ఆహ్వానం అందినా..వీసా ఇవ్వలేదు

12 Sep, 2019 09:57 IST|Sakshi
వీసా దరఖాస్తు పత్రాలు చూపిస్తున్న డీడీఎస్‌ ప్రతినిధులు

పంజగుట్ట: వారు అసాధారణ మహిళలని గుర్తించిన ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రామ్‌ (యూఎన్‌డీపీ) ప్రతిష్టాత్మకమైన ఈక్వేటారి అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 19 నుండి 26 వరకు న్యూయార్క్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకునేందుకు రావాలని ఆహ్వానం పంపారు. అయితే న్యూయార్క్‌ వెళ్లేందుకు సిద్ధపడిన వారికి యూఎస్‌ కన్సోలేట్‌ కార్యాలయంలో అధికారులు వారి వీసాను తిరస్కరించారు. మహిళా రైతులుగా డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ (డీడీఎస్‌) ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన తాము అవార్డు తీసుకునేందుకు వీసాకు దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తులపై వేలిముద్రలు తీసుకున్న అధికారులు బుధవారం రావాల్సిందిగా కోరారని, బుధవారం వెళ్లగా వీసా రిజెక్ట్‌ అయ్యిందని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీడీఎస్‌ కో–డైరెక్టర్‌ జయశ్రీ, సభ్యురాలు అనసూయమ్మ, అఖిల భారత చిరుధాన్యాల చెల్లెండ్ల సమాఖ్య అధ్యక్షురాలు మొగులమ్మ, బయోడైవర్సిటీ ఫిలిం మేకర్‌ అవార్డు గ్రహీత మసనగారి మయూరి మాట్లాడుతూ ..

గత 30 ఏళ్లుగా స్థానికంగా ఉన్న వనరులతో పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా, వారి సమస్యలను పరిష్కరించుకుంటున్నారని గుర్తించి యూఎన్‌డీపీ ఈక్వెటారీ అవార్డుకు ఎంపిక చేసిందన్నారు. ఈ అవార్డుకు 127 దేశాలనుండి 847 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 20 మందిని మాత్రమే ఎంపిక చేసిందని, అందులో తెలుగు రాష్ట్రాల నుండి డీడీఎస్‌ మాత్రమే ఎంపికయ్యిందన్నారు. అవార్డును అందుకునేందుకు మొగలమ్మ, అనసూయమ్మలను వారికి ట్రాన్సిలేటర్‌గా మయూరిని పంపేందుకు నిర్ణయించుకున్నట్లు జయశ్రీ తెలిపారు.  గత 30 ఏళ్లగా డీడీఎస్‌లో పనిచేస్తున్నానని 24 గ్రామాల్లో 1200 బీడుపడిన పొలాల్లో 20 లక్షల చెట్లు నాటినట్లు అనసూయమ్మ తెలిపారు. దీనిని గుర్తించి అవార్డు ఇస్తానని పిలిస్తే ఇక్కడే ఆటంకాలు ఎదురుకావడం బాధగా ఉందన్నారు. అవార్డుకు ఎంపికైనట్లు ప్రకటించగానే జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు ఘనంగా సత్కరించారని గుర్తుచేశారు.  పర్యావరణాన్ని కాపాడుతూ చిరుధాన్యాలను ప్రొత్సహిస్తున్నానని మొఘలమ్మ తెలిపారు. తన వద్ద 70 రకాల చిరుధాన్యాల విత్తనాలు ఉన్నాయని, సుమారు 30 రకాల పంటలు తానే పండిస్తున్నట్లు తెలిపారు. యూఎస్‌ నుంచి వచ్చిన ప్రతినిధులు సుమారు 15 రోజులు ఇక్కడే ఉండి తమ వ్యవసాయ విధానాలను పరిశీలించి డాక్యుమెంటరీ కూడా తీసుకున్నట్లు తెలిపారు. మొదటిసారి విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చిందని ఇప్పుడూ అడ్డంకులు సృష్టిస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి వీసా వచ్చేలా చేయాలన్నారు. 

మరిన్ని వార్తలు