకాల వివరాలు ఐరాసకు చేరాయని, వాటిలో 20ని తాము ఎంపిక చేశామన్నారు. ఈ సందర్భంగా పార్థసారధి ఐరాస ఎఫ్‌ఏవో డైరెక్టర్‌ జనరల్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రైతుబంధు, రైతుబీమాల గురించి వివరించారు.  

మరిన్ని వార్తలు