స్కెచ్‌లతో సామాజిక చైతన్యం

24 Apr, 2020 18:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా గురించి చాలా మంది ఆర్టిస్ట్‌లు వివిధ రకాలుగా స్కెచ్‌లు వేస్తూ తమ క్రియేటివిటీకి పదునుపెడుతున్నారు. అయితే వీటిలో అర్బన్‌ స్కెచర్‌ / ఆర్టిస్ట్‌ శృతి దేవులపల్లి వేసిన స్కెచ్‌లు అందరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆర్బన్‌ స్కెచింగ్‌ అంటే మన దైనందిన జీవితంలో జరిగే అంశాలను ప్రధానంగా తీసుకొని వాటిని గీయడం. ఈ మధ్య ఇలాంటి స్కెచ్‌కి ఆదరణ పెరుగుతోంది. అందులోనూ ప్రస్తుత మహమ్మారిని ఎదురించడంలో అహర్నిశలు పనిచేస్తున్న వారికోసం శృతి గీసిన స్కెచ్‌లు అందరి మన్ననలు పొందుతున్నాయి.

కరోనాకు ముందు ప్రపంచ దేశాలు ఎలా ఉండేవి, కరోనా తరువాత దేశాలు ఎలా ఉన్నాయి అనే విషయానికి సంబంధించి శృతి గీసిన పెయింటింగ్‌ అందరిని విపరీతంగా ఆకర్షిస్తోంది. కరోనాకి ముందు దేశాలన్నీ వేటికి అవే వేరుగా ఉంటూ, ఒకదేశంపై మరొకటి ధ్వేషభావంతో ఉండేవి. పెద్ద పెద్ద దేశాలన్ని విధ్వేషపూరిత వైషమ్యాలతో ఉంటే చిన్న దేశాలు బాధతో సాయం కోసం ఎదురుచూస్తూ ఉండేవి. కానీ కరోనా మహమ్మారి కారణంగా దేశాలన్నింటినీ ఏకం చేసిన తీరును వివరిస్తూ కనిపించని ఈ మహమ్మారిపై యుద్దం చేయడానికి తమ మధ్య ఉన్న విబేధాలన్నింటిని పక్కన పెట్టి ఒక్కటైన తీరును ప్రతిబింబించేలా శృతి వేసిన స్కెచ్‌ అద్భుతంగా ఉంది.

అదే విధంగా కరోనా నుంచి దేశాన్ని కాపాడటానికి నిరంతరం పోరాటం చేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులకు సెల్యూట్‌ చేస్తూ సేవియర్స్‌ ఆఫ్‌ సాగా పేరుతో శృతి వేసిన స్కెచ్‌లను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌ కు మంచి ఆదరణ లభిస్తోంది. శృతి స్కెచ్‌లు ఎంతో మంది ప్రశంసలు పొందుతున్నాయి.  

మరిన్ని వార్తలు