-

మబ్బే.. ముసురేసిందిలే..

28 Jan, 2019 01:47 IST|Sakshi
భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురంలో మిరప కుప్పల పరదాలపై నిలిచిన నీటిని ఎత్తిపోస్తున్న రైతులు

రాష్ట్రంలో అకాల వర్షాలు

సాక్షి, హైదరాబాద్‌: రోజంతా మబ్బు.. ఉదయమే చీకటైనట్లు.. రోజంతా సన్నగా వర్షం.. ఆకాశానికి లీకేజీ పడ్డట్లు.. రెండ్రోజులుగా రాష్ట్రంలో వర్షాలు.. వాటికి చలిగాలులు తోడవడంతో జనం గజగజలాడుతున్నారు. అటు ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం, హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి.. ఇటు తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం.. దీంతో ఈ ఆవర్తనం నుంచి ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక వరకు తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి బలహీన పడింది.  వీటి ప్రభావాల కారణంగా తెలంగాణలో రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట జిల్లా నంగనూరులో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్‌లో పలుచోట్ల 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లోనూ 3 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది.  హైదరాబాద్‌లో శనివారం సాయం త్రం నుంచి మొదలైన చిరు జల్లులు ఆదివారం కూడా కొనసాగాయి. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. 

పగలు తగ్గి.. రాత్రి పెరిగి.. 
రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పడిపోగా, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంచెం ఎక్కువగా నమోదయ్యాయి. ఖమ్మంలో రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా 24 డిగ్రీలు నమోదైంది. అక్కడే పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీలు తగ్గి 28 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా 18 డిగ్రీలు నమోదు కాగా, పగటి ఉష్ణోగ్రత 3 డిగ్రీలు తక్కువగా 27 డిగ్రీలు రికార్డయింది. రామగుండంలో పగటి ఉష్ణోగ్రత 9 డిగ్రీలు తక్కువగా 22 డిగ్రీలు నమోదైంది. అక్కడ రాత్రి ఉష్ణోగ్రత 2 డిగ్రీలు ఎక్కువగా 18 డిగ్రీలు నమోదైంది. నిజామాబాద్‌లోనూ పగటి ఉష్ణోగ్రత 8 డిగ్రీలు తక్కువగా 24 డిగ్రీలు నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రత 2 డిగ్రీలు ఎక్కువగా 18 డిగ్రీలు నమోదైంది. 

రబీ పంటలకు ఊతం.. 
ఈ వర్షాలకు రబీ పంటలతో మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ పేర్కొంది. వరి, మొక్కజొన్న, వేరుశనగ వంటి పంటలకు ప్రయోజనం ఉం టుందని ఆ శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌ తెలి పారు. భూగర్భ జలాలు పెరిగి వరికి మరింత ఊతమిస్తుందని విశ్లేషించారు. రబీ సీజన్‌లో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 20.26 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు చేశారు. అందులో ఆహార పంటలు ఇప్పటివరకు 16.08 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 10.2 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. మొక్కజొన్న 2.47 లక్షల ఎకరాల్లో సాగైంది. వేరుశనగ ఇప్పటివరకు 2.61 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇప్పటివరకు రబీ సీజన్‌లో సాగు కాని చోట్ల ప్రస్తుత వర్షాలతో పుంజు కుంటుందని అధికారులు అంటున్నారు. 

తడిసిన ధాన్యం, మిర్చి.. 
రబీధాన్యం, మిర్చి పంటలు కొన్నిచోట్ల మార్కెట్లోకి వచ్చాయి. ముందు జాగ్రత్తలు తీసుకోని చోట్ల అక్కడక్కడ వరి, మిర్చి పంటలు తడిసిపోయాయని మార్కెటింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎంతమేరకు తడిసిందో ఇంకా సమాచారం రాలేదని అంటున్నారు. కొందరు రైతులు మార్కెట్లోనే ఉంచి పోవడంతో తడిసి ఉంటుందని పేర్కొంటున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చాలా ప్రాంతాల్లో మిర్చిపంట దెబ్బతిన్నది. దుగ్గొండి, నర్సంపేట, పరకాల, దామెర, ఆత్మకూరు, భూపాలపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో మొత్తం ఆరు వేల ఎకరాల్లో చపాటా రకం మిరప పంట సాగుచేశారు. విదేశాలకు ఎగుమతి చేసే ఈ చపాటా రకం పంటకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో అక్కడక్కడా ఇటీవల వేసిన మొక్కజొన్న పంట నేల వాలిన ట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు. పెద్దపల్లి మం డలం రాఘవాపూర్‌లో 8 మంది పెంపకందారులకు చెందిన 96 గొర్రెలు వర్షానికి మృత్యువాత పడటంతో వారికి లక్షల్లో ఆర్థిక నష్టం జరిగింది.   

మరిన్ని వార్తలు