ఓయూ విద్యార్థులకు అమెరికా చదువులు

28 Mar, 2018 08:28 IST|Sakshi

నాలుగు కోర్సుల్లో ఏటా 40 మందికి ఉచిత విద్య  

మెరిట్, ఆసక్తి గలవారికి అవకాశం  

పూర్వవిద్యార్థి దీపక్‌కాంత్‌వ్యాస్‌ ఔదార్యం

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ విద్యార్థులకు అమెరికాలో ఉచితంగా చదువుకునే అవకాశం దక్కనుంది. ప్రతిభ, ఆసక్తి గల విద్యార్థులకు అమెరికాలో వ్యాపారవేత్తగా స్థిరపడిన నగరానికి చెందిన ఓయూ పూర్వ విద్యార్థి దీపక్‌కాంత్‌ వ్యాస్‌ ఈ అవకాశం కల్పిస్తున్నారు. నాలుగు కోర్సుల్లో  ఏటా 40 మంది మెరిట్‌  విద్యార్థులకు అమెరికాలోని  యూనివర్సిటీ ఆఫ్‌ మిసౌరీ, సెయింట్‌ లూయిస్‌ వర్సిటీలో  ఉన్నత విద్యావకాశం కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవల ఓయూ వీసీ ప్రొ.రామచంద్రం, యూనివర్సిటీ ఆఫ్‌ మిసౌరీ సెయింట్‌ లూయిస్‌ వీసీ థామస్‌ ఎఫ్‌ జార్జ్‌తో దీపక్‌కాంత్‌ వ్యాస్‌  ఇటీవల ఒప్పందం కుదిర్చారు. ఈ విద్యా సంవత్సరం (2018–19) నుంచి నాలుగు కోర్సులకు సంబంధించిన 40 మంది విద్యార్థులు అమెరికాలోని మిసౌరీ రాష్ట్రంలో  ఉన్నత విద్య అభ్యసించనున్నారు. 

అమెరికాలో చదివే కోర్సులివే
ఓయూలో కొనసాగుతున్న ఐదేళ్ల ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్, ఎంఏ మాస్‌ కమ్యూనికేషన్, ఎంబీఏ కోర్సులు చదివే విద్యార్థులు అమెరికాలో చదువుకునేలా ఒప్పందాలు కుదిరాయి. పారదర్శకంగా నిష్పక్షపాతంగా విద్యార్థులను ఎంపిక చేసేందుకు విధివిధానాలు, నియమనిబంధనలు రూపొందించేందుకు ఓయూ అధికారులు ఇటీవల ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఒప్పందం ప్రకారం ఐదేళ్ల ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు మూడు సంవత్సరాలు ఓయూలో చదివి రెండేళ్లు ఎంఎస్‌ కెమిస్ట్రీగా  యూనివర్సిటీ ఆఫ్‌ మిసౌరీ సెయింట్‌ లూయిస్‌ వర్సిటీలో  చదవాలి. కం ప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ కోర్సును నాలు గు సంవత్సరాలు చదివి,  అక్కడ చివరి సంవత్సర ం ఎంఎస్‌ కంప్యూటర్‌ సైన్స్‌గా ఏడాది చదవా ల్సి ఉంటుంది, ఎంఏ కమ్యూనికేషన్స్, ఎం బీఏ కోర్సులను ఇక్కడ ఒక సంవత్సరం, అమెరికాలో మరో సంవత్సరం చదవాలి. కోర్సుల పూర్తయిన తర్వాత వేర్వేరుగా సర్టిఫికెట్లు అందజేయనున్నారు. డ్యూయల్‌ డిగ్రీ విధానంలో చదివే విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు లభిస్తాయని ఓయూ అధికారులు తెలిపారు.

ఎవరీ దీపక్‌కాంత్‌ వ్యాస్‌
హైదరాబాద్‌ నగరానికి చెందిన దీపక్‌కాంత్‌ వ్యాస్‌ 30 ఏళ్ల క్రితం ఓయూ క్యాంపస్‌ సైన్స్‌ కళాశాలలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలో ఉద్యోగం సాధించారు. ఉద్యోగంతో సంతృప్తి చెందని ఆయన ఐటీ కంపెనీ ఏర్పాటు చేసి అనతి కాలంలోనే ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గత ఏడాది ఓయూ నిర్వహించిన పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి హాజరైన దీపక్‌కాంత్‌ వ్యాస్‌ వీసీ ప్రొ.రాంచంద్రంతో సమావేశమయ్యారు. తను చదివిన ఓయూకు ఏదో విధంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చిన ఆయన ఓయూ విద్యార్థులను అమెరికాలో ఉచితంగా చదివించేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగం గానే దీపక్‌కాంత్‌వ్యాస్‌ ట్రస్ట్‌ ద్వారా యూనివర్సిటీ ఆఫ్‌ మిసౌరీ సెయింట్‌ లూయిస్‌లో చదివేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఎంపిక కోసం ఓయూ అధికారులు కసరత్తు ప్రారంభించారు.

సువర్ణావకాశం: వీసీ  
శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో ఓయూ విద్యార్థులకు అమెరికాలో చదివే   అవకాశం లభించడం హర్షనీయమని  వీసీ ప్రొ.రాంచంద్రం అన్నారు. ఓయూలో 90 శాతం మంది  విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారేనన్నారు. వారిలో ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందుల కారణంగా విదేశీ విద్యకు నోచుకోవడం లేదన్నారు. ఓయూ పూర్వవిద్యార్థి దీపక్‌కాంత్‌ వ్యాస్‌ చేయూతతో నాలుగు  కోర్సుల్లో 10 మంది చొప్పుర అత్యధిక మార్కులు సాధించే విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు తెలి పారు. విద్యార్థులు  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

మరిన్ని వార్తలు