అమ్రాబాద్‌లో అధికంగా యురేనియం

5 Sep, 2019 10:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

యురేనియం...ఖనిజాల్లో కీలకం

స్వచ్ఛమైనది రూపొందించడం ఎంతో కష్టం

పలు దశల తర్వాత వినియోగం

సాక్షి, నాగార్జునసాగర్‌: కృష్ణానది తీర ప్రాంతం అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ అటవీ పరిధిలోని పలు ప్రాంతాల్లో యురేనియం ఖనిజం తవ్వకాలు జరపాలని, అపారమైన నిల్వలు వెలికితీసి  ఖర్మాగారాలను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రదేశమంతా  శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయతీరాలలోనే ఉండటంతో ఆయా ప్రాంతాలలోని నివాసితులంతా యురేనియం నిల్వలు వెలికి తీసేందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో యురేనియం ప్రాముఖ్యత ఏమిటి? దీన్ని ఎలా వెలికితీస్తారు? ఎలా శుద్ధి చేస్తారు అనే విషయాల గురించి  తెలుసుకుందాం.

ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే దాదాపు 92 మూలకాల్లో  యురేనియం ఒకటి. మొత్తం మూలకాల్లో దీని ద్వారా మాత్రమే అణువిద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చు. అస్థిరమైన అణు నిర్మాణం, రేడియో ధార్మికత లక్షణాలు దీనికి కారణం. దాంతో ప్రపంచ వ్యాప్తంగా అణు విద్యుత్‌ ఉత్పత్తిలో యురేనియం కీలక పాత్ర పోషిస్తుంది. నేల, నీరు మనిషితో పాటు అన్ని జంతువుల్లో అతి తక్కువ మోతాదులో యురేనియం ఉంటుంది. కానీ వీటి నుంచి వాణిజ్య స్థాయిలో యురేనియంను ఉత్పత్తి చేయలేం. అందువల్ల యురేనియం ఎక్కువగా ఉన్న ఖనిజాలను గుర్తించి వాటినుంచి  యురేనియంను వేరుచేసి ఉపయోగిస్తారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోని నల్లమల అడవులు గల ప్రాంతాల్లో ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ఇటువంటి ఖనిజాలు అభ్యమవుతున్నాయి. యురేనియం సాధారణంగా పిచ్‌బ్లెండ్, యురేనైట్‌ అనే  ఖనిజాల్లో ఎక్కువ శాతం ఉంటుంది. 

ఖనిజాల నుంచి ఎలా వేరు చేస్తారు?
ముడి ఖనిజాన్ని ముందు బాగా వేడి చేస్తారు. ఫలితంగా అందులో ఉన్న కర్భన, గంధక సంబంధ పదార్థాలు తొలిగిపోతాయి. తర్వాత ఆమ్ల, క్షార ద్రవాలతో ఖనిజాన్ని శుద్ధిచేస్తారు. దీనివల్ల యురేనియం మినహాయించి మిగిలిన మూలకాలు ఇతర రూపాల్లోకి  మారిపోతాయి. మిగిలిన ద్రవానికి సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నిషియం వంటి వాటిని కలుపుతారు. దీంతో యురేనియం ఉన్న పదార్థం అవక్షేపంగా మిగిలిపోతుంది. ఇది పసుపురంగులో ఉంటుంది. దీన్నే ఎల్లో కేక్‌ అంటారు. దీనిని మళ్లీ శుద్ధిచేసి అణువిద్యుత్‌ రియాక్టర్లలో ఉపయోగిస్తారు. ఎల్లో కెక్‌ నైట్రిక్‌ యాసిడ్‌తో కలిపి ఒక ద్రావణంగా తయారు చేస్తారు. ఈ ద్రావణానికి ట్రైబ్యూటైల్‌ ఫాస్పేట్, కిరోసిన్‌ లేదా తగిన హైడ్రోకార్బన్‌లను కలపడం ద్వారా యురేనియంను వేరు చేస్తారు. దీనికి ఆమ్లంతో కలిపిన నీటిని చేరుస్తారు. దీనివల్ల శుద్ధ యురేనైల్‌ నైట్రేట్‌ వేరవుతుంది. ఈ యురేనైల్‌ నైట్రేట్‌కు కొన్ని రసాయనాలను కలుపుతారు. అప్పుడు జరిగే రసాయన చర్య వల్ల యురేనియం ఫ్లోరైడ్‌  ఏర్పడుతుంది. దీని నుంచి ఫ్లోరైడ్‌ను వేరు చేస్తారు. అప్పుడు అణువిద్యుత్‌ రియాక్టర్లలో వాడే యురేనియం లోహం తయారవుతుంది. 

దీన్ని కనుగొన్నదెవరు ?
యురేనియంను జర్మనీ రసాయనిక శాస్త్రవేత్త మార్టిన్‌క్లాప్రోత్‌ 1798లో కనుగొన్నారు.  యురేనియం రేడియో ధార్మికత లక్షణాన్ని 1896లో హెన్రీ ఆంటోని బెక్యూరెల్‌ అనే శాస్త్రవేత్త తొలిసారి గుర్తించారు. శుద్ధి చేసిన యురేనియం వెండి రంగులో ఉంటుంది. యురేనియం సహజ సిద్ధంగా వెండికంటే దాదాపు 40 రెట్లు ఎక్కువగా లభిస్తుంది. యురేనియం అణువులను విడగొట్టడం ద్వారా శక్తిని రాబట్టవచ్చని 1938లో ఒట్టోహన్, ఫిట్జ్, స్ట్రాట్స్‌మన్‌  అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒక టన్ను యురేనియం ద్వారా దాదాపు నాలుగు కోట్ల కిలో వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఇది 16 వేల టన్నుల బొగ్గు, లేదా 8 వేల బ్యారెళ్ల ముడిచమురు ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తుకు సమా నం.

అణువిద్యుత్తు, అణ్వాస్త్రాల్లో కాకుండా రంగురంగుల అద్దాల తయారీలోనూ యురేనియంను ఉపయోగిస్తారు. చిన్నచిన్న అణురియాక్టర్లలో యురేనియం ఐసోటోపులను తయారు చేసి వైద్య, పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. 2001 నాటికి ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయిన యురేనియం 35,767 మెట్రిక్‌ టన్నులు. అణ్వాస్త్రాల్లో ఉపయోగించే ప్లూటోనియం కూడా యురేనియం ద్వారానే లభిస్తుంది. అణు రియాక్టర్లలో ఇంధనంగా  యురేనియంను వాడిన తర్వాత మిగిలే వ్యర్థ పదార్థాల్లో ఫ్లూటోనియం ఒకటి. ఇంత విలువ కలిగిన యురేనియం నిల్వలు జిల్లాలోని పెద్దవూర, పెద్దఅడిశర్లపల్లి, నేరడుగొమ్ము, చందంపేట మండలాలతో పాటు మహబూబ్‌నగర్‌ నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అపారమైన నిల్వలున్నాయి. సాగర్‌ తీరంలోగల పెద్దగట్టు, నంబాపూర్‌ తదితర ప్రాంతాల్లో 490 టన్నుల యురేనియం నిల్వలు లభించే అవకాశమున్నట్లుగా కేంద్ర అణుపరిశోధన సంస్థ గుర్తించింది.

రిజర్వాయర్‌ వెంట 1337.62 ఎకరాల విస్తీర్ణంలో  గనుల తవ్వకాలు జరపాల్సి ఉంటుంది. ఇందులో 1140.91 ఎకరాలు అటవీశాఖ ఆధీనంలో ఉండగా 196.70 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసి సేకరించాల్సి ఉంది.  2005లోనే యూసీఐల్‌ దాదాపుగా రూ.300 కోట్ల అంచనా వ్యయంతో యురేనియం ప్రాజెక్టు  పనులను నిర్వహించేందుకు నిర్ణయించింది. పెద్దగట్టు ప్రాంతాన్ని మూడు బ్లాకులుగా విభజించింది. పెద్దగట్టుప్రాంతంలో మొదటి, రెండవ బ్లాకుల్లో అండర్‌ గ్రౌండ్‌మైనింగ్‌ నిర్వహించేందుకు నిర్ణయించారు. అప్పట్లో పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలో  ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన విషయం తెలిసిందే.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా