సమస్యల నిలయాలు

18 Jan, 2015 14:42 IST|Sakshi

సుమారు 35శాతం జనాభా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో నివసిస్తున్నా మౌలిక సౌకర్యా లు లేక పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధునికతను సంతరించుకోవాల్సిన కాలనీలు మురికి కూపాలను తలపిస్తున్నాయి. అటు సొంత ఆదాయం సరిపోక, ఇటు ప్రభుత్వం నుంచి నిధులు సకాలంలో అందక పాలకమండళ్లు సతమతమవుతున్నాయి. పాలనను పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారుల పోస్టులు ఖాళీగా ఉండటం, సాంకేతిక సిబ్బంది లేకపోవడం మున్సిపాలిటీ లు మురుగు కూపాలుగా మారాయి.
 
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీలుండగా సుమారు 14లక్షలకు పైగా జనాభా పట్టణాల్లోనే ఉంటోంది. పట్టణీకరణ వేగంగా పెరుగుతుండడంతో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో జనాభా అంచనాలకు మించుతోంది. జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక సౌకర్యాల లేకపోవడంతో పట్టణాలు మురికి కూపాలను తలపిస్తున్నాయి. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 243 వార్డులకు 124 వార్డుల్లో మురికి వాడలుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. మున్సిపాలిటీలో సుదీర్ఘకాలంగా అంతర్భాగంగా ఉన్న కాలనీల్లో డ్రైనేజీలు, నల్లా కనెక్షన్లు ఆధునికీకరించడం లేదు. మరోవైపు శరవేగంగా వెలుస్తున్న కొత్త కాలనీల్లో సౌకర్యాలు కల్పించడంలేదు. నిధుల కొరతను పాలకమండళ్లు కారణంగా చూపుతున్నాయి.

గ్రేడ్-1 మున్సిపాలిటీ మహబూబ్‌నగర్‌లో గతంలో నిర్మించిన కోయిలసాగర్, రామన్‌పాడు తాగునీటి పథకాలు పూర్తి స్థాయి ఫలితాన్ని ఇవ్వడం లేదు. నారాయణపేట, షాద్‌నగర్, కల్వకుర్తిలో తాగునీటి ఎద్దడి తీవ్రస్థాయిలో ఉంది. గద్వాలలో చేపట్టిన తాగునీటిపథకం పనులు ఆగిపోయాయి. షాద్‌నగర్‌కు మెట్రో వాటర్‌వర్క్స్ నుంచి నీరు అందించాలని నిర్ణయించినా సాంకేతిక సమస్యల మూలంగా ప్రణాళిక ఆచరణలోకి రావడం లేదు. అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ చెత్త సేకరణ, తరలింపు, డంపింగ్ సమస్యగా తయారైంది. కనీసం ఒక్కో మున్సిపాలిటీ సగటున 20 నుంచి 50 ఎకరాల మేర డంపింగ్ యార్డు స్థలాలను సమకూర్చుకోవాల్సి ఉన్నా శ్రద్ధ చూపడం లేదు. మురికివాడల వాసులకు ఇళ్ల స్థలాలు, పక్కాగృహాలు నిర్మించి ఇవ్వడంతోపాటు జీవనోపాధి కల్పిం చాల్సి ఉన్నా పాలక మండళ్లు, ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు.

పట్టాలెక్కని పట్టణ పాలన
సుమారు రెండేళ్ల ప్రత్యేక అధికారుల పాలన అనంతరం ఎట్టకేలకు సుమారు ఐదునెలల క్రితం మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. కోర్టు కేసుల మూలంగా అచ్చంపేట, కొల్లాపూర్ నగర పంచాయతీల్లో ఎన్నిక నిలిచిపోయింది. అయితే మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, ఐజ మినహా అన్నిచోట్లా పూర్తిస్థాయి కమిషనర్లు లేకపోవడం పాలనపై ప్రభావం చూపుతోంది. మౌలిక వసతుల కల్పనలో కీలకంగా వ్యవహరించే సాంకేతిక సిబ్బంది లేకపోవడంతో సమస్యలు రెట్టింపవుతున్నాయి. ఎస్‌ఎఫ్‌సీ, టీఎఫ్‌సీ, ప్రణాళిక, ప్రణాళికేతర గ్రాంట్లు, బీఆర్‌జీఎఫ్ తదితర పద్దుల కింద నిధులు విడుదలవుతున్నా సకాలంలో అందడం లేదు.

ఆస్తి, నల్లా పన్ను, సేల్స్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు, ఇంటి నిర్మాణ అనుమతులు తదితరాల ద్వారా మున్సిపాలిటీలు సొంతంగా ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. అయితే ప్రభుత్వం ద్వారా అందే నిధులను ప్రత్యేకించిన పనులకే వాడాలనే నిబంధన కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగా తయారయ్యాయి. కొత్త బోరుబావుల తవ్వకం, మోటార్ల బిగింపు తదితరాల కోసం జనరల్ ఫండ్‌పైనే ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది.

మరిన్ని వార్తలు