చీ‘కట్’లు

27 May, 2014 01:33 IST|Sakshi

 ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో చీకట్లు కమ్ముకున్నాయి. పల్లె, పట్టణవాసులు అంధకారంలో మగ్గుతున్నారు. వేళాపాళాలేకుండా కరెంటు కోత లు విధించడంతో ప్రజలు అవస్థలపాలవుతున్నారు. దీనికితోడు పగలు భానుడు తన ప్రతాపం చూపడం.. సాయంత్రం వేళలో
 వరణుడు చిరుజల్లులు కురిపించడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక పీఆర్‌సీ అమలు కోసం విద్యుత్ ఉద్యోగులు తలపెట్టిన మెరుపు సమ్మె నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతోనే ఈ పరిస్థితి ఉందని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. జిల్లాకు రోజు విద్యుత్ కోటా 5.16 మిలియన్ యూనిట్లు కాగా సరాసరిన అంతే వినియోగం జరుగుతుంది.

 సమ్మె నేపథ్యంలో కొన్ని గ్రిడ్‌లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో ఈ పరిస్థితి ఎదురవుతున్నాట్లు అధికారులు పేర్కొంటున్నారు. రాత్రి సమయంలో కరెంట్ తీసేస్తుండటంతో జనా లు ఇబ్బంది పెడుతున్నారు. ఉక్కపోత భరించలేక ఆరుబయటకు రా వాల్సి వస్తుంది. ఉద్యోగుల మూల వేతనంలో 27.50 శాతం పెంపుదలకు ప్రభుత్వం అంగికరించినా మూడు ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి యా జమాన్యం ఒప్పుకోకపోవడంతో ఉద్యోగులు సమ్మెబాట పట్టారు.

అయితే జిల్లాలో మాత్రం ఉద్యోగులు ఎవరు సమ్మెలో పాల్గొనడం లేదని ఉన్నత అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీల పైబడి నమోదవుతుంది. మిట్టమధ్యాహ్నం ఇంట్లో ఏసీ, కూలర్‌లతో చల్లదనం పొందాలనుకుంటున్న జనాలకు కోతలు ఇబ్బంది పెడుతున్నాయి. గ్రామాల్లో కోతల తీవ్రత బాగా ఉంది. మధ్యాహ్నం కరెంట్ జాడ లేకపోగా ఇప్పుడు రాత్రి వేళల్లోనూ వాతలు పెడుతుండటంతో జనాలకు ఆరుబయటే దిక్కవుతుంది. ఇంటర్ సంప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతుండగా రాత్రి వేళ చదువుకుంటామనుకుంటున్న విద్యార్థులకు ఆటంకం అవుతుంది. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కూడా అవస్థలు పడుతున్నారు.

మరిన్ని వార్తలు