జిల్లాల్లో యూరియా ఫైట్‌

5 Sep, 2019 03:39 IST|Sakshi

పాత జిల్లా స్టాక్‌ పాయింట్ల నుంచి కొత్త జిల్లాలకి కదలని స్టాక్‌

కొత్త జిల్లాలకు కేటాయింపులు నిలిచిపోవడంతో రైతుల గగ్గోలు

యూరియా కోసం.. 
ఎరువుల కోసం రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. సరిపడా ఎరువులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. ఫలితంగా కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండల కేంద్రంలో యూరియా కోసం మంగళవారం టోకెన్లు పంపిణీ చేయగా.. బుధవారం తెల్లవారుజాము నుంచే సొసైటీ గోదాం వద్ద రైతులు క్యూ కట్టారు.      
–భీమ్‌గల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: పాత జిల్లాలకు, కొత్త జిల్లాలకు మధ్య యూరియా పోరు నడుస్తోంది. పాత జిల్లాల్లోని మార్క్‌ఫెడ్‌ స్టాక్‌ పాయింట్ల నుంచి కొత్త జిల్లాలకు సరఫరా కావాల్సిన యూరియాను అనేక చోట్ల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు. కొన్ని జిల్లాల కలెక్టర్లయితే స్టాక్‌ వెళ్లనీయకుండా లిఖిత పూర్వక ఆదేశాలు ఇస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు కూడా తమ ప్రాంతానికే దక్కాలని మొండిపట్టు పడుతున్నారు. దీంతో కొత్త జిల్లాలకు సరఫరా నిలిచిపోవడంతో యూరియా కొరత పీడిస్తోంది. దీంతో ఆయా జిల్లాల రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఫలితంగా యూరియా నల్లబజారుకు తరలిపోయింది. దీంతో ఒక్కసారిగా యూరియా ధర పెరిగింది. ఇటీవల వర్షాలు కురవడం, వరి నాట్లు బాగా పడటం, యూరియా వినియో గం పెరగడంతో పాత జిల్లాల రైతులు ఆవేదన చెందుతున్నారు. కొందరు మంత్రులు తమ నియోజకవర్గం ఉన్న జిల్లాకే ప్రాధాన్యమిస్తున్నారు.   

బఫర్‌స్టాక్‌ పాయింట్లు పాత జిల్లాల్లోనే 
ఈసారి ఖరీఫ్‌లో 19.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు లక్ష్యంగా వ్యవసాయశాఖ ప్రణాళిక రచించింది. అందులో యూరియానే 8.50 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉంది. గత నెల రాష్ట్రానికి రావాల్సిన 2.21 లక్షల మెట్రిక్‌ టన్నుల్లో 1.04 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే వచ్చింది. ఇక సెప్టెంబర్‌కు రెండు లక్షల టన్నుల యూరియాను కేటాయించాలని వ్యవసాయశాఖ కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో 60 వేల మెట్రిక్‌ టన్నుల యూరియానే అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. మార్క్‌ఫెడ్‌ వద్ద ఎప్పుడూ 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా బఫర్‌ స్టాక్‌గా ఉండాలి. కేం ద్రం నుంచి రాకపోవడం, ఉన్న నిల్వలను రైతుల కు అందజేయడంతో స్టాక్‌ 20 వేల మెట్రిక్‌ టన్నులకు పడిపోవడంతో కొరత ఏర్పడింది. మార్క్‌ఫెడ్‌ బఫర్‌ స్టాక్‌ పాయింట్లన్నీ పాత జిల్లాల్లో ఉన్నాయి. కొత్త జిల్లాల కోటాను పాత జిల్లాలే ఇలా వాడుకోవడంతో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఉదాహరణకు నిజామాబాద్‌ జిల్లా స్లాక్‌ పాయింట్‌ నుంచి కామారెడ్డి జిల్లాకు యూరియా పంపవద్దని అక్కడి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ  పరిస్థితిని చక్కదిద్దడంలో అక్కడి జిల్లా వ్యవసాయశాఖ అధికారి విఫలం కావడంతో వ్యవసాయశాఖ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా ఆయనకు నోటీసులు జారీ చేశారు. కాగా రాష్ట్రంలో యూరియా కొరత లేదని రాహుల్‌ బొజ్జా తెలిపారు. 

నాయకుల తీరుపై మండిపాటు
ఆయన వ్యవసాయశాఖ పరిధిలోని ఒక కార్పొరేషన్‌కు చైర్మన్‌. తన ప్రాంత పరిధిలోని వ్యవసాయ సహకార సొసైటీకి అవసరమున్నా లేకపోయినా అత్యధికంగా యూరియా కేటాయింపు లు చేసుకున్నాడు. తనకు సన్న యూరియానే కావాలని పట్టుబట్టి కేటాయించుకున్నాడు. పక్క జిల్లాకు తనకు సంబంధం లేదని వాదన పెట్టు కున్నాడు. అదే శాఖలో మరో కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ఉన్న నాయకుడి తీరు కూడా అలాగే ఉంది. తన జిల్లాకే ప్రాధాన్యం ఇవ్వాలని, పక్క జిల్లాకు 500 టన్నులు పంపాల్సి ఉన్నా దాన్ని అడ్డుకుంటున్నారని వ్యవసాయశాఖ వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. ఆ కార్పొరేషన్‌ చైర్మన్‌ వ్యవసాయ కమిషనర్‌ను కలిసి ఈ మేరకు విన్నవించినట్లు తెలిసింది. జిల్లాల మధ్య పోరు, కొందరు నాయకుల తీరు వల్ల కృత్రిమ కొరత తలెత్తిందన్న విమర్శలున్నాయి. దీంతో యూరి యా ధర ఒక్కసారిగా పెరిగింది. 

మరిన్ని వార్తలు