రాష్ట్రంలో యూరియా సంక్షోభం

18 Jul, 2018 01:43 IST|Sakshi

దాదాపు 6 లక్షల టన్నుల కొరత

కీలక సమయంలో రైతులకు ఇబ్బందులే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో యూరియా సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. రాష్ట్రానికి యూరియా సరఫరా చేసే ప్రముఖ ఎరువుల కంపెనీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో దాదాపు 6 లక్షల టన్నుల కొరత ఏర్పడింది. ఎరువుల కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ, మార్కెటింగ్‌ అధికారులతో మార్క్‌ఫెడ్‌ అధికారులు సమావేశమై చర్చిస్తున్నారు.

ఇందుకు సంబంధించి మార్క్‌ఫెడ్‌ బుధవారం ప్రత్యేకంగా సమావేశమవుతోంది. యూరియా సంక్షోభం ఉందని తెలిస్తే రైతులు కంగారు పడతారని భావించిన అధికారులు అంతా బాగుందనే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ వద్ద బఫర్‌స్టాక్‌ 2 లక్షల టన్నుల వరకు సిద్ధంగా ఉండాలి. కానీ ఈ నెల మూడో తేదీ నాటికి నీమ్‌ కోటెడ్‌ యూరియా 91,367 టన్నులే ఉండటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఎందుకీ పరిస్థితి?: రాష్ట్రానికి యూరియాను సరఫరా చేసే కంపెనీల్లో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ ప్రధానమైంది. దేశవ్యాప్తంగా యూరియా తయారీ కంపెనీలు ఎదుర్కొంటున్నట్టే ఈ సంస్థ కూడా తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ సంస్థ నుంచి 15 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుంది. ఇందులో 6 లక్షల టన్నులు రాష్ట్రానికి సరఫరా అవుతుంది. ఇప్పుడు ఆ యూరియా నిల్వలు నిలిచిపోయే ప్రమాదం నెలకొంది.

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ అత్యంత కీలక దశలో ఉంది. తెలంగాణలో 1.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. అందుకోసం రాష్ట్రానికి 8 లక్షల టన్నుల యూరియా అవసరం. నాగార్జునలో ఉత్పత్తి నిలిచి పోవడంతో రాష్ట్రంలో 6 లక్షల టన్నుల యూరియా కొరత ఏర్పడనుంది. పరిస్థితిని పసిగట్టిన అధికారులు కోరమాండల్, ఇఫ్కో, క్రిబ్కో, జువారీ, స్పిక్‌ గ్రూపు సంస్థల ప్రతినిధులతో మంతనాలు జరుపుతున్నారు.

యూరియా కొరతను నివారించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా లేవు. ఈ పరిస్థితుల్లో రైతులకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. దేశంలో 32 యూరియా తయారీ కంపెనీలు ఉంటే వాటిల్లో 29 నష్టాల్లో ఉన్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.70 వేల కోట్ల వరకు సబ్సిడీ బకాయిలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు