విశ్వవిద్యాలయాలకు పూర్వ వైభవం

14 Jan, 2015 02:10 IST|Sakshi
విశ్వవిద్యాలయాలకు పూర్వ వైభవం

ఖాళీల భర్తీకి తెలంగాణ సర్కారు కసరత్తు
యూనివ ర్సిటీల వారీగా వివరాల సేకరణ
వచ్చే విద్యా సంవత్సరం నాటికి భర్తీ చేయాలన్న యూజీసీ
వర్సిటీలను బలోపేతం చేస్తాం.. వీసీలను నియమిస్తాం: జగదీశ్‌రెడ్డి


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు మళ్లీ పూర్వవైభవం రానుంది. బోధన, బోధనేతర సిబ్బంది కొరతతో కునారిల్లుతున్న యూనివర్సిటీలను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరాదరణకు గురైన విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసే దిశగా కసరత్తు ప్రారంభించింది. సివిల్స్ విద్యార్థులకు ఉపయోగపడేలా ఇప్పటికే డిగ్రీ సిలబస్‌లో మార్పులు చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టగా.. సిబ్బందిని నియమిం చడం ద్వారా యూనివర్సిటీలను బలోపేతం చేయాలని సర్కారు యోచిస్తోంది. మరోవైపు అన్ని వర్సిటీలకు పూర్తిస్థాయి వైస్ చాన్స్‌లర్లను(వీసీ) నియమించేందుకు కూడా చర్యలు చేపడుతోంది. ఈ నెలాఖరుకల్లా వీసీల నియామక ప్రక్రియను చేపట్టాలని తొలుత భావించినా.. వచ్చే నెలలో అన్ని వర్సిటీలకు వీసీలను నియమించాలని విద్యా మంత్రి జగదీశ్‌రెడ్డి నిర్ణయించారు. మరోవైపు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అన్ని విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలనూ భర్తీ చేయాలని ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్సిటీల వారీగా ఖాళీల వివరాలను సేకరించి వాటి భర్తీకి చర్యలు చేపడతామని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.

విశ్వవిద్యాలయాలంటేనే చిన్నచూపు..

విద్యా రంగంలో పరిశోధనలకు ప్రాధాన్యం పెంచేందుకు, ఉన్నత విద్యను విస్తరింపజేసేందుకు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008 నుంచి 2009 మధ్య కాలంలో జిల్లాకో విశ్వవిద్యాలయం ఉండేలా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారు. అయితే ఆయన మరణానంతరం విశ్వవిద్యాలయాలను పట్టించుకున్న నాథుడే లేడు. గడిచిన ఐదేళ్లలో విశ్వవిద్యాలయాలను గాలికి వదిలేశారు. దీంతో ప్రతి యూనివర్సిటీలో అరకొర సిబ్బందే మిగిలారు. రిటైర్ అయిన వారి స్థానంలో కొత్తవారిని నియమించలేదు. తెలంగాణలోనూ ఇదే దుస్థితి నెలకొంది. తెలంగాణలోని ఏడు రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాలకు 2,202 మంజూరైన పోస్టులు ఉంటే.. ప్రస్తుతం వాటిల్లో 1,122 మంది మాత్రమే బోధన సిబ్బంది ఉన్నారు. కొత్త పోస్టులను అసలు మంజూరే చేయలేదు. పాలమూరు విశ్వవిద్యాలయం ప్రారంభంలో ఇచ్చిన 28 పోస్టులను కూడా పూర్తిగా భర్తీ చేయలేదు. కేవలం ఎనిమిది మంది పూర్తిస్థాయి అధ్యాపకులతో వర్సిటీని నడపాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు వర్సిటీల్లో పనిచేస్తున్న సగం మందికి, రిటైర్ అయిన వారికి అవసరమైన వేతనాల బడ్జెట్‌లోనూ కోతలు విధించారు. రాష్ట్ర విభజన తర్వాత బడ్జెట్‌లో పాత విధానంలో కేటాయింపులు చేసినా, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అదనంగా నిధులను మంజూరు చేసింది. బోధన సిబ్బంది నియామకం ద్వారా వర్సిటీలను బలోపేతం చే సేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

బోధనేతర సిబ్బందీ అరకొరే..

అన్ని యూనివర్సిటీల్లో బోధన సిబ్బందే కాదు.. బోధనేతర సిబ్బంది కూడా అరకొరగానే ఉన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో 44 బోధనేతర సిబ్బంది పోస్టులు మంజూరైనవి ఉంటే 21 మందే పని చేస్తున్నారు. ఉస్మానియాలో 1,175 వరకు మంజూరైన పోస్టులుంటే 400 మంది పని చేస్తున్నారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో 14 మందికిగాను నలుగురే పని చేస్తున్నారు. మిగతా వర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
 
 

మరిన్ని వార్తలు