అబార్షన్ల అడ్డా.. ఖలీల్‌వాడి!

10 Jun, 2019 10:36 IST|Sakshi

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడి అబార్షన్లకు అడ్డాగా మారింది! ప్రైవేట్‌ వైద్యుల కాసుల కక్కుర్తి యువతుల ప్రాణాల మీదకు తెస్తోంది. కనీస నిబంధనలు పాటించకుండా అబార్షన్లు చేస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఖలీల్‌వాడిలోని వివిధ ఆస్పత్రుల్లో రోజూ పది వరకు అబార్షన్లు చేస్తున్నారు. కానీ, ఎక్కడా ఎలాంటి నిబంధనలు పాటించరు. ఎవరు, ఎందుకు ఆస్పత్రికి వచ్చారో, వారికి ఏ చికిత్స చేశారో కూడా రికార్డులు నిర్వహించరు. ప్రైవేట్‌ ఆస్పత్రులపై వైద్యశాఖ పరిశీలన లేకపోవడంతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. సాధారణ చికిత్సలే కాదు, అబార్షన్ల పేరిట విచ్చలవిడిగా దండుకుంటున్నారు.

కాసుల కక్కుర్తి.. 
ఖలీల్‌వాడిలో సుమారు 40 వరకు ప్రసవ ఆసుపత్రులు ఉన్నాయి. ఇందులో కొన్ని ఆస్పత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా, విచ్చలవిడిగా అబార్షన్లు చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ పరిశీలన లేకపోవడంతో ఈ తతంగం యథేచ్ఛగా కొనసాగుతోంది. గతంలో ఆర్మూర్‌ డివిజన్‌కు చెందిన ఓ యువతికి అబార్షన్‌ చేయగా అది వికటించి మృతి చెందింది. ఇలాంటి ఘటనలు రెండు, మూడు వెలుగు చూసినా అధికారులు పెద్దగా స్పందించలేదు. దీంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు డబ్బుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 

మోసపోయి.. 
ప్రేమ పేరుతోనో, మరే కారణంతోనో వలలో పడి చాలా మంది అమాయక యువతులు మోసపోతున్నారు. ఎదుటి వారిని పూర్తిగా సర్వస్వం అప్పగించేస్తున్నారు. ఈ క్రమంలో గర్భం దాల్చుతున్నారు. మరోవైపు, భర్తకు దూరంగా ఉన్న మహిళలు, అలాగే, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న వారు అవాంఛిత గర్భం దాల్చుతున్నారు. అక్రమ సంబంధాలతో పాటు ప్రేమ పేరుతో మోసానికి గురైన వారు అబార్షన్ల కోసం ఎక్కువగా వస్తున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే చోటు చేసుకుంటున్నాయి. అక్కడి మహిళలు, యువతులు పెద్దగా చదువుకోక పోవడం, అలాగే, ఆధునిక గర్భనిరోధక పద్ధతులు తెలియక పోవడంతో ఈజీగా మోసపోతున్నారు. 

జిల్లా కేంద్రంలోనే ఎక్కువగా.. 
అవాంఛిత గర్భం దాల్చిన యువతులు, మహిళలు తొలుత ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వారు కమీషన్లకు కక్కుర్తి పడి మాయమాటలు చెప్పి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకు తీసుకొస్తున్నారు. ఇలా వచ్చిన యువతులకు కనీస నిబంధనలు, ప్రమాణాలు పాటించకుండా ఇష్టమొచ్చినట్లు అబార్షన్లు చేస్తున్నారు. అవి వికటించి ప్రాణాల మీదకు వస్తున్నాయి.

కేసులు తగ్గడంతో.. 
ప్రభుత్వం సర్కారు ఆస్పత్రులను బలోపేతం చేయడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే వారికి పలు ప్రయోజనాలు కల్పిస్తుండడంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య బాగా పడిపోయింది. ఈ నేపథ్యంలో కొందరు ప్రైవేట్‌ డాక్టర్లు అబార్షన్లను ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. ఎంత రిస్క్‌ కేసు అయినా సరే అబార్షన్లు చేసేస్తున్నారు. యువతుల బలహీనతలను ఆధారంగా చేసుకొని ఒక్కో అబార్షన్‌కు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకుంటున్నట్లు తెలిసింది.

పట్టించుకోని వైద్యారోగ్య శాఖ 
ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నా, అనవసరమైన పరీక్షలు, చికిత్సల పేరుతో దండుకుంటున్నా వైద్యారోగ్య శాఖ స్పందించడం లేదు. ఇక గుట్టుచప్పుడు కాకుండా సాగే అబార్షన్ల విషయంలో అసలే మాత్రం పట్టించుకోవడం లేదు. అబార్షన్లకు సంబంధించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు వచ్చినా వాటిపై వైద్యారోగ్యశాఖ విచారణ చేపట్టలేదు. ముఖ్యంగా ఖలీల్‌వాడిలోని ఓ ఆస్పత్రి, అలాగే, పక్కనే గల సరస్వతినగర్‌లో రెండు ఆస్పత్రులు, ప్రధాన రోడ్డుకు ఉన్న మరో ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఎక్కువగా అబార్షన్లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రిలో వారం వ్యవధిలో 15 వరకు అబార్షన్‌ కేసులు నమోదవుతున్నా పెద్దగా స్పందించిందీ లేదు. వాస్తవానికి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తరచూ తనిఖీలు నిర్వహించాల్సిన వైద్యారోగ్య శాఖ అధికారులు ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాల్లేవు. పైగా కనీసం పరిశీలన కూడా చేయకుండా ఎంతో కొంత తీసుకుంటూ ఆస్పత్రులకు అనుమతులు ఇచ్చేస్తున్నారు.


‘మచ్చ’తునకలెన్నో.. 

  • గతంలో ఆర్మూర్‌ డివిజన్‌కు చెందిన ఓ యువతికి అబార్షన్‌ చేయగా, అది వికటించి ఆమె మృతి చెందింది.  
  • నిర్మల్‌కు చెందిన మరో మహిళకు సరస్వతినగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి నిర్వాహకులు అబార్షన్‌ చేశారు. అది వికటించి ఆమె ప్రాణాల మీదకు వచ్చింది.  
  • డిచ్‌పల్లి మండలానికి చెందిన మరో మహిళ ఆస్పత్రికి రాగా, అబార్షన్‌ చేసేశారు. దీంతో బాధితురాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది.

కఠిన చర్యలు తీసుకుంటాం..
నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అబార్షన్లు చేపడితే కఠిన చర్యలు చేపడుతాం. ఆస్పత్రులు నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. త్వరలోనే ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. లోపాలు ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. – సుదర్శనం, డీఎంహెచ్‌వో  

మరిన్ని వార్తలు