హరిత హైదరాబాద్‌!

4 Apr, 2018 02:14 IST|Sakshi

     కాలుష్యానికి చెక్‌ పెట్టేందుకు గ్రేటర్‌ చుట్టూ అర్బన్‌ పార్కులు 

     హైదరాబాద్‌ను ఆనుకొని ఉన్న జిల్లాల్లోనూ ఏర్పాటుకు కసరత్తు  

     దశల వారీగా వచ్చే రెండేళ్లలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు 

     ఉన్నత స్థాయి సమావేశంలో అధికారుల నిర్ణయం

సాక్షి హైదరాబాద్‌: మహానగరంలో పెరిగిపోతున్న కాలుష్యానికి అర్బన్‌ పార్కుల నిర్మాణంతో చెక్‌ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఒక్క హైదరాబాద్‌ చుట్టూ మాత్రమే కాకుండా పక్కన ఆనుకొని ఉన్న 6 జిల్లాల్లోనూ పార్కుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు వీలైనంత త్వరగా అన్ని సౌకర్యాలతో కూడిన అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నత స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. హైదరాబాద్‌కు చుట్టుపక్కల ఉన్న 188 ఫారెస్ట్‌ బ్లాకుల్లో 129 ప్రాంతాలు పార్కుల నిర్మాణం, అభివృద్ధికి అనుకూలంగా ఉన్నట్లు అటవీశాఖ అధికారులు సమావేశంలో నివేదించారు. వీటిల్లో 70 ప్రాంతాలను ఫారెస్ట్‌ కన్జర్వేషన్‌ జోన్లుగా, మిగతా వాటిల్లో 52 ప్రాంతాలను అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులుగా, మరో ఏడు ప్రాంతాలను ఎకో టూరిజం జోన్లుగా రూపొందించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. 

సీఎం ఆదేశం మేరకు: సీఎస్‌ 
రానున్న రెండేళ్లలో దశలవారీగా పార్కులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని సీఎస్‌ ఎస్‌కే జోషి చెప్పారు. ఆ దిశగా అన్ని శాఖలు పనిచేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య, ఆహ్లాద, విహార సౌకర్యాలకు అనువుగా అన్ని అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను, ఎకో టూరిజం స్పాట్లను తీర్చిదిద్దాలన్నారు. అటవీశాఖ ఇప్పటికే చేపట్టిన అర్బన్‌ పార్క్‌లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. భాగ్యనగర్‌ నందనవనం, మేడిపల్లి ఫారెస్ట్‌ పార్క్, కండ్లకోయ ఆక్సిజన్‌ పార్కులు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్‌ మిశ్రా, మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్, రోడ్లు భవనాలు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ, పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ చిరంజీవులు, పంచాయతీరాజ్‌ కార్యదర్శి వికాస్‌రాజ్, పీసీసీఎఫ్‌ పీకే ఝా, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ తదితరులు పాల్గొన్నారు. 

వివిధ జిల్లాల పరిధిలో.. 
రంగారెడ్డి జిల్లా పరిధిలో 26 పార్కులు, మేడ్చల్‌లో 11, యాదాద్రిలో 6, మెదక్‌లో 4, సంగారెడ్డిలో 3, సిద్దిపేటలో 1, చొప్పన కొత్త పార్కుల నిర్మాణానికి అధికారులు రూపకల్పన చేశారు. తొలిదశలో అటవీశాఖ 15, హెచ్‌ఎండీఏ 17, జీహెచ్‌ఎంసీ 3, టీఎస్‌ఐఐసీ 11, ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 4, మెట్రోరైల్‌ 2 పార్కుల చొప్పున దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన నిధులు, మానవ వనరులను ఆయాశాఖలు సొంతంగా సమీకరణ చేసుకోవాలని లేదా కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ నిధులను వాడుకోవచ్చని సీఎస్‌ సూచించారు. వివిధ శాఖలు అర్బన్‌ పార్కులను అభివృద్ధి చేసి అటవీశాఖకు అప్పగిస్తే ఆ శాఖే నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుందన్నారు. టూరిజం శాఖ పరిధిలో మరో ఏడు చోట్ల ఎకో టూరిజంను పార్కులను అభివృద్ధి చేయనున్నారు. మేడ్చల్‌ జిల్లాలో మూడు, యాదాద్రి జిల్లాలో 4 చొప్పున ఎకో టూరిజం పార్కులు రానున్నాయి.  

మరిన్ని వార్తలు