‘గుండె’లు తీసిన బంట్లు

13 Feb, 2018 03:22 IST|Sakshi

గుండె ఆపరేషన్లలో కార్పొరేట్‌ ఆసుపత్రుల ఇష్టారాజ్యం

అవసరం లేకపోయినా స్టెంట్లు, ఆపరేషన్లు

ప్రతి సంవత్సరం 17 వేల ఆపరేషన్లు

కాసుల కోసం రోగుల జీవితాలతో ఆటలు

‘ఆరోగ్యశ్రీ’ని ఆదాయ వనరుగా చూస్తున్న వైనం.. కళ్లు మూసుకున్న ట్రస్టు అధికారులు

సాక్షి, హైదరాబాద్‌
కూకట్‌పల్లికి చెందిన అనిల్‌కుమార్‌కు బీపీ, షుగర్‌ సహా ఏ అనారోగ్య సమస్యా లేదు. ఓ రోజు కడుపునొప్పి రావడంతో దారిలోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యుడు ఓసారి కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లమన్నాడు. కార్పొరేట్‌లో ఏవేవో పరీక్షలు చేసి గుండె సమస్య ఉందని, వెంటనే స్టెంట్‌ వేయాలని చెప్పారు. అనిల్‌ అందుకు అంగీకరించడంతో మరుసటి రోజే ‘ఆరోగ్యశ్రీ’కింద స్టెంట్‌ వేసేశారు. నిజానికి అనిల్‌కు ఆ స్టెంట్‌ వేయాల్సిన అవసరం లేదు!

వరంగల్‌కు చెందిన ఓ రైతు గుండెలో నొప్పి రావడంతో హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రికి వచ్చాడు. ఆయనకు అందించాల్సిన వైద్య వివరాలను సదరు ఆసుపత్రి ఆన్‌లైన్‌లో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు పంపింది. రోగి గుండెకు స్టెంట్‌ వేయాలని ప్రతిపాదించాయి. ఈ వివరాలను ఆరోగ్యశ్రీలోని ఓ వైద్య నిపుణుడు పరిశీలించి.. స్టెంట్‌ అవసరం ఉండదు కదా అని ప్రశ్నించారు. ఆస్పత్రి వారు అందుకు బదులిస్తూ..
‘‘ఇప్పుడు అవసరం లేదుగానీ త్వరలో అవసరం ఉండవచ్చు. అయినా ఉన్నతాధికారులు చెప్పాలి గానీ.. ధ్రువీకరించాల్సింది నువ్వు కాదు’’అంటూ దబాయించారు. మరుసటి రోజు ఆస్పత్రి ప్రతిపాదించిన ఆపరేషన్‌కు అనుమతి వచ్చేసింది!

...ఇలా ఒకటీ రెండు కాదు.. ఆరోగ్యశ్రీ కింద జరుగుతున్న గుండె ఆపరేషన్లలో కార్పొరేట్‌ ఆస్పత్రుల అక్రమాలకు లెక్కేలేదు. స్టెంట్‌లు, బైపాస్‌ సర్జరీల వంటి ఖరీదైన శస్త్ర చికిత్సల నిర్వహణ అడ్డగోలుగా మారింది. గుండె ఆపరేషన్లపై ఆరోగ్యశ్రీ ట్రస్టు కింది స్థాయి సిబ్బంది ఈ లోపాలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించినా ఫలితం ఉండడం లేదు. లోపాలను సరిచేయకపోవడంతో.. ఆరోగ్యశ్రీ పథకంలో అక్రమాలు పరాకాష్టకు చేరుతున్నాయి. పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఇలా ప్రైవేటు ఆస్పత్రులకు వరంగా మారుతోంది. ప్రజల ఆరోగ్యం ఏమైనా సరే.. తమకు కాసులు వస్తే చాలన్నట్టు ఆసుపత్రులు వ్యవహరిస్తున్నాయి. అవసరం లేకున్నా ఖరీదైన శస్త్ర చికిత్సలు చేస్తూ.. కోట్లు దండుకుంటున్నాయి. నిరంతర పర్యవేక్షణతో అక్రమాలను నిరోధించాల్సిన ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు.

గుండె ఆపరేషన్లే ఎక్కువ..
ఆరోగ్యశ్రీలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి. స్టెంట్ల అమర్చడం, బైపాస్‌ సర్జరీలు కలిపి ఏటా సగటున 17 వేల ఆపరేషన్లు అవుతున్నాయి. ఇందులో స్టెంట్ల కేసులు 15 వేలు, బైపాస్‌ శస్త్ర చికిత్సలు 2 వేల దాకా ఉంటున్నాయి. ఒక్కో బైపాస్‌ ఆపరేషన్‌కు సగటున రూ.1.14 లక్షలు, స్టెంట్‌కు రూ.54 వేల చొప్పున ఆరోగ్యశ్రీ ట్రస్టు చెల్లిస్తోంది. ఎక్కువ డబ్బులు వచ్చే శస్త్ర చికిత్సలు కావడంతో ప్రైవేటు ఆస్పత్రులు వీటిని లాభదాయక వ్యవహారంగా మార్చేశాయి. గుండెకు సంబంధించిన వ్యాధులు కావడంతో ప్రజల్లోనూ ఎక్కువ ఆందోళన ఉంటోంది. దీన్ని అదనుగా చేసుకొని ప్రైవేటు ఆస్పత్రులు చెలరేగిపోతున్నాయి. అవసరం లేకపోయినా స్టెంట్లు అమర్చడం, నేరుగా బైపాస్‌ శస్త్రచికిత్స చేయాల్సిన సందర్భాల్లో.. ముందుగా స్టెంటు వేయడం వంటివి చేస్తున్నాయి. ఒక స్టెంట్‌ వేశాక ఆరు నెలల్లోపే మళ్లీ రెండో స్టెంట్‌ వేయాలని రోగులను హెచ్చరిస్తున్నాయి. ఇలా రెండు రకాలా డబ్బులు ఆర్జించిన తర్వాత అదే రోగికి బైపాస్‌ చేయాలని చెబుతున్నాయి.

పెరిగిపోతున్న  ‘రెండో స్టెంట్‌’
సాధారణంగా రోగులకు గుండె పనితీరు నిర్ధారణ పరీక్షలు (యాంజియోగ్రామ్‌) నిర్వహిస్తే వారిలో 60 మందిలో ఒక్కరికి మాత్రమే ఒక స్టెంట్‌ అవసరం ఉంటుందని, ఇక రెండో స్టెంట్‌ అవసరం ఇంకా తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యశ్రీ పరీక్షల్లో మాత్రం రెండో స్టెంట్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. గతేడాది రెండో స్టెంట్‌ వేసుకున్న వారి సంఖ్య ఏకంగా 50.80 శాతం వరకు నమోదైంది. అవసరం లేకున్నా రెండో స్టెంట్‌ అమర్చడంతో ఆరోగ్యశ్రీలో ఏటా అదనంగా రూ.50 కోట్ల వరకు వృథా అవుతున్నట్లు అంతర్గత విచారణలో నిర్ధారించారు. అయినా చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యశ్రీలోని వైద్య నిపుణుల సహకారంతోనే ఈ అక్రమ, అనవసర శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ గుర్తించిన కొన్ని లోపాలివీ
గుండె శస్త్ర చికిత్సలలో ఎక్కువగా అవసరం లేనివే ఉంటున్నాయి. గుండె పని చేసేందుకు ఉపయోగపడే స్టెంట్‌ అమర్చాలంటే రక్తనాళాల్లో 70 శాతం కంటే ఎక్కువగా పూడిక ఉండాలి. కానీ 30 శాతం పూడిక ఉన్నా స్టెంట్‌ వేస్తున్నారు
అవసరం లేకున్నా రెండో స్టెంట్‌ వేస్తున్నారు
బైపాస్‌ సర్జరీ రోగుల్లో గుండెకు రక్తాన్ని పంపింగ్‌ చేసే సామర్థ్యం 70 శాతం వరకు ఉంటుంది. ఇది 40 శాతం కంటే తగ్గిపోయినప్పుడే ఐఏబీపీ చికిత్సను ఉపయోగిస్తారు. కానీ ప్రైవేటు ఆస్పత్రులు, ముఖ్యంగా కార్పొరేట్‌ ఆస్పత్రులు ప్రతి ఒక్కరికీ ఐఏబీపీ రకం చికిత్సనే చేస్తున్నాయి. 98 శాతం బైపాస్‌ సర్జరీల్లో ఐఏబీపీని ఉపయోగించినట్లు తేలింది.

బీమా కంపెనీల  ఆందోళన
అడ్డగోలుగా గుండె ఆపరేషన్లపై బీమా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘‘ఆస్పత్రికి వచ్చే రోగికి వైద్య బీమా ఉందా అని వైద్యుల నుంచి వచ్చే మొదటి ప్రశ్న. ఉంది అని అనడమే ఆలస్యం అన్ని టెస్టులు చేయాలంటూ ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకుంటున్నారు. అన్ని రకాల పరీక్షలు చేశామని, గుండె సమస్య ఉందని చెబుతారు. ఇప్పుడైతే స్టెంట్‌తో సరిపోతుందని, నిర్లక్ష్యం చేస్తే బైపాస్‌ చేయాల్సి రావచ్చని భయపెడతారు. సదరు వ్యక్తి స్టెంట్‌ వేయడానికి ఒప్పుకొని అంగీకార పత్రం రాస్తాడు. వెంటనే స్టెంట్‌ అమరుస్తారు. ఒక నెలలో అసాధారణంగా ఈ తరహా కేసులు మా దృష్టికి రావడంతో మేం వాటిని పరిశీలించాం. పరీక్షల నివేదికలు తెప్పించుకున్నాం. అన్ని పరిశీలిస్తే మేం పరిశీలించిన పది కేసుల్లో నాలుగు కేసుల్లో అసలు ఎలాంటి హృద్రోగ సమస్యలే లేవు. ఇద్దరికీ సమస్య ఉన్నా మందులతో నయమయ్యే స్టేజీలోనే ఉంది’’అని ఓ బీమా కంపెనీ ప్రతినిధి అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు