ప్రజావసరాలకు ట్రస్టు నిధుల వినియోగం  

24 Aug, 2018 14:36 IST|Sakshi
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్, మంత్రి

అటవీశాఖ మంత్రి జోగు రామన్న

 కలెక్టరేట్‌లో జిల్లా ఖనిజ ట్రస్ట్‌ సమావేశం

ఆదిలాబాద్‌, అర్బన్‌ : విద్యార్థులు, ప్రజల అత్యవసర చిన్న పనులకు జిల్లా ఖనిజ ట్రస్టు నిధులను వినియోగించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా ఖనిజ ట్రస్టు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ జిల్లాలో మైనింగ్‌ వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో వివిధ పనులు చేపట్టడం, అత్యవసరమైన పనులకు మాత్రమే వినియోగించాలని సూచించారు. జిల్లాలో సుమారు రూ.కోటి రూపాయలు ఉన్నాయని, ఆ నిధులకు శాఖల వారీగా ప్రతిపాదనలు స్వీకరించాలని పేర్కొన్నారు.

ప్రజల ఆరోగ్యం, విద్య, రహదారులు వంటి పనులు చేపట్టాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ మాట్లాడుతూ రాష్ట్ర జిల్లాల ఖనిజ ట్రస్ట్‌ నియామావళి 2015ను ఏర్పాటు చేశారని తెలిపారు. జిల్లాలో 249 గ్రామాల్లో ఖనిజ ప్రాంతాల ప్రభావితం ఉందన్నారు. మైనింగ్‌ ద్వారా వసూలైన రాయల్టీ, సీనరేజీ చార్జీలను మైనింగ్‌ వల్ల ప్రభావితం అయిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టడానికి ఖనిజ ట్రస్టు అకౌంట్‌లో నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు.

15 శాతం నిధుల నుంచి వివిధ ఖర్చులు పోనూ 85 శాతం నిధులతో అభివృద్ధి పనులు చేపడుతామని తెలిపారు. ఇందులో నుంచి 85 శాతం తాగునీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలు, విద్య, స్త్రీ శిశు సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, పారిశుధ్యం కోసం 60 శాతం, ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు వినియోగిస్తామని తెలిపారు.

ప్రజల ఆరోగ్యం కోసం రిమ్స్, పీహెచ్‌సీలకు కావాల్సినవి ప్రతిపాదించాలని రిమ్స్‌ పర్యవేక్షకుడు అనంత్‌రావు, డీఎంహెచ్‌వో రాజీవ్‌రాజ్‌ను ఆదేశించారు. అంగన్‌వాడీల్లో కావాల్సినవి, పాఠశాలలు, కళాశాలల్లో మరుగుదొడ్లు, వసతి గృహాలు, కేజీబీవీలో ఇన్వర్టర్లు, ఆర్వో ప్లాంట్‌  ప్రతిపాదించాలని అన్నారు. అనంతరం ఇంటింటికీ అంగన్‌వాడీ కౌన్సెలింగ్‌ పుస్తకాలను మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు, డీఎఫ్‌వో ప్రభాకర్‌రావు, డీఆర్డీవో రాజేశ్వర్, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు