‘యురేనియం’తో మానవ మనుగడకు ప్రమాదం

13 Sep, 2019 11:41 IST|Sakshi
మాట్లాడుతున్న సామాజిక ఉద్యమకారిణి సజయ

భూమి, నీరు, గాలి కలుషితమవుతుంది

తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి

సామాజిక ఉద్యమకారిణి సజయ

సాక్షి, షాద్‌నగర్‌: నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరిగితే వన్యప్రాణులతో పాటుగా మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉందని సామాజిక ఉద్యమకారిణి, సీనియర్‌ పాత్రికేయురాలు సజయ ఆందోళన వ్యక్తం చేశారు. నల్లమల్లలో యురేనియం తవ్వకాలను ఎందుకు వ్యతిరేకించాలనే అంశంపై పట్టణంలోని పెన్షనర్‌ భవనంలో గురువారం ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సజయ హాజరై మాట్లాడారు.

నల్లమల్లలో యురేనియం తవ్వకాలు జరిపితే ఎంతోమంది ఉపాధిని కోల్పోయి నిరాశ్రయులుగా మారతారన్నారు. కేంద్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు కృష్ణానది నీటిని వినియోగించడమే కాకుండా అడవిలో 4వేల బోర్లను తవ్వించేందుకు నిర్ణయించిందని తెలిపారు. దీంతో ఆ ప్రాంతం బోరు బావులు, కృష్ణానది ప్రాజెక్టులోని నీరు పూర్తిగా కలుషితమయంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. యురేనియాన్ని వెలికితీసే క్రమంలో నీటితో పాటుగా వాతావరణం కలుషితంగా మారుతుందన్నారు. నల్లమల్ల అడవుల చుట్టూ ఉన్న మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలతోపాటు కృష్ణానది నీటిని వినియోగించే ప్రాంతాలు యురేనియంతో ప్రత్యక్ష, పరోక్షంగా ప్రభావితమవుతాయని హెచ్చరించారు. యురేనియం వెలికితీసి అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని కేంద్రం చెబుతోందని తెలిపారు.

యురేనియం భూమిలో ఉన్నంత వరకు జీవకోటికి ఎలాంటి హాని లేదని, దానిని బయటకు తీసేటప్పుడు వెలువడే రేడియేషన్‌ వల్ల భూమి, వాతావరణం, నీళ్లు పూర్తిగా కలుషితమతాయని చెప్పారు. తద్వారా చర్మవ్యాధులు రావడంతో పాటుగా రేడియేషన్‌ తీవ్రత పెరిగి ప్రజలకు భయానకమైన క్యాన్సర్‌ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. పుట్టబోయే శిశువులు అంగవైకల్యం వస్తుందని, రోగాల బారిన పడతారని అన్నారు. సమస్యలు వచ్చినప్పుడు ప్రతిఒక్కరూ ప్రశ్నించే గొంతుకగా మారాలని పిలుపునిచ్చారు. ఉద్యమాలు, పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. యురేనియం వ్యతిరేక పోరాటం తెలంగాణ ఉద్యమ తరహాలో చేపట్టాలని అన్నారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ రాఘవాచారి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు వీర్లపల్లి శంకర్, బాల్‌రాజ్‌గౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, అశోక్, ప్రజాసంఘాల నాయకులు టీజీ శ్రీనివాస్, రవీంద్రనాథ్, తిరుమలయ్య, అర్జునప్ప, చంద్రారెడ్డి, సత్యం, శివారెడ్డి, శ్రీనివాస్, సిద్ధార్థ, కరుణాకర్, రఘు తదితరులు ఉన్నారు.     

మరిన్ని వార్తలు