మట్టికి జైకొట్టి..

16 Feb, 2019 01:41 IST|Sakshi

పెరుగుతున్నమట్టి పాత్రల వినియోగం..

 కుమ్మరి కొలిమిలకుకొత్త కళ.. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోశిక్షణ కార్యక్రమాలు.. 

రసాయనాలు లేకుండా.. సహజసిద్ధమైన మట్టితో తయారీ 

ఓల్డు మళ్లా గోల్డు అయింది.. మట్టి పాత్రల వినియోగం జనంలో మళ్లీ పెరిగింది.. దీంతో కుమ్మరి కొలిమిలు కళకళలాడుతున్నాయి.. అటు ప్రభుత్వమూ మట్టిపాత్రల వాడకం, కులవృత్తులకు ప్రోత్సాహాన్నిస్తుండటంతో మార్కెట్లో మట్టి పాత్రలు సందడి చేస్తున్నాయి.  మట్టి పాత్రల్లో వండిన ఆహారం..పోషక విలువల గురించి ఈమధ్య అవగాహన పెరిగింది. దీంతో జనం వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకువస్తున్నారు.  

జిల్లాకు 30 మంది చొప్పున.. 
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు 30 మంది చొప్పున ఎంపిక చేసి వారికి హైదరాబాద్‌లోని రామానంద తీర్థ చేతి వృత్తుల సంస్థలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 40 వేల మంది కుమ్మరులకు శిక్షణ అందించారు. మెషీన్‌ ద్వారా మట్టి పాత్రల తయారీపై శిక్షణ పొందినవారు జనం అభిరుచికి తగ్గట్లు వివిధ రకాల పాత్రలను తయారు చేస్తున్నారు. వారికి కావాల్సిన డిజైన్లలో రూపొందించి.. మార్కెటింగ్‌ చేస్తున్నారు.

సురాయిలు, రంజన్లు, కుండలు, గ్లాసులు, వాటర్‌బాటిళ్లు, దీపపు ప్రమిదలు, బిర్యానీ పాత్రల వంటివి వేలాది ఆకృతుల్లో మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. వీటి ధర సైజు, నాణ్యతను బట్టి రూ.20 మొదలుకుని రూ.1,000 వరకు ఉంటున్నాయి. దేశీయ సంప్రదాయ పాత్రలు కావడంతో జనం కూడా వీటి వాడకాన్ని ఇష్టపడుతున్నారు. ఈ తరహా శిక్షణ కోసం గతంలో అప్పటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న నేతృత్వంలోని అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించింది. మెషీన్ల ద్వారా మట్టి పాత్రలు తయారు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.  

రాయితీ కల్పిస్తున్నాం.. 
చేతి వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇప్పటికే జిల్లాలలో స్టాల్స్‌తో పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అటు ఉపాధినీ కల్పిస్తున్నాం. పర్యావరణానికి మేలు చేసే మట్టి పాత్రల తయారీలో ప్రభుత్వం తరఫున శిక్షణ పూర్తి చేసిన వారికి రూ.2 లక్షల విలువైన తయారీ, అమ్మకాల యూనిట్‌ను రాయితీతో ఇస్తున్నాం..  
అలోక్‌ కుమార్, బీసీ సహకార ఆర్థిక సంస్థ,
కార్యనిర్వాహక డైరెక్టర్‌ 

మార్కెటింగ్‌పై దృష్టి సారించాలి 
వృత్తి శిక్షణ పొందిన వారు ఉపాధి దిశగా ముందుకు సాగడానికి ప్రభుత్వం వాటికి మార్కెటింగ్‌తోపాటు పట్టణ ప్రాంతాల్లో స్టాల్స్‌ ఏర్పాటు చేస్తే ఆదాయం కూడా పెరుగుతుంది. కోల్‌కతా, గుజరాత్‌ నుంచి వచ్చే మట్టి పాత్రల రేటు ఎక్కువగా ఉంటోంది. వాటి తయారీలో కొంత మేరకు రసాయనాలు వాడతారు. వీటి ద్వారా వాటి ఫినిషింగ్‌లో తేడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ తయారు చేసే మట్టి పాత్రలు సహజసిద్ధమైన మట్టితో తయారవుతాయి.  
నడికుడి జయంత్‌రావు రాష్ట్ర శాలివాహన ఫెడరేషన్‌ అధ్యక్షుడు 

మరిన్ని వార్తలు