ఎరువు కోసం ఎదురుచూపులు..

4 Sep, 2019 10:00 IST|Sakshi
మోపాల్‌ సొసైటీ వద్ద క్యూ లైన్‌లో నిల్చున్న రైతులు

మరో వెయ్యి మెట్రిక్‌ టన్నులు వచ్చిన యూరియా

మోపాల్‌లో క్యూ కట్టిన అన్నదాతలు..

పోలీస్‌ బందోబస్తు నడుమ పంపిణీ

సాక్షి, నిజామాబాద్‌: జిల్లాలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. ఎరువు కోసం ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే ఎదురైంది. తాజాగా మంగళవారం మరో వెయ్యి మెట్రిక్‌ టన్నులు మాత్రమే జిల్లాకు వచ్చింది. వీటిని అత్యవసరమున్న సొసైటీలు, కొంతమేరకు ప్రైవేటు డీలర్లకు సర్దుబాటు చేశారు. మోపాల్, ధర్పల్లి, ఇతర సొసైటీల వద్ద యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చున్నారు. అయినప్పటికీ రెండు, మూడు బస్తాల కంటే మించి ఇవ్వలేదు. దీంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలీస్‌ బందోబస్తు నడుమ యూరియాను పంపిణీ చేస్తున్నారు.

జిల్లాలో అన్ని పంటలు కలిపి 4.15 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. అందులో కేవలం వరి ఒక్కటే 2.34 లక్షల ఎకరాల్లో సాగైంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 2.08 లక్షల ఎకరాలు మాత్రమే. ఈసారి అంచనాకు మించి సాగుచేశారు. ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాకు 60 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమని అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు కేవలం 37,700 మెట్రిక్‌ టన్నులు మాత్రమే జిల్లాకు చేరింది. ఆగస్టు నాటికి 54 వేల మెట్రిక్‌ టన్నులు అవసరం ఉంటుందని నివేదిక సమర్పించగా, సుమారు 15 వేల మెట్రిక్‌ టన్నులు తక్కువగా వచ్చింది.

మోపాల్‌లో టోకెన్లు పంపిణీ..
మండలకేంద్రంలోని సొసైటీలో మంగళవారం 450 బస్తాల వరకు యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న కంజర్, సిర్‌పూర్, మోపాల్, ముల్లంగి, నర్సింగ్‌పల్లి, న్యాల్‌కల్‌ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. క్యూ లైన్‌లో గంటల తరబడి వేచి ఉన్నారు. 450 బస్తాలకు సంబంధించిన బిల్లులు ముగియడంతో ఆ తర్వాత నేడు, రేపు రానున్న యూరియా లోడ్‌ కోసం టోకెన్లు పంపిణీ చేశారు. చాలామంది రైతులు అసంతృప్తితో వెనుదిరిగారు.

రైతుల పడిగాపులు
భీమ్‌గల్‌: మండల కేంద్రంలో మంగళవారం రైతులు యూరియా కోసం రోజంగా పడిగాపులు పడ్డారు. యూరియా లోడు వస్తుందని వదం రావడంతో రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి పట్టణంలోని నందిగల్లీలోని సొసైటీ గోదాం వద్ద బారులు తీరారు. ఇది అంతకంతకూ పెరిగిపోయి రైతులు వందల సంఖ్యలో పోగయ్యారు. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల క్యూలైన్‌ అంతకంతకూ పెరిగిపోయింది. ఉదయం నుండి సాయంత్రం వరకు చినుకులు కురుస్తున్నా కదలకుండా ఉండిపోయారు. దీంతో పోలీసులు సూచన మేరకు సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు టోకెన్లు పంపిణీ చేశారు. యూరియాను బుధవారం పంపిణీ చేస్తామని తెలిపారు.

గోన్‌గొప్పుల్‌లో...
గోన్‌గొప్పుల్‌ పరిధిలోని ముచ్కూర్‌ సొసైటీ ఆధ్వర్యంలో యూరియా లారీ లోడు తరలించారు. దీంతో గ్రామంలోని వందలాది మంది రైతులు యూరియా బస్తాల కోసం తరలివచ్చారు. తమకు యూరియా దక్కుతుందో లేదో అన్న ఆందోళన మాత్రం రైతుల్లో స్పష్టంగా కనిపించింది.

యూరియా కొరత తీర్చండి 
ఆర్మూర్‌ అర్బన్‌: రైతులకు యూరియా కొరత తీర్చాలని ఏఐకేఎంఎస్‌ (రైతుకూలీసంఘం)ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. రైతుకూలీసంఘం నాయకులు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 15 శాతం వరి సాగు పెరగడంతో యూరియా కొరత తీవ్రమైందన్నారు జిల్లా వ్యాప్తంగా 60 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉంటే ప్రభుత్వం వద్ద కేవలం 35 వేల మెట్రిక్‌ టన్నుల నిల్వ మాత్రమే ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ముందు చూపులేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. తక్షణమే ప్రభుత్వం జిల్లాకు సరిపడా యూరియా తెప్పించి రైతులకు సర ఫరా చేయాలని డిమాండ్‌ చేశారు.

హాసకొత్తూర్‌లో..
కమ్మర్‌పల్లి: మండలంలోని హాసకొత్తూర్‌లో రైతులు యూరియా కోసం పాట్లు పడుతున్నారు. చౌట్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోకి మంగళవారం 450 బస్తాల యూరియా వచ్చింది. హాసకొత్తూర్‌కు 150 బస్తాల యూరియాను కేటాయించారు. వెయ్యి బస్తాల వరకు యూరియా రైతులకు అవసరం కాగా, తక్కువగా రావడంతో గందరగోళం నెలకొంది. ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున విక్రయించారు. రెండు రోజుల్లో యూరియాను సరఫరా చేస్తామని సొసైటీ అధికారులు తెలపడంతో రైతులు శాంతించారు.

నాలుగైదు రోజుల నుంచి తిరుగుతున్న.. 
నేను ఐదెకరాల్లో వరి పంట సాగుచేస్తున్నాను. ఎనిమిది సంచుల యూరియా అవసరం. నాలుగైదు రోజుల నుంచి రోజూ తిరుగుతున్న. యూరియా మాత్రం దొరకడం లేదు. ఎరువు చల్లే సమయం మించిపోతోంది. మొన్న రెండు గంటలు లైన్‌లో ఉంటే టోకెన్‌ రాసిచ్చారు. ఇప్పుడు అది తీసుకొస్తే పని చేయదని చెప్పి పంపిస్తున్నారు. ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నాను.
–మల్లేష్, రైతు, మోపాల్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా